జడ్పీటీసీకి ఒక రేటు, ఎంపీటీసీకి మరొక రేటు

 

నల్గొండ, ఏప్రిల్ 25, (globelmedianews.com
వరుస ఎన్నికలతో తెలంగాణ రాష్ట్రం బిజీ అయిపోయింది. గతేడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. ఇప్పటికే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఆయా పార్టీలు నాయకులు విపరీతంగా ఖర్చు పెట్టారు. తాజాగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఎవరి ఖర్చులు వారివే అని రెండు ప్రధాన పార్టీలు తేల్చేశాయి.  తెలంగాణ రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే జరిగిన ఎన్నికలతో ఖర్చు తడిసి మోపెడు అవడంతో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులకు ఎలాంటి ఫండింగ్ ఇవ్వబోమని తేల్చేశాయి. దమ్మిడి కూడా ఇచ్చేది లేదంటూ చెప్పిన పార్టీలు, ఎవరి ఖర్చులు వారు పెట్టుకోవాలని తమ అభ్యర్థులను సూచించాయి. దీంతో స్థానిక సంస్థల పోటీలో ఉన్న అభ్యర్థులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. 


 జడ్పీటీసీకి  ఒక రేటు, ఎంపీటీసీకి మరొక రేటు

పార్టీ తరపున ఇచ్చే డబ్బులు ఎన్నికల ఖర్చుకు వస్తుందని భావించిన నాయకులు ఇప్పుడు పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నారు. తెలంగాణలో 535 జిల్లా పరిషత్తు స్థానాలుండగా, ఎంపీటీసీ స్థానాలు 5,317 ఉన్నాయి. ఇక ఈ ఎన్నికల్లో జడ్పీటీసీ కోసం పోటీ చేస్తున్న నేతలు రూ.50 లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలో ఉంటున్న నేతలకు రూ.10 లక్షలు వరకు ఖర్చు అవుతుందని బడా నాయకులు అంచనా వేస్తున్నారు. అయితే అధికారికంగా ఒక జడ్పీటీసీ స్థానం కోసం పోటీ చేస్తున్న అభ్యర్థి రూ.4 లక్షల కంటే ఎక్కువగా ఖర్చు చేయరాదు. మరోవైపు ఎంపీటీసీ అభ్యర్థి రూ. 1.5 లక్షల కంటే ఎక్కువగా ఖర్చు చేయరాదు. ఇదిలా ఉంటే ఎలాగైనా జిల్లా పరిషత్ ఛైర్మెన్ పదవి చేజిక్కించుకోవాలంటే దాదాపు రూ.2 కోట్లు వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది.  ఇక ఓటు వేసే ప్రతి వ్యక్తి రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఒకటి ఎంపీటీసీ రెండో ఓటు జడ్పీటీసీకి వేయాల్సి ఉంటుంది. ఇక ఎంపీటీసీ అభ్యర్థులు తమ సొంత ఖర్చులు పెట్టుకుని మిగతా డబ్బుల కోసం జడ్పీటీసీలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇక ఒక జడ్పీటీసీ కింద సగటున 10 మంది ఎంపీటీసీలు ఉంటారు. ఇక జడ్పీటీసీలు మాత్రం జిల్లా పరిషత్ ఛైర్మైన్‌గా ఎవరైతే కావాలని భావిస్తున్నారో ఆ అభ్యర్థిపై ఫండ్స్ కోసం ఆధారపడుతున్నారు. ఇక చాలా జిల్లాల్లో జిల్లా పరిషత్ ఛైర్మెన్ అభ్యర్థిని ముందుగానే ప్రకటిస్తామని టీఆర్‌ఎస్ చెబుతోంది. ఇక ప్రకటించిన ఆ అభ్యర్థే అన్ని ఖర్చులు పెట్టుకోవాల్సి ఉంటుందని అధిష్టానం హుకూం జారీచేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్యేలు కూడా జడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థులను ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకు రావటం లేదని తెలుస్తోంది.  

No comments:
Write comments