ఆర్టీసీ బస్సులు ఎంత వరకు సేఫ్

 

హైద్రాబాద్, ఏప్రిల్ 30, (globelmeidanews.com)
ఆర్టీసీ బస్సును ఎత్తుకు వెళ్లి.. తుక్కు కింద మార్చేశారంటే వారెంతటి ఘరానా దొంగలో చూడండి.. అవకాశం ఇవ్వాలి గానీ ఏమైనా ఎత్తుకు పోగలమని, ఎత్తుక పోవడమే కాదు తుక్కుగా దర్జాగా అమ్ముకోగలమని నిరూపించారు ఈ దొంగలు.. వారు రైలును కూడా దొంగతనం చేసేందుకు వెనుకాడరేమో..! రాజధానిలోని సిటీ బస్‌స్టేషన్‌(సీబీఎస్‌)లో ఆర్టీసీ బస్సును దొంగలు దర్జాగా తస్కరించి నాందేడ్‌ తరలించి తుక్కు కింద మార్చేందుకు చేసిన ప్రయత్నం ఆర్టీసీని కలవరపాటుకి గురిచేసింది. చోరీ తర్వాత బస్సు జాడను కనిపెట్టడంలో కాస్త ఆలస్యం జరిగినా చిన్న రేకు ముక్క కూడా దొరికి ఉండేది కాదేమో. సకాలంలో జాడ తెలియటంతో బాడీ మాయమైనా.. కనీసం ఛాసిస్‌ను అయినా స్వాధీనం చేసుకుని పరువు దక్కించుకున్నారు మన అధికారులు.ఆర్టీసీ కలవరానికి కారణమైంది. నైట్‌హాల్ట్‌ బస్సులు ఎక్కడపడితే అక్కడ నిలిపి ఉంటాయి. ఇక దొంగలు రెచ్చిపోతే సులభంగా బస్సులు మాయమై తుక్కుగా మారిపోవడం ఖాయమని అధికారులు భావిస్తున్నారు. ఎంతో చాక చక్యంగా జరిగిన తాజా చోరీ ఇతర దొంగలకు దారి చూపినట్టవుతుందని అధికారులు ఇప్పుడు హైరానా పడుతున్నారు. ఈ నేపథ్యంలో బస్సుల స్టీరింగ్‌ను లాక్‌ చేసేలా కొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. 


ఆర్టీసీ బస్సులు ఎంత వరకు సేఫ్

ఇవి ఎంత వరకు సేఫ్‌ అన్న అంశంపై కూడా చర్చలు జరుగుతున్నాయి.స్టీరింగ్‌ తిరగకుండా దాన్ని బంధించే ఏర్పాటుకు ఆదేశించారు ఉన్నాతాధికారులు. ఇందుకోసం మూడు రకాల డిజైన్లను పరిశీలించినట్టు తెలుస్తోంది. వాటిల్లో ఒకదాన్ని ఎంపిక చేసి సోమవారం ఆదేశాలు ఇవ్వనున్నట్టు సమాచారం. ఆర్టీసీ హైదరాబాద్‌ జోన్‌ ఈడీ వినోద్‌కుమార్‌ తొలుత సిటీ బస్సుల విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రయోగాత్మకంగా ఇది విజయం అయితే దీన్ని మిగతా జిల్లాల్లో పూర్తి స్థాయిల్లో అనుసరించనున్నారు. నగరంలో నైట్‌హాల్ట్‌ సర్వీసులు 900 ఉన్నాయి. వాటికి ఈ కొత్త ఏర్పాటు ప్రయోగాత్మకంగా అమలు పరచనున్నారు.స్టీరింగ్‌ తిరగకుండా చేసే ఏర్పాటు బలంగా ఉండేలా చూస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. దాన్ని రంపంతో కోసే వీలు ఉండకుండా చేస్తున్నారు. సుత్తిలాంటి దానితో మోది విరచాల్సి ఉంటుంది. అది చడీచప్పుడు కాకుండా జరిగే వీలు లేనందున చోరీ సాధ్యం కాదన్నది అధికారుల ఆలోచన. ఇక నైట్‌హాల్ట్‌ బస్సులుండే చోట్ల భధ్రతను సైతం పెంచనున్నారు. దీంతో మన ఆర్టీసి బస్సులకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస ినట్టవుతుందని అధికారులు చెప్పుకొస్తున్నారు. సాధారణంగా వాహనాలకు తాళం చెవితో లాక్‌ చేసే వెసులుబాటు ఉంటుంది. లాక్‌ పడిన తర్వాత ఇంజన్‌ను ఆన్‌ చేయడం సాధ్యం కాదు. ఇదే తరహాలో బస్సులలో స్టీరింగ్‌ లాక్‌ సిస్టమ్‌ను అందుబాటులోకి తేవడంతో వాటికి ఉండే ఎలక్ట్రానిక్‌ కంట్రోల్‌ యూనిట్‌ పని చేయనందున బస్సును చోరీ చేయడం అంత సులువు కాదని అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌లో 3,700 బస్సులుంటే వాటిల్లో కీ సిస్టం ఉన్నవి కేవలం 500 మాత్రమే. మిగతావి పాత మోడల్‌ బస్సులు. వీటిల్లో ఎలక్ట్రానిక్‌ కంట్రోల్‌ యూనిట్‌ సిస్టం అందుబాటులో లేదు. వాటిని తాళం చెవితో లాక్‌ చేయడం సాధ్యం కాదు. ఇప్పుడు చోరీకి గురైంది కూడా అలాంటి బస్సే. భవిష్యత్తులో బస్సులు చోరీకి గురికాలేవని అధికారులు కచ్చితంగా చెప్పలేరు. కాబట్టి పకడ్బందీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆర్టీసీ భావిస్తోంది. ఇందుకోసం స్టీరింగ్‌కు లాక్‌ చేసేలా ఏర్పాటుతో పాటు గస్తీ కూడా పెంచాలని నిర్ణయించుకుంది.

No comments:
Write comments