డైలీ సీరియల్ ను తలపిస్తున్న టీవీ 9 స్టోరీ

 

హైద్రాబాద్, మే 17, (globelmedianews.com)
మీడియా లో టివి 9 రవి ప్రకాష్ ఒక బాహుబలి అనే చెప్పొచ్చు. ఒక వ్యక్తి వ్యవస్థగా, శక్తిగా మారి తెలుగు మీడియా కు మార్గదర్శి అయిన రవి ప్రకాష్ తన పట్టు కోల్పోకూడదని కొత్త యాజమాన్య బదిలీని అడ్డుకునేందుకు తొక్కని అడ్డదారి లేదని పోలీసులు విచారణ చేసేకొద్ది బయటపడుతుంది. దీంతో రవి ప్రకాష్ ఆయన బృందం పై కేసులపై కేసులు నమోదు కావడం సంచలనం, చర్చనీయాంశం అవుతున్నాయి.ఏ చిన్న సంఘటన జరిగినా బ్రేకింగ్ న్యూస్ గా సంచలనంగా మలచడంలో టివి 9 కు పెట్టింది పేరు. ఆ ఛానెల్ ఆ రకంగా ప్రజల్లోకి దూసుకుపోయింది కూడా. సంచలనం కోసం పనికిమాలిన వార్తలను సైతం ఇలా చేస్తున్నారని విమర్శలు వచ్చినా రవి ప్రకాష్ తన పంథా ఎన్నడూ వీడలేదు. ఆ ఫార్ములానే అన్ని ఛానెల్స్ ఇప్పుడు అనుసరిస్తున్నాయి. అదే ఇప్పుడు రవి ప్రకాష్ కొంప ముంచింది. ఫోర్జరీ ఇతర అనేక ఆరోపణలు కేసుల్లో ఇరుక్కున్న టివి 9 మాజీ సీఈవో రవి ప్రకాష్ కు సంబంధించిన ఏ చిన్న వార్తను తెలుగు మీడియా విడిచిపెట్టడం లేదు. బ్రేకింగ్ న్యూస్ అంటూ రోజంతా నడిపిస్తున్నాయి. సంచలన జర్నలిస్ట్ గా ఎదిగిన రవి ప్రకాష్ చివిరికి తానే తన చెడ్డ చర్యలతో దేశవ్యాప్తంగా సంచలనం అవుతారని ఏ ఒక్కరు ఊహించలేదు. 


డైలీ సీరియల్ ను తలపిస్తున్న టీవీ 9 స్టోరీ

బహుశా రవి ప్రకాష్ కూడా ఇలా తన పరిస్థితి దారుణంగా మారుతుందని భావించి ఉండరని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.టివి 9 పై తనకు వాస్తవంగా లేని పెత్తనం కోసం రవి ప్రకాష్ చేసిన కుట్రలు ఆయనను బాహుబలి క్యారెక్టర్ నుంచి బల్లాల దేవగా మార్చేశాయి.టివి 9 లోగో , కాపీ రైట్స్ వంటి వి కేవలం 99 వేల రూపాయలకు తన బినామీ మోజో టివి ఎండి హరికిరణ్ కి విక్రయించినట్లు ఆలంద మీడియా తాజాగా బంజారా హిల్స్ పిఎస్ లో ఫిర్యాదు చేసింది. అలంద మీడియా డైరెక్టర్ కౌశిక్ రావు ఇచ్చిన ఈ ఫిర్యాదుపై మరో కేసును పోలీసులు నమోదు చేశారు. ఇప్పటికే నేషనల్ లా ట్రిబ్యునల్ లో చుక్కెదురైన రవి ప్రకాష్ బృందం కు అడుగడుగునా చేసిన తప్పులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే గరుడ పురాణం శివాజీ, రవి ప్రకాష్, మూర్తి, హరికిరణ్, శక్తి అనే వారి మధ్య నడిచిన 
ఈ మెయిల్స్ బాగోతం మొత్తం బట్టబయలు అయ్యింది. దాంతో ఎన్సీఎల్టీ న్యాయ వివాదం సృష్ట్టించి తాము కొనసాగాలని భావించిన రవి ప్రకాష్ ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. జులై 12 కు ఎబిసిఎల్ యాజమాన్య బదిలీ వ్యవహారం కేసును వాయిదా వేసింది. జాతీయ ఎన్సీ ఎల్టియే జులై 9 వరకు ఇచ్చిన స్టే తో అలంద మీడియా పైచేయి సాధించడంతో పాటు టివి 9 టేకోవర్ లో ఇబ్బందులు లేకుండా చేసుకోగలిగింది.టీవీ 9 మాతృసంస్థ అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్(ఏబీసీఎల్) కొత్త యాజమాన్యానికి ఇబ్బందులు సృష్టించే ఉద్దేశంతో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)ని అడ్డుపెట్టుకుని పావులు కదిపిన ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్.. సినీనటుడు శివాజీతో కలిసి పన్నిన కుట్ర బట్టబయలయ్యింది. వీరిద్దరి మధ్య కుదిరింది పాత ఒప్పందం కాదని, ఎన్సీఎల్టీలో కేసు వేయడం కోసం కుట్ర చేసి, పాత తేదీతో నకిలీ షేర్ పర్చేస్ అగ్రిమెంట్‌ కుదుర్చుకున్నట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు పక్కా సాక్ష్యాధారాలు లభించినట్లు తెలిసింది. దీంతో ఈ కేసు మరో కొత్త మలుపు తిరగడంతో పాటు రవిప్రకాశ్ చుట్టూ మరింత ఉచ్చు బిగుసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ కుట్రకు సంబంధించి శక్తి అనే వ్యక్తి నుంచి, డైరెక్టర్ ఎంకేవీఎన్‌ మూర్తి, రవిప్రకాశ్,  రవిప్రకాశ్‌కు సన్నిహితుడైన హరి అనే వ్యక్తి, ఏబీసీఎల్ ఫైనాన్స్ అధికారిగా ఉన్న మూర్తి అనే మరో వ్యక్తి మధ్య జ‌రిగిన పలు ఈ-మెయిళ్లను సైబర్ క్రైమ్ పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 
ఈ-మెయిల్స్ ఆధారాలు దొరకకుండా సర్వర్‌ల నుంచి రవిప్రకాశ్, ఆయన అనుచరులు డిలీట్ చేసినప్పటికీ, సైబర్ క్రైమ్ పోలీసులు అత్యాధునిక పరిజ్ఞానం ఉపయోగించి వీటిని వెలికి తీశారు.రవిప్రకాశ్ నుంచి 40 వేల షేర్లను కొనుగోలు చేసేందుకు శివాజి ఫిబ్రవరి 20, 2018న ఒప్పందం కుదుర్చుకున్నట్లు సృష్టించిన ఒప్పందపు డ్రాఫ్ట్‌ను వాస్తవానికి ఏప్రిల్‌13, 2019న తయారు  చేశారు. ఈ డ్రాఫ్ట్‌ను ఆ రోజు సాయంత్రం 5:46 గంటలకు ఫైనాన్స్ అధికారి మూర్తికి మెయిల్‌ చేసిన శక్తి… రవిప్రకాశ్, ఎంవీకేఎన్‌ మూర్తి, రవిప్రకాశ్‌ సన్నిహితుడు హరిలకూ కాపీలు పంపించారు. ఫిబ్రవరి 20, 2018న కుదుర్చుకున్నట్లు పాత తేదీతో చేసుకోబోయే ఒప్పందం వివరాలు ఇందులో ఉన్నాయి. ఈ విష‌య‌మై రవిప్రకాశ్, ఆయన అనుచరులు మెయిల్‌లో సంప్రదింపులు  జరిపినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. వీటి ఆధారంగానే సెక్షన్ 41 సీఆర్పీసీ కింద పోలీసులు రవిప్రకాశ్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ సెక్షన్ కింద అరెస్టయ్యే ప్రమాదాన్ని తప్పించుకోవడం  కోసం.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్ట్‌లో రవిప్రకాశ్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను కూడా న్యాయస్థానం తిరస్కరించింది. ఈ వ్యవహారం అంతా బట్టబయలు కావడంతో, ఎన్సీఎల్టీలో  జరగబోయే విచారణ మీద ఇప్పుడు ఆసక్తి నెలకొని ఉంది.

No comments:
Write comments