అంతా అందంగా.. (మెదక్)

 

మెదక్, ఏప్రిల్ 29 (globelmedianews.com): 
నీటివనరుల పరిరక్షణ, మత్స్య సంపద పెంపు, వ్యవసాయానికి భరోసాతోపాటు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ కాకతీయ కింద చేపట్టిన మినీ ట్యాంక్‌బండ్‌ల నిర్మాణాలు జిల్లాలో పూర్తికావొచ్చాయి. సివిల్‌ వర్క్స్‌ పూర్తి కాగా.. పర్యాటక శాఖ  ఆధ్వర్యంలో తుదిమెరుగులు దిద్దనున్నారు. మరో నెల, రెండు నెలల్లో అంటే వర్షాకాలంలో మెతుకు సీమ ఆహ్లాదసీమగా మారనుంది. దీంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మిషన్‌ కాకతీయ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 2015లో  ప్రతిష్టాత్మకంగా మినీ ట్యాంక్‌బండ్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నియోజకవర్గానికి ఒకటి చొప్పున అందుబాటులో ఉన్న పెద్ద చెరువులను ఎంపిక చేసి.. విడతల వారీగా అభివృద్ధి చేయాలని సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ మేరకు జిల్లా కేంద్రం, మెదక్‌ నియోజకవర్గ పరిధిలోని పిట్లం, గోసముద్రం మినీ ట్యాంక్‌బండ్‌ పనులు తుది దశలో కొనసాగుతున్నాయి. దీంతోపాటు నర్సాపూర్‌లోని రాయరావు  చెరువు బ్యూటిఫికేషన్‌ సైతం పూర్తయింది. ఈ నేపథ్యంలో జిల్లా ప్రత్యేక శోభను సంతరించుకోనుంది.
మెదక్‌ పట్టణ సమీపంలోని పిట్లం, గోసముద్రం చెరువులు రెండింటినీ కలిపి మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేసేందుకు 2016లో అనుమతులు వచ్చాయి.


అంతా అందంగా.. (మెదక్)

ఈ మేరకు రూ.9.52 కోట్లు మంజూరు కాగా.. మిషన్‌ కాకతీయ పథకంలో సివిల్‌ వర్క్స్‌ చేపట్టారు. ఈ పనులు తుది దశలో ఉన్నాయి. ఇప్పటివరకు సుమారు రూ.7 కోట్ల వ్యయమైనట్లు అధికారులు చెబుతున్నారు. కట్టల బలోపేతం, వెడల్పు, జంక్షన్‌ పాయింట్ల నిర్మాణాలు చేశారు. కట్టపైన రెయిలింగ్‌ పనులు కొనసాగుతున్నాయి. ఈ లెక్కన సివిల్‌ వర్క్స్‌ పూర్తయినట్లే. ఆ తర్వాత పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గ్రీనరీ, అలంకరణ, వసతుల కల్పన వంటి పనులు చేపట్టాల్సి ఉంది. ఇది పూర్తయితే పిట్లం, గోసముద్రం మినీ ట్యాంక్‌ బండ్‌ అందుబాటులోకి వచ్చినట్లే.మరోవైపు మెదక్‌ నియోజకవర్గంలోని రామాయంపేటలో ఉన్న మల్లెచెరువును సైతం మినీట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. మొదటి దఫాలో రూ.3 కోట్ల పైచిలుకు నిధులు మంజూరు కాగా.. పనులు గత నెలలో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం కట్టపై బ్రిడ్జి నిర్మాణంతోపాటు కట్ట వెడల్పు పనులు కొనసాగుతున్నాయి. ఇది కూడా నెల, రెండు నెలల్లో పూర్తి కానున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇది పూర్తయితే పట్టణ ప్రజలకు ప్రధానంగా మురికి నీటి సమస్య తొలగడంతోపాటు ఆహ్లాదకర వాతావరణం అందుబాటులోకి రానుంది.నర్సాపూర్‌ నియోజకవర్గంలోని రాయరావు చెరువు బ్యూటిఫికేషన్‌కు తొలివిడతగా రూ.2.90 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో చెరువు కట్ట బలోపేతం, పంట కాల్వల నిర్మాణంతోపాటు బతుకమ్మ పండుగకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. దీంతోపాటు నర్సాపూర్‌కు చెందిన జెడ్పీ చైర్‌పర్సన్‌ రాజమణిమురళీధర్‌ యాదవ్‌ దంపతులు తమ కుమారుడు అజయ్‌ యాదవ్‌ స్మారక ట్రస్టు ఆధ్వర్యంలో చెరువు కట్టపై పలు అభివృద్ధి పనులు చేపట్టారు. పట్టణ పరిధిలోని బీవీ రాజు ఇంజినీరింగ్‌ కాలేజీ యాజమాన్యం సహకారంతో కట్టపై విద్యుద్దీకరణ, వాకింగ్‌ ట్రాక్, కట్టపై గ్రిల్స్‌ ఏర్పాటు, మొక్కలు నాటడం, బెంచీల ఏర్పాటు, ఓపెన్‌ జిమ్‌ పరికరాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రాయరావు చెరువు బ్యూటిఫికేషన్‌ పూర్తి కాగా.. మినీ ట్యాంక్‌బండ్‌ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదించే యోచనలో ఉన్నారు.

No comments:
Write comments