అనంతలో ఒక్కమగాడిగా నందమూరి బాలయ్య

 


అనంతపురం, మే 24  (globelmedianews.com)
ఏపీ ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాజయం ఎదురయ్యింది. వైసీపీ ఏకంగా 150 సీట్లకుపైగా దక్కించుకుంది.. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, రాయలసీమ జిల్లాల్లో ఫ్యాన్ గాలి బలంగా వీచింది. రాయలసీమలో టీడీపీ కేవలం రెండు సీట్లను మాత్రమే గెలుచుకుంది. అది కూడా బావా, బావమర్దులైన.. చంద్రబాబు, నందమూరి బాలయ్య మాత్రమే. హిందూపురం నుంచి బాలయ్య.. వైసీపీ అభ్యర్థి ఇక్బాల్‌పై 17,028 మెజార్టీతో గెలిచారు. హిందూపురం నియోజకవర్గం మొదటి నుంచి టీడీపీకి కంచుకోటలా ఉంది. 1983 నుంచి తెలుగు దేశం తిరుగులేని మెజార్టీతో గెలుస్తోంది. 1983లో పామిశెట్టి రంగనాయకులు మొదటిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత 1985 నుంచి 1994 వరకు ఎన్టీఆర్ విజయం సాధించగా.. 1996లో మాత్రం నందమూరి హరికృష్ణ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో వెంకట్రాముడు.. 2004లో పామిశెట్టి రంగనాయకులను విజయం వరించింది. 2009లో అబ్దుల్ ఘనీ గెలుపొందారు.


అనంతలో ఒక్కమగాడిగా నందమూరి బాలయ్య
నందమూరి బాలకృష్ణ.. నందమూరి తారకరామారావు తనయుడిగా నటనతో పాటూ రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు. ఓవైపు సినిమాలు చేస్తూనే.. 2014లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. రాజకీయాల్లో తండ్రి సెంటిమెంట్‌నే కొనసాగిస్తూ.. హిందూపురం నుంచి పోటీచేసిఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో బాలయ్య 16 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి నవీన్ నిశ్చల్‌పై గెలిచారు. ఈసారి వైసీపీ వ్యూహం మార్చింది.. నవీన్‌ను పక్కనపెట్టి.. కొత్త అభ్యర్థిని బరిలోకి దింపాలని భావించింది. టీడీపీలో అసంతృప్తిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ ఘనీని పార్టీలో చేర్చుకుంది. తర్వాత ఘనీకి ట్విస్ట్ ఇస్తూ.. కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఐజీ ఇక్బాల్‌ అహ్మద్‌కు టికెట్ కేటాయించారు. హిందూపురం నియోజకవర్గంలో బీసీలు, మైనారిటీ ఓటర్లు ఎక్కువమంది ఉన్నారు.. గెలుపోటములను నిర్ణయించేది వీళ్లేనట. హిందూపురంలో మొత్తం 2,19,012 మంది ఓటర్లు ఉంటే.. 95,500 మంది బీసీలు కాగా.. వీరిలోనూ వాల్మీకి వర్గానికి చెందినవారు 42 వేలు.. పద్మశాలీలు 21వేలు, వడ్డె కులస్తులు 20 వేల మంది ఉన్నారు. ఇక ముస్లిం ఓటర్లు 55 వేల మంది. ఈ నియోజకవర్గంలో ఈ రెండు వర్గాలూ, ఎస్సీ ఎస్టీలు టీడీపీకి అండగా ఉంటున్నారు.  కాంగ్రెస్ పవనాలు బలంగా వీచినా కూడా.. హిందూపురంలో మాత్రం పసుపు జెండానే ఎగురుతూ వస్తోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి హిందూపురంలో ఓటమి ఎరుగదు. బాలయ్య టీడీపీ హవాను కొనసాగించి.. పాత సెంటిమెంట్‌ను రిపీట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్ గాలి వీచినా.. ఆ హవాను తట్టుకొని బాలయ్య మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతలో గెలిచిన ఒక్క మగాడిగా నిలిచారు

No comments:
Write comments