అశ్వారావుపేట లో రేణుకా చౌదరి రోడ్ షో

 

అశ్వారావుపేట, ఏప్రిల్ 04 (globelmedianews.com)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. నియోజకవర్గంలోని అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, అన్నపురెడ్డి  పల్లి,చండ్రుగొండ మండలాల్లో పార్లమెంట్ అభ్యర్థి రేణుకా చౌదరి రోడ్ షో నిర్వహించారు.మండల కేంద్రాలలో నిర్వహించిన సభల్లో రేణుకా చౌదరి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఆపడం ఎవ్వరితరం కాదని అన్నారు. ఖమ్మం ఆడపడుచు అనే అభిమానంతో పాటు,ఖమ్మం అభ్యర్థి అనే అభిమానం కూడా ప్రజలలో కన్పిస్తుందని అన్నారు.ఎన్నో ఆశలతో ఓట్లేసి కేంద్రంలో బీజేపీని  గెలిపిస్తే మోదీ ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు వంటి అనాలోచిత చర్యలతో పేద,మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచిందని ఆమె విమర్శించారు. జిల్లాలో అభివృద్ధి చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీయేనని,పాలేరు నుండి పర్ణశాల వరకు వేలకోట్ల రూపాయల నిధులతో ఎంతో అభివృద్ధి చేశానని ఆమె చెప్పారు.


అశ్వారావుపేట లో రేణుకా చౌదరి రోడ్ షో

జిల్లాలో పొగాకు రైతుల సమస్యలను తీర్చిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అని పేర్కొన్నారు.రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే జామాయిల్, పామాయిల్, సుబాబుల్ రైతులకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తామని హామీనిచ్చారు. ఖమ్మం ప్రజలందరూ తనను తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తారని,ఉగాది కానుకగా అమూల్యమైన ఓటును వేసి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.నామా నాగేశ్వరరావు కు ఓటేస్తే ఖమ్మం ప్రజలందరికీ నామాలు పెడతారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు సీఎం కేసీఆర్ కు,ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కు నామాలు పెట్టి వెనక్కి పంపాలని ఆమె కోరారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట,ఇక్కడ టీఆర్ఎస్ ఆటలు సాగనివ్వమని, కాంగ్రెస్ పార్టీ బడుగుబలహీన,దళిత,మైనార్టీ వర్గాల పక్షపాతి అని ఆమె అన్నారు.జిల్లాలో పోడు భూముల సమస్యను సృష్టించి టీఆర్ఎస్ ప్రభుత్వం రాక్షస ఆనందం పొందుతుందని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను పాటిస్తోందని,ఖమ్మంలో రైతులకు బేడీలు వేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే అని అన్నారు.పోడు భూముల జోలికొస్తే సహించేది లేదని,గిరిజనుల హక్కుల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ అలుపెరుగని పోరాటం చేస్తుందని ఆమె అన్నారు.
రాష్ట్రంలో పార్టీలు మారింది ఐరన్ లెగ్గులు మాత్రమేనని,బంగారం లాంటి కార్యకర్తలు కాంగ్రెస్, టీడీపీ తోనే ఉన్నారని కూటమి ఐక్యతగా పనిచేసి తన గెలుపుకోసం కృషి చేయాలని కార్యకర్తలకు,నాయకులకు సూచించారు.ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తల దమ్ము కేసీఆర్ కు,దేశానికి తెలియాలంటే నన్ను భారీ మెజార్టీ గెలిపించాలని వారిని కోరారు.

No comments:
Write comments