రాయబరేలిలో రసవత్తర పోరు

 

లక్నో, ఏప్రిల్ 13  (globelmedianews.com)
రాయబరేలిలో రసవత్తర పోరు జరగనుంది. ఉత్తరప్రదేశ్ లోని ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రంగంలోకి దిగారు. అనారోగ్య పరిస్థితుల కారణంగా ఈసారి పోటీకి దూరంగా ఉంటారని మొదట్లో ప్రచారం జరిగింది. అయితే మనసు మార్చుకున్న సోనియా మళ్లీ రంగంలోకి దిగడంతో అంతటా ఆసక్తి నెలకొంది. అన్నింటికీ మించి సోనియా ప్రత్యర్థిగా దినేష్ ప్రతాప్ సింగ్ ను బీజేపీ రంగంలోకి దించడంతో మరింత ఆసక్తికరంగా మారింది. సింగ్ ఒకప్పుడు కాంగ్రెస్ వాదే. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడే. మాజీ ఎమ్మెల్సీ అయిన సింగ్ కు రాయబరేలి నియోజకవర్గంలో గట్టి పట్టుంది. గాంధీ కుటుంబాల గెలుపులో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. దీంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లను ఆయన భారీగా చీలుస్తారన్న వాదన వినపడుతోంది. ఈ ఉద్దేశ్యంతోనే బీజేపీ ఆయనను బరిలోకి దించింది.ప్రత్యర్థి దినేష్ సింగ్ కావడంతో గట్టి పోటీ నెలకొంది. వాస్తవానికి రాయబరేలి ఒకప్పుడు గాంధీ కుటుంబానికి కంచుకోట. ఇప్పుడు ఎంతమాత్రం కాదు. 2014 లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 80 స్థానాలకు గాను హస్తం పార్టీ నేతలు రాయబరేలి, అమేధీల్లోనే గెలిచారు. ఈ ప్రాంతంలో పట్టున్న సమాజ్ వాదీ పార్టీ మద్దతుతో అది సాధ్యమైంది. లేనట్లయితే పరిస్థితి మరోరకంగా ఉండేది. 


రాయబరేలిలో రసవత్తర పోరు

ఇప్పుడు బీఎస్పీ, ఎస్పీ లు పొత్తు పెట్టుకున్నాయి. ఈ రెండు పార్టీలు మద్దతు ప్రకటించకపోతే హస్తం పార్టీ అధినేత్రికి కష్టాలు తప్పవు. ఎస్పీ, బీఎస్పీలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులను కాంగ్రెస్ దించింది. దీనివల్ల బీఎస్పీ, ఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య ఓట్లు చీలిపోయి బీజేపీ లబ్ది పొందే అవకాశం ఉంటుంది. ఎస్పీ, బీఎస్పీ ఈ అభిప్రాయానికి వస్తే రాయబరేలీలో అవి సోనియాకు మద్దతు ప్రకటించే అవకాశాలు తక్కువే. అదే జరిగితే ఇదే అవకాశంగా తీసుకుని సోనియాను నిలువరించేందుకు బీజేపీ తన శక్తియుక్తులను ధారపోస్తుంది. అంతిమంగా దానివల్ల సోనియాకు చిక్కులు తప్పవు.నిజానికి రాయబరేలి హస్తం పార్టీకి పట్టున్న ప్రాంతం. నియోజకవర్గం ఆవిర్భావం నుంచి మూడుసార్లు మాత్రమే కాంగ్రెసేతర పార్టీలు ఇక్కడి నుంచి గెలిచాయి. మిగిలిన అన్ని సందర్భాల్లోనూ గాంధీ కుటుంబ పెద్దలు లేదా వారి కుటుంబ సన్నిహితులు మాత్రమే ఇక్కడ గెలుపొందారు. తొలి నుంచి కాంగ్రెస్ ఇక్కడ గెలుస్తున్నప్పటికీ 1967లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఇక్కడి నుంచి పోటీ చేయడం ద్వారా వారి కుటుంబ నియోజకవర్గంగా మారింది. 1977లో జనతా పార్టీ అభ్యర్థి రాజ్ నారాయణ్ ఇక్కడ ఇందిరాగాంధీని ఓడించారు. ఇదే తొలి ఓటమి. ఆ తర్వాత రాజ్ నారాయణ్ జనతా ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. 1998 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అశోక్ సింగ్ ఎన్నికయ్యారు. నాటి ఎన్నికల్లో సోనియా పోటీ చేయలేదు. 1980, 1984, 1989, 1991 ఎన్నికల్లో గాంధీ కుటుంబ బంధువు షీలాకౌల్ విజయం సాధించారు. 1996లో రాజీవ్ గాంధీ సన్నిహితుడు,కుటుంబ సభ్యుడు అయిన కెప్టెన్ సతీష్ శర్మ గెలుపొందారు.రాయబరేలి లోక్ సభ స్థానం పరిధిలో అయిదు అసెంబ్లీ స్థానాలున్నాయ. బబ్బారవన్, హర్ చందపూర్, రాయబరేలి, పరేనా, ఉంచాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క చోట మాత్రమే హస్తం పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. వాస్తవానికి గాంధీ కుటుంబం పేరుతో ప్రతిసారీ వారి కుటుంబ సభ్యులే గెలుస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి వారు చేసిందేమీ లేదన్న వాదన ఉంది. ప్రజలకు అందుబాటులో ఉండరన్న పేరుంది. ప్రముఖులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అయినప్పటికీ అభివృద్ధి పరంగా వెనుకబడి ఉంది. కనీస మౌలిక సౌకర్యాలు కొరవడ్డాయి. విద్య, వైద్యం అంతంత మాత్రమే. రహదారులు దుస్థితి చెప్పనక్కరలేదు. తాగునీటికి ఎప్పుడూ కటకటే. పారిశ్రామికంగా బాగా వెనుకబడి ఉంది. చెప్పుకోదగ్గ పరిశ్రమలేవీ లేవు. చిన్నతరహా పరిశ్రమలు కూడా లేవు. యువత నిరుద్యోగంతో సతమతమవుతోంది. విపక్ష పార్టీ నియోజకవర్గం కావడంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నియోజకవర్గం అభివృద్ధిపై నిర్లిప్తంగా ఉంటున్నాయి. ఎంత వెనకబడినప్పటికీ, ఎంత గట్టిపోటీ ఉన్నప్పటికీ సోనియా విజయం ఖాయమన్నది హస్తం పార్టీ శ్రేణుల ధీమా

No comments:
Write comments