ఫెడరల్ టూర్ కు కేసీఆర్ ప్లాన్

 

హైద్రాబాద్ ఏప్రిల్ 24 (globelmedianews.com)
సార్వత్రిక ఎన్నికల సమరం కొనసాగుతున్న వేళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌పై దృష్టి సారించారు. త్వరలోనే వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అనేక పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. దీనిపై ఒకట్రెండు రోజుల్లో కార్యాచరణ ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. శాసనసభ ఎన్నికలకు ముందు, తర్వాత కేసీఆర్ చాలా రాష్ట్రాల్లో పర్యటించిన కేసీఆర్.. వివిధ పార్టీల అధినేలతో సమావేశమైన సంగతి తెలిసిందే. భాజపాయేతర, కాంగ్రెసేతర ప్రభుత్వ ఏర్పాటు దిశగా కార్యాచరణ ప్రారంభించిన కేసీఆర్ మరోసారి జాతీయ నేతలతో భేటీ కానున్నారు. ముందుగా లోక్‌సభ ఎన్నికలు ముగిసిన రాష్ట్రాల్లో పర్యటించాలని కేసీఆర్ నిర్ణయించారు. రాజకీయంగా తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాలు, ఎత్తులు అంచనాలకు అందవని చెబుతారు. ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ప్రత్యర్థుల అంచనాకు అందని దాఖలాలు చాలానే ఉన్నాయి. గతేడాది ఫెడరల్ ఫ్రంట్ అంటూ ఆయన చేసిన ప్రకటన కూడా అలాంటిదే. అప్పటిదాకా రాష్ట్రానికే పరిమితమైన కేసీఆర్.. ఢిల్లీ రాజకీయాలను గురిపెట్టడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. 


 ఫెడరల్ టూర్ కు కేసీఆర్ ప్లాన్

ఇది అయ్యే పని కాదని ప్రత్యర్థులు ఇప్పటికీ విమర్శిస్తూనే ఉన్నారు. కేసీఆర్ కూడా కొన్నాళ్లుగా 'ఫెడరల్ ఫ్రంట్' టూర్స్ పక్కనపెట్టడంతో.. ఇక దాని కథ ముగిసినట్టేనా అన్న చర్చ కూడా జరిగింది. అయితే ఎన్నికల తర్వాత ఆయన ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు మొదలుపెడుతారన్న వాదన వినిపించింది. కానీ కేసీఆర్ మళ్లీ ఎవరి అంచనాలకు అందని రీతిలో ఎన్నికలు ఇంకా పూర్తికాక ముందే ఫెడరల్ యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు.త్వరలోనే కేసీఆర్ ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించబోతున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ పర్యటనలకు సంబంధించిన షెడ్యూల్ మాత్రం ఇంకా ఖరారు కావాల్సి ఉందంటున్నారు. పర్యటనలో భాగంగా వివిధ పార్టీల అధినేతలను కలిసి ఫెడరల్ ఫ్రంట్‌పై ఆయన చర్చలు జరపనున్నారు. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్‌లకు స్వతహాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాదని బలంగా నమ్ముతున్న కేసీఆర్.. బలమైన ప్రాంతీయ పార్టీలతో ఫ్రంట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇప్పటివరకు 17 రాష్ట్రాలు, ఐదు కేంద్రపాలిత ప్రాంతాల్లో లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో.. ఇప్పటినుంచే ఫ్రంట్ ప్రయత్నాలు ముమ్మరం చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికలు ముగిసేనాటికి ఫెడరల్ ఫ్రంట్‌కు దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం కల్పించడం.. ఉమ్మడి ఎజెండాతో ఆయా పార్టీలను కలుపుకోవడం వంటి లక్ష్యాలతో కేసీఆర్ టూర్స్ ఉండబోతున్నాయని సమాచారం.లోక్‌సభ ఎన్నికలు మే 23న వెలువడనున్నాయి. ఈలోగా ఎవరికి వారు తమ విజయావకాశాలపై అంచనాలు వేసుకుంటున్నారు. ఫలితాల లోగా ఫెడరల్ ఫ్రంట్‌ను క్రియాశీలకంగా మార్చాలని కేసీఆర్ యోచిస్తున్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నా కేసీఆర్‌ ప్రచారం చేసే అవకాశం లేదని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. 

No comments:
Write comments