పరిషత్ ఎన్నికల్లో భారీగా ఆశావహులు

 

వరంగల్, ఏప్రిల్ 27, (globelmedianews.com)
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌)కు ఏర్పడిన అనుకూల పరిస్థితులు... కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీల నుంచి కొనసాగుతున్న వలసలు... టికెట్‌ ఇస్తే చాలు గెలుపు ఖాయమన్న నమ్మకం... వెరసి జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల్లో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది.ఆరు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనగా.. ఆశావహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ఎంపిక, గెలిపించే విషయంలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేకే సీఎం కేసీఆర్‌ పూర్తిగా అవకాశం ఇవ్వగా.. ఉమ్మడి జిల్లాలో ఈ ఎన్నికలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గ్యాదరి బాలమల్లు, పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఇన్‌చార్జిలుగా ప్రకటించారు. అయితే, టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ తరఫున జిల్లా పరిషత్‌ చైర్మన్ల జాబితా వెల్లడించేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


 పరిషత్ ఎన్నికల్లో భారీగా ఆశావహులు

ఎస్సీ జనరల్‌కు రిజర్వ్‌ చేసిన వరంగల్‌ అర్బన్‌ జెడ్పీ చైర్మన్‌ పదవి కోసం పలువురు పోటీ పడతున్నా... సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు అనుచరుడు, కరీంనగర్‌ జెడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌కుమార్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. పార్లమెంట్‌ ఎన్నికల సందర్బంగా ఎంపీ వినోద్‌కుమార్‌ కూడా ఎల్కతుర్తిలో ఆయనకు హామీ ఇచ్చినట్లు చెప్తున్నారు. భీమదేవరపల్లి మండలానికి చెందిన డాక్టర్‌ సుధీర్‌ను ఎస్సీకి రిజర్వు చేసిన ఎల్కతుర్తి జెడ్పీటీసీ స్థానం నుంచి పోటీ చేయించాలని భావించగా, ఆయన బుధవారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మూడు విడతలుగా పరిషత్‌ ఎన్నికల సంరంభం సోమవారం నామినేషన్లతో మొదలు కాగా... రిజర్వేషన్ల ప్రకారం జిల్లా పరిషత్‌ పీఠంపై కన్నేసిన నేతలు పావులు కదుపుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ ఆశించి భంగపడిన వారితో పాటు ఓటమి చెందిన వారు జిల్లా పరిషత్‌ పీఠంపై గురి పెట్టారు. ఇక మరికొందరు సీనియర్‌ నాయకులు తమ వారసులు, కుటుంబసభ్యులను బరిలో దింపేందుకు చక్రం తిప్పుతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ఆశావహులు, పోటీతో అభ్యర్థుల ఎంపిక అధిష్టానానికి తలనొప్పిగా మారుతోంది.వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, జనగామ, మహబూబాబాద్‌ జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకోవాలని టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ పార్లమెంట్‌ ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు నుంచే ఆ పార్టీ నేతలను అప్రమత్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం కూడా చేశారు. దీంతో గెలుపు తధ్యమని భావిస్తున్న పలువురు జెడ్పీటీసీ టికెట్లు ఆశిస్తుండగా... మరికొందరు నేతలు చైర్మన్‌ గిరీపై గురి పెట్టి ముందుకు సాగుతున్నారు. ఇంకొందరు వారసులు, కుటుంబసభ్యులు, బంధువులను జెడ్పీ పీఠం ఎక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.వరంగల్‌ రూరల్‌ జిల్లా నుంచి జెడ్పీ చైర్‌పర్సన్‌ పదవి ఇప్పించేందుకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి తన సతీమణి పెద్ది స్వప్న కోసం మార్గం సుగమం చేసుకున్నారు. ఈ మేరకు వరంగల్‌ రూరల్‌ జిల్లా కిందకు వచ్చే ప్రజాప్రతినిధులు, సీనియర్‌ నాయకులతోనే కాకుండా అధిష్టానంతోనూ ఓకే అనిపించుకున్నారు. అయితే కాంగ్రెస్‌ నేత, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన సతీమణి గండ్ర జ్యోతి సోమవారం హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కలిశారు. గండ్ర జ్యోతికి వరంగల్‌ రూరల్‌ జెడ్పీ చైర్మన్‌గా అవకాశం ఇస్తామనే హామీ కూడా ఈ సందర్భంగా కేటీఆర్‌ నుంచి వచ్చినట్లు తెలుస్తుండడంతో ఈ సీటుపై సందిగ్ధం నెలకొంది.

No comments:
Write comments