అల్లాడుతున్న మూగజీవాలు (నిజామాబాద్)

 

నిజామాబాద్, ఏప్రిల్ 08 (globelmedianews.com): 
ప్రతి రైతు పశువులను పోషించాలంటారు... పశుసంపదతోనే పల్లె ప్రగతి సాధ్యమంటారు. కానీ మూగజీవాల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై నోరు మెదరపరు. మూగజీవాలను పెంచి పోషించేందుకు ప్రభుత్వం ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నా.. క్షేత్రస్థాయిలో పోషకులకు తిప్పలు తప్పడం లేదు. గొర్రెల పథకం ద్వారా రాయితీ సదుపాయం కల్పించింది. రుణాల ద్వారా మేకలు, గేదేలు పెంచేలా ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వం వైద్యసేవలను విసృతం చేస్తోంది. కానీ ఇవ్వన్నీ అంతగా ప్రయోజనం కల్పించడం లేదు. ఏటా వేసవి కాలం వచ్చిందంటే చాలు పశుపోషకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎక్కడా పశుగ్రాసం లేదు. నీటిలభ్యత జాడ లేదు. ఈసారి అదే జరుగుతోంది. పశుగ్రాసం, నీటి కొరత సమస్యలతో పశువులను పోషించుకోలేక సంతకు తరలించాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. వందలాది జీవాలతో గొర్రెల కాపరులు వందలాది కిలోమీటర్ల దూరం వలస వెళ్లిపోతున్నారు. అక్కడ వారు ఎన్నో కష్టాలను చవి చూస్తున్నారు. పశుగ్రాసం, నీటి కొరతతో పశుపోషకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గొర్రెల కాపరులు పొరుగు రాష్ట్రామైన మహారాష్ట్ర, జిల్లాలోని బాన్సువాడ, బీర్కూర్‌, బోధన్‌ ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. పాడి పశువుల విషయానికొస్తే బోర్లు ఉన్న రైతుల వద్ద పచ్చి గడ్డి లభించినా మిగితా రైతులకు పశుపోషణ భారంగా మారింది. ఏటా ఎప్రిల్‌, మే నెలలో మూగజీవాలకు తీవ్ర తాగునీటి సమస్య వేధించేది. కానీ ఈసారి చెరువులు, కుంటల్లో నీరు అడుగంటిపోయి మార్చి మాసంలోనే నీటి, పశుగ్రాసం కోసం పాడిరైతులు ముప్పు తిప్పలు పడుతున్నారు.


అల్లాడుతున్న మూగజీవాలు (నిజామాబాద్)

వేసవిలో పశుగ్రాసానికి పెట్టింది పేరు ఎండు జొన్న చొప్ప, వరి గడ్డిలే. ఈ రెండింటి కోసం రైతులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. బాన్సువాడ, బీర్కూర్‌ ప్రాంతాల నుంచి జుక్కల్‌, బిచ్కుంద, మద్నూర్‌ మండలాల రైతులు వరిగడ్డిని కొనుగోలు చేయగా, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి జొన్నచొప్పను కొనగోలు చేసి వాహనాల్లో తీసుకెళ్తున్నారు. ఒకపుడు జుక్కల్‌ నియోజకవర్గంలో జొన్నచొప్పకు కొరత లేదు. జొన్నసాగు ఘనణీయంగా తగ్గడం, వరి సాగు అంతంతమాత్రమే ఉండటం పశుగ్రాసం కొరతకు దారీ తీస్తోంది. ఒక్క ఎండు జొన్న చొప్ప కట్ట రూ. 11 నుంచి రూ. 15 పలుకుతున్నట్లు రైతులు చెబుతున్నారు. వరిగడ్డీ కట్ట రూ. 40 నుంచి 60 వరకు పలుకుతోంది. వీటిని దూరప్రాంతాలకు వాహనాల్లో తరలిస్తూ పశుగ్రాసం కోసం అధిక సొమ్మును వెచ్చించాల్సి వస్తోందని రైతులు వివరిస్తున్నారు.పశుసంవర్థకశాఖ ద్వారా 75శాతం రాయితీపై గడ్డి విత్తనాలను అందజేస్తున్నామని, పశుగ్రాస కొరత ఏర్పడే అవకాశం లేదని పశువైద్యశాఖ అధికారుల చెబుతున్న మాటలు నీటిమూటలవుతున్నాయి. కేవలం బోర్లు ఉన్న రైతులే గడ్డి విత్తనాలు వేయాల్సి ఉంటుంది. అందులోనూ అధికారులు రాయితీ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించకపోవడం, సకాలంలో రైతులకు చేరకపోవడం, ఆ గడ్డి అంతగా ఉపయోగపడదనే అపోహ రైతుల్లో నుంచి తొలగించకపోవడం వివిధ కారణాలతో రాయితీ గడ్డి విత్తనాలు పశుగ్రాస కొరతకు అడ్డుకట్ట వేయలేకపోతోంది. దీంతో గడ్డి విత్తనాల బస్తాలు పశువైద్యశాలలోనే మగ్గుతున్నాయి. అధికారులు గ్రామాల్లో పర్యటించి ప్రతి పాడిరైతు రాయితీ విత్తనాలను సద్వినియోగం చేసుకునేలా కృషి చేయాల్సి ఉండగా సిబ్బంది కొరతతో నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు. దీంతో పాడిరైతులు పశుగ్రాసం కోసం పాకులాట పడుతూనే ఉన్నారు.

No comments:
Write comments