ఓటింగ్ పై పార్టీలో టెన్షన్

 

నల్లగొండ, ఏప్రిల్ 4 (globelmedianews.com)
మండుతున్న ఎండలు రాజకీయ పార్టీల్లో గుబులు రేపుతున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ బూత్‌లకు జనం ఉత్సాహంగా వస్తారా లేదా అనే దానిపై అన్ని పార్టీల్లో బెంగ మొదలైంది. ఇప్పటికే ఎండలు భగభగమంటుండంతో, గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా ఓటర్లు పోలింగ్ బూత్‌లకు ఆశించిన స్థాయిలో వస్తారా ? అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్, ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పోలింగ్ స్టేషన్లకు జనాన్ని తరలించడంపై దృష్టి పెట్టాయి. తెలంగాణ రాష్ట్రం అవతరించిన 2014 సంవత్సరంలో అసెంబ్లీ, పార్లమెంటుకు ఎన్నికలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగాయి. ఆ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 69 శాతం ఓట్లుపోలయ్యాయి. 2018 డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో 73.2 శాతం ఓట్లు పోలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా ప్రజలు పార్లమెంటు ఎన్నికల పట్ల ఆసక్తిని కనపరచరు. పోలింగ్ శాతాన్ని బట్టి ఎన్నికల ఫలితాలు ఉంటాయి. మొన్న డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 47.4 శాతం ఓట్లతో 88 అసెంబ్లీ సీట్లను తెచ్చుకుంది. కాంగ్రెస్ పార్టీ 28.7 శాతం ఓట్లతో 19 సీట్లను, 2.7 శాతం ఓట్లతో 7 సీట్లలో ఎంఐఎంఐఎం, 3.5 శాతం సీట్లతో రెండు సీట్లను టీడీపీ, 7.1 శాతం ఓట్లతో ఒక సీటను బీజేపీ, 3.3 శాతం సీట్లతో స్వతంత్రులు ఒక చోట, 7.3 శాతం సీట్లతో ఇతరులు ఒక చోట గెలిచారు. 


ఓటింగ్ పై పార్టీలో టెన్షన్

ఇదే పోలింగ్ సరళి పునరావృతమైతే, టీఆర్‌ఎస్‌కు 15 సీట్లు, కాంగ్రెస్‌కు ఖమ్మం లోక్‌సభ ఒక సీటు, ఎఐఎంఐఎం హైదరాబాద్‌లో సీటును గెల్చుకోవటం తథ్యం. కాని రాజకీయ సమీకరణలు గత మూడు నెలల్లో మారాయి. ప్రభుత్వ వ్యతిరేకతపై విపక్ష పార్టీలు ఆశపెట్టుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంటు ఎన్నికలకు పోలింగ్‌లో తేడా కనపడుతుందని, యువత, మహిళలు తమకే ఓట్లు వేస్తారని కాంగ్రెస్, బీజేపీలు బలంగా విశ్వసిస్తున్నాయి. మంత్రి వర్గం ఏర్పాటులో జాప్యం, మహిళలకు ప్రాతినిధ్యం లేకపోవడం, మొదటి సారి మాదిరిగా జనరంజకమైన పాలనను రెండవసారి అందించే ప్రయత్నం చేయకపోవడం, కొంత మంది సీనియర్లను అధికార పార్టీ పక్కనపెట్టడంపై ప్రజల్లో తెలియని అసంతృప్తి ఉంది. పార్లమెంటు ఎన్నికల ఫలితాలను బట్టి నాయకత్వంలో మార్పులు ఉంటాయనే సమాచారం విస్తృత ప్రచారంలో ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓటమి ఆ పార్టీ పాలన పట్ల వ్యతిరేకతకు ఒక సిగ్నల్ అంటున్నారు.
ఈ నేపథ్యంలో 2014 అసెంబ్లీ ఎన్నికలను విశే్లషిస్తే టీఆర్‌ఎస్ 34.9 శాతం ఓట్లు, కాంగ్రెస్ 24.7 శాతం ఓట్లు, టీడీపీ 12.3 శాతం ఓట్లు, బీజేపీ 10.5 శాతం ఓట్లు, వైకాపా 4.5 శాతం ఓట్లు ఇతరులు 13.1 శాతం ఓట్లను సాధించాయి. ఇందులో వైకాపా, టీడీపీ ఓట్లన్నీ 2018 ఎన్నికలను విశే్లషిస్తే టీఆర్‌ఎస్‌కు సింహభాగం బదిలీ అయ్యాయని చెప్పవచ్చును. 2014తో పోల్చితే, ఈ పార్టీల ఓట్లకు గండి పడింది. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రం 2014 ఎన్నికల్లో 24.7 శాతం ఓట్లు, 2018 ఎన్నికల్లోల 28.7 శాతం ఓట్లను తెచ్చుకుంది. ఓట్లు పెరిగినా టీఆర్‌ఎస్‌కు, కాంగ్రెస్‌కు మధ్య ఓట్ల తేడా చాలా ఎక్కువగా ఉంది. 2014లో టీఆర్‌ఎస్‌కు, కాంగ్రెస్‌కు మధ్య ఓట్ల తేడా 10 శాతం ఉంటే, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 19 శాతం వరకు ఉంది. అసెంబ్లీ ఎన్నికలు వేరుగా జరిగినందు వల్ల టీఆర్‌ఎస్ గత ఐదేళ్లలో ప్రజారంజక పాలనతో జనంలోకి వెళ్లి మొత్తంపైన తిరుగులేని 47.4 శాతం ఓట్లతో 88 సీట్లను తెచ్చుకుంది. కాని పార్లమెంటు ఎన్నికల్లో జాతీయ స్థాయి సమస్యలకు ప్రాధాన్యత ఉంటుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో యాదగిరి భువనగిరి జిల్లాల్లో గరిష్టంగా 90.95 శాతం ఓట్లు, కనిష్టంగా హైదరాబాద్ జిల్లాలో 48.39 శాతం ఓట్లు పోలయ్యాయి. అసెంబ్లీల వారీగా విశే్లషిస్తే చార్మినార్‌లో అత్యల్పంగా 40.18 శాతం ఓట్లు, మధిరలో అత్యధికంగా 91.65శాతం ఓట్లు పోలయ్యాయి. అసెంబ్లీ స్థాయి లో ఓటర్లు బారులు తీరితే టీఆర్‌ఎస్‌కు పార్టీకి అనుకూలిస్తుందా లేక కాంగ్రెస్, బీజేపీలు లాభపడుతాయో వేచిచూడాల్సిందే. సాధారణగా ఎండాకాలంలో శీతాకాలంతో పోలిస్తే పోలింగ్ నమోదు తక్కువగానే ఉంటుంది.పోలింగ్ బూత్‌ల వద్ద జనం విరగబడితే ప్రభుత్వ వ్యతిరేకత పెల్లుబికినట్లేనని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి

No comments:
Write comments