కొంప ముంచిన నివేదికలు

 

విజయవాడ, మే 24  (globelmedianews.com)

నారా చంద్రబాబునాయుడు ఓటమికి అనేక కారణాలున్నాయి. ఆయన స్వయంకృతాపరాధమే కారణమని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కు తాను శాశ్వత ముఖ్యమంత్రిగా చంద్రబాబు భావించడమే ఇందుకు ముఖ్య కారణం. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాను తప్ప మరో దిక్కులేదని ఆయన అనుకున్నారు. ఎందుకంటే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తనకంటే అన్ని విషయాల్లో తక్కువేనన్నది ఆయన నిశ్చితాభిప్రాయం. పైగా మరోసారి తన వెంట ప్రజలు ఉన్నారని ఆయన బలంగా విశ్వసించారు. ఈ లెక్కలన్నీ ఎక్కడివో కావు. ఆయనకు అందించిన ఆర్టీజీఎస్ వే.ఎందుకంటే 24 గంటలు పనిచేస్తుందని చెబుతున్న ఆర్టీజీఎస్ ప్రజల సంతృప్తిపై చంద్రబాబుకు ఎప్పటకిప్పుడు నివేదికలు అందించేవి. ఏరోజు ప్రజల సంతృప్తి శాతం 84 శాతానికి మించకుండా ఆర్టీజీఎస్ ఇచ్చింది. ఈ కాగితాల నివేదికలను చూసుకుని చంద్రబాబు ఫుల్లు గా శాటిస్ఫై అయ్యేవారు. నేతలకు కూడా టెలికాన్ఫరెన్స్ ల్లోనూ, కలెక్టర్ల వీడియోకాన్ఫరెన్స్ ల్లోనూ పదే పదే ఈ కాకి లెక్కలు చెప్పేవారు. కొంప ముంచిన నివేదికలు
ప్రజలు తన ప్రభుత్వం గురించి, స్థానిక ఎమ్మెల్యేల గురించి ఏమనుకుంటున్న వాస్తవ నివేదికలు ఆయన వద్దకు చేరలేదు.దీంతో తానే మరోసారి ముఖ్మమంత్రిని అని గట్టిగా భావించారు. అందుకే పోలింగ్ పూర్తయిన తర్వాత కూడా అధికారులపై బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. దీంతో పాటు ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహిచడం, అభ్యర్థి ఎంపికపై కార్యకర్తల మనోభావాలను తెలుసుకున్నాననిచెప్పడం హంబగ్ గా పార్టీ శ్రేణులే కొట్టి పారేస్తున్నాయి. సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి మహానాడు సాక్షిగానే చెప్పినా చంద్రబాబు పసిగట్టలేకపోయారు. టెలికాన్ఫరెన్స్ లు, వీడియో కాన్ఫరెన్స్ లు మన కొంపముంచుతాయని జేసీ వ్యాఖ్యానించారు. అంతేకాదు జన్మభూమికమిటీలతో చెడ్డపేరు వచ్చిందని వాటిని రద్దు చేయాలని సూచించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని, నలభై శాతం మందిని మారిస్తేనే మళ్లీ గెలుస్తామని జేసీ ఆనాడే చెప్పారు.కానీ చంద్రబాబునాయుడు అవేమీ పెద్దగా పట్టించుకోలేదు. సామాన్య ప్రజల్లో కూడా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత నెలకొన్న విషయాన్ని గుర్తించలేకపోయారు. ఏపీ ముఖ్యమంత్రిగా ఉండి ఉద్యమాల బాట పట్టడం కూడా ప్రజలకు రుచించలేదు. ఏపీ అభివృద్ధిని వదిలేసి మోదీపై పోరాటమంటూ తిరగడాన్ని ప్రజలు హర్షించలేకపోయారు. దీంతో పాటు ప్రభుత్వోద్యోగులపై కూడా చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత ఉందన్న విషయం పోస్టల్ బ్యాలట్లలోనే అర్థమయింది. సచివాలయంలోనే ఉద్యోగులు టపాసులు పేల్చి, స్వీట్లు పంచుకున్నారంటే బాబుపై వారిలో ఎంత వ్యతిరేకత ఉందో ఇట్టే అర్థమవుతుంది. మొత్తం మీద బాబు ఓటమికి ఒక కారణమని చెప్పలేనన్ని కారణాలున్నాయి.

No comments:
Write comments