అనంతపురంలో జేసీ అష్టకష్టాలు

 

అనంతపురం, ఏప్రిల్ 13   (globelmedianews.com)
జేసీ దివాకర్ రెడ్డికి ఈ ఎన్నికలు చుక్కలు చూపించాయనే చెప్పాలి. కుమారుడిని గెలిపించుకోవడానికి జేసీ దివాకర్ రెడ్డి అష్టకష్టాలు పడ్డారు. అయితే పోలింగ్ జరిగిన తర్వాత జేసీ పవన్ కుమార్ రెడ్డి గెలుపుపై అనుమానాలు తలెత్తుతున్నాయి. జేసీ దివాకర్ రెడ్డికి ఈసారి అనంతపురం ప్రజలు షాకిస్తారన్న వార్తలు వస్తున్నాయి. అనంతపురం పార్లమెంటు స్థానం పోలింగ్ తర్వాత హాట్ సీటుగా మారింది. ఇక్కడ గెలుపోటములపై భారీ స్థాయిలో బెట్టింగ్ లు జరుగుతున్నాయి. అయితే గెలుపోటలకు అనేక కారణాలు చెబుతున్నారు.అనంతపురం పార్లమెంటు పరిధిలో మొత్తం ఏడు నియోజకవర్గాలున్నాయి. రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, సింగనమల, అనంతపురం అర్బన్, కల్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ ఏడు నియోజకవర్గాల్లో నెలకొన్న విభేదాలే తెలుగుదేశం పార్టీకి నష్టం చేకూర్చాయన్నది ఆ పార్టీ నేతలు సయితం ఎన్నికల తర్వాత అంగీకరిస్తున్నారు. కౌంటింగ్ కు ఇంకా నలభై రోజులకు పైగానే ఉన్నప్పటికీ అనంతపురం ఎంపీ స్థానాన్ని గెలుస్తామన్న ధీమా జేసీ కుటుంబంలో కనపడకపోవడం విశేషం.


అనంతపురంలో జేసీ అష్టకష్టాలు

జేసీ దివాకర్ రెడ్డి చేజేతులారా క్లిష్ట పరిస్థితులను కొనితెచ్చుకున్నారంటున్నారు. ఆయనకు ఎవరితో పొసగక పోవడం వల్లనే జేసీ పవన్ గెలుపు కోసం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పెద్దగా ప్రయత్నించలేదన్నది సమాచారం. అనంతపురం అర్బన్ నియోజకవర్గాన్ని తీసుకుంటే అటు జేసీ దివాకర్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రభాకర్ చౌదరికి వ్యతిరేకంగా పనిచేశారంటున్నారు. ప్రభాకర్ చౌదరి సయితం జేసీ పవన్ ఎంపీ అభ్యర్థి అన్న విషయాన్ని కూడా చెప్పలేదు. ఇక ఉరవకొండ నియోజకవర్గం లో హోరాహోరీ పోరు నడిచింది. ఇక్కడ క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశముంది. గుంతకల్లు నియోజకవర్గంలో కన్ఫ్యూజన్ క్రియేట్ అయి ఉంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ ను మార్చాలని జేసీ పట్టుబట్టారు. మధుసూదన్ కు ఇవ్వాలని కోరినా చివరకు జితేంద్రగౌడ్ కే టిక్కెట్ ఇచ్చారు. ఆయన జేసీకి వ్యతిరేకంగా పనిచేసినట్లు వార్తలు వస్తున్నాయి.తాడిపత్రి నియోజకవర్గం మాత్రం జేసీ పవన్ కుమార్ రెడ్డికి కొంత మెజారిటీ వస్తుందన్న లెక్కలు వేస్తున్నారు. అయినా అనుకున్నంత మెజారిటీ వచ్చే అవకాశం లేదని టీడీపీ నేతలు బహిరంగంగా అంగీకరిస్తున్నారు. సింగనమల నియోజకవర్గంలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే యామిని బాలకు టిక్కెట్ ఇవ్వకపోవడం, అక్కడ జేసీ కాంగ్రెస్ అభ్యర్థి సాకే శైలజానాధ్ కు ఓట్లెయ్యాలని బహిరంగంగా పిలుపునివ్వడం కొంత ఇబ్బందిగా మారింది. కల్యాణదుర్గం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరికి టిక్కెట్ రాకపోవడంతో జేసీకి తన సత్తాచూపుతానని బహిరంగంగానే సవాల్ విసిరారు. ఈనేపథ్యంలో జేసీ పవన్ కుమార్ రెడ్డికి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఎదురీత తప్పదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఈ పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి జేసీ పవన్ గెలుస్తారా? లేదా? అన్నది మాత్రం మరి కొద్దిరోజుల్లో తేలనుంది.

No comments:
Write comments