రెపోరేటు తగ్గించిన ఆర్‌బీఐ

 

న్యూఢిల్లీ ఏప్రిల్ 4 (globelmedianews.com): 
రెపోరేటును 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించినట్లు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది.  ప్రస్తుతం ఉన్న రెపోరేటు 6.25శాతం నుంచి 6 శాతానికి దిగి రానుంది. మిగిలిన అంశాలు యథాతథంగా కొనసాగించాలని  మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయించింది. నేడు 2019-20 ఆర్థిక సంవత్సరానికి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ప్రకటించింది. ప్రస్తుత నిర్ణయంతో బ్యాంకులకు చౌకగా రుణాలు లభ్యమవుతాయి. దీంతో రివర్స్‌ రెపో రేటు 5.75శాతంగా ఉండనుంది. ఎంఎస్‌ఎఫ్‌ రేటు, బ్యాంక్‌ రేటు 6.25 శాతానికి చేరింది. ప్రస్తుతం ఉన్న విధానాన్నే కొనసాగించాలని ఎంపీసీ నిర్ణయించింది. 


రెపోరేటు తగ్గించిన ఆర్‌బీఐ

వృద్ధి రేటును కొనసాగిస్తూనే వినియోగదారుల ధరల సూచీ ద్రవ్యోల్బణాన్ని 4శాతం  (-/+2)వద్ద కట్టడి చేయాలని నిర్ణయించింది.ఫిబ్రవరిలో జరిగిన ఎంపీసీ సమావేశం నాటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించిందని ఆర్‌బీఐ భావించింది. అమెరికాలో కూడా చివరి త్రైమాసికంలో ఆశించిన స్థాయిలో వృద్ధిరేటు కనిపించలేదని అభిప్రాయపడింది. యూరో కూడా మందగించినట్లు పేర్కొంది. బ్రెగ్జిట్‌ కారణంగా యూకే వృద్ధిరేటు తగ్గిందని వెల్లడించింది. 2019 తొలి త్రైమాసికంలో కూడా వృద్ధి రేటు మందగించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది.  అమెరికా ఫెడ్‌, ఇతర అభివృద్ధి చెందిన దేశాల సెంట్రల్‌ బ్యాంకులు భవిష్యత్‌లో ఒడిదొడుకులు తప్పవని అంచనా వేసినట్లు పేర్కొంది.

No comments:
Write comments