లక్ష్యానికి మించి వసూళ్లు

 

హైద్రాబాద్, ఏప్రిల్ 4, (globelmedianews.com)
విశ్వనగరాభివృద్ధి లక్ష్యంగా వడివడిగా చర్యలు తీసుకుంటూ, మరోవైపు సంస్థ పరంగా లోపాలను సవరించుకుంటూ ఖజానాను పరిపుష్టి చేశారు. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ గతంలో కంటే రికార్డు స్థాయిలో ఆస్తి పన్ను వసూళ్లను సాధించింది. గాంధీగిరి పద్ధతిలో 2018-19 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యానికి మించి రూ. 1320కోట్ల మేర వసూళ్లను రాబట్టింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఏకంగా రూ. 115కోట్ల అదనపు పన్ను వసూళ్లను సేకరించింది. ఇదే సమయంలో హెచ్‌ఎండీఏ ఖజానాను పటిష్టం చేయడంలో తనదైన ముద్ర వేసుకుంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.399కోట్లు ఆదాయం రాగా, 2017-18 సంవత్సరంలో ఏకంగా రెట్టింపు స్థాయి కంటే ఎక్కువగా రూ.872కోట్ల మేర సమకూర్చుకుంది. భవన, లే అవుట్ నిర్మాణ రంగ అనుమతుల్లో సంస్కరణలు చేపట్టిన ఫలితంగా ఏకంగా రూ.400 కోట్ల మేర ఆదాయాన్ని రాబట్టుకుంది. క్రమబద్ధీకరణ పథకాన్ని సమర్థవంతంగా చేపట్టి ఎల్‌ఆర్‌ఎస్‌ల రూపంలో రూ. 400కోట్లకు పైగా ఆదాయాన్ని ఖజానాలోకి మళ్లించింది. జలమండలి సైతం కొత్త నీటి కనెక్షన్లు, నీటి బిల్లుల వసూళ్లలో వేగం పెంచి ఖజానాను పటిష్టం చేసింది. 

లక్ష్యానికి మించి వసూళ్లు

మొత్తంగా ఖజానాను పటిష్టం చేసుకుంటూ విశ్వ నగరమే లక్ష్యంగా అధికారులు వడివడిగా చర్యలు చేపడుతుండటం గమనార్హం.2017-18 సంవత్సర ఆస్తిపన్ను చెల్లింపులో అందరి అంచనాలకు భిన్నంగా సౌత్ జోన్‌లోని రెండు సర్కిళ్లు, ఈస్ట్ జోన్‌లోని మూడు సర్కిళ్లు అగ్రస్థానంలో నిలిచాయి. జీహెచ్‌ఎంసీ 2017-18 సంవత్సరానికి ఆస్తిపన్ను కింద రికార్డు స్థాయిలో రూ.1,321 కోట్లు వసూళ్లు అయ్యాయి. వసూలైన మొత్తంలో అత్యధికంగా సెంట్రల్, వెస్ట్ జోన్లకు చెందిన సర్కిళ్లు తమకు నిర్దేశించిన లక్ష్యంలో వంద శాతం సాధించే విధానం గత ఆర్థిక సంవత్సరం వరకు ఉంది. అయితే నిర్ధేశించిన లక్ష్యాల మేరకు వంద శాతానికి పైగా ఆస్తిపన్ను వసూలు చేసిన మొత్తం 8సర్కిళ్లలో ఐదు సర్కిళ్లు తూర్పు, దక్షిణ మండలాలకు చెందిన ఐదు సర్కిళ్లు ఉండడాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆశ్చర్యపర్చింది. మైనార్టీలు, మధ్యతరగతి నివాసితులు అధికంగా ఉండే సౌత్, ఈస్ట్ జోన్‌లో లక్ష్యాన్ని చేరుకోలేవని తప్పుడు అంచనాలను ఈ ఆర్థిక సంవత్సరంలో వమ్ముచేశాయి. సౌత్ జోన్‌లోని చార్మినార్-5బి, చార్మినార్-5ఏ సర్కిళ్లు వరుసగా తమకు నిర్దేశించిన లక్ష్యాన్ని మించి 105.76 శాతం, 105.22 శాతం పన్నులను వసూలు చేశాయి. ఈస్ట్ జోన్‌లోని హయత్‌నగర్ సర్కిల్ 102.93శాతం, సరూర్‌నగర్ సర్కిల్ 102శాతం, కాపా సర్కిల్ 101.81శాతం పన్ను వసూళ్లను సాధించాయి.అన్నింటికన్నా సికింద్రాబాద్ సర్కిల్ 106. 92 శాతం పన్ను వసూళ్ల ద్వారా మొత్తం జీహెచ్‌ఎంసీ అగ్రస్థానంలో నిలిచింది. ప్రతి సారి పన్ను వసూళ్లలో అగ్రస్థానంలో నిలిచే సెంట్రల్ జోన్‌లోని సర్కిళ్లలో ఖైరతాబాద్-10సి సర్కిల్ 103.69శాతం, ఖైరతాబాద్-7బి సర్కిల్ 101.95శాతం పన్ను వసూళ్లను సాధించాయి. 2017-18లో ఆబిడ్స్ సర్కిల్ 93.80శాతంలో కింది స్థానంలో నిలవగా తర్వాత స్థానంలో ఉప్పల్ 80.51 శాతం, మల్కాజ్‌గిరి సర్కిల్ 83.77శాతం, కూకట్పల్లి 83.70శాతం, కుత్బుల్లాపూర్ సర్కిల్ 86.19శాతం తర్వాతి స్థానంలో నిలిచాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం 3,08,339 మంది ఆస్తిపన్నును ఆన్‌లైన్ ద్వారా రూ.200కోట్ల చెల్లించారు. భవన క్రమబద్ధీకరణ చేసిన 1,21,019 దరఖాస్తులు 28,859 ఆస్తులకు రూ. 35.24కోట్లను ఆస్తిపన్ను వసూలు చేశారు.ప్రతిసారి చెక్ బౌన్స్ కేసులు అధికంగా ఉండి ఆస్తిపన్ను వసూళ్లలో తీవ్ర వ్యత్యాసం ఉండేది. ఈ సారి ఆస్తిపన్ను కింద చెల్లించిన చెక్కులు క్యాష్ అయిన అనంతరమే పన్ను చెల్లింపు ఖాతాలో పడ్డట్టు భావించడంతో ఈ సారి వసూళ్లైన రూ. 1,321 కోట్లు వాస్తవంగా జీహెచ్‌ఎంసీ ఖాతాలో జమ అయిన ఆస్తిపన్ను కింద చూపించడం జరిగింది. కాగా అందరి అంచనాలను మించి ఆస్తిపన్ను చెల్లింపులో అగ్రస్థానంలో సౌత్, ఈస్ట్ జోన్‌లోని సర్కిళ్లు ముందంజలో ఉండటం పట్ల మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్ హర్షం వ్యక్తం చేశారు.

No comments:
Write comments