మెరుగైన ప్యాకేజిని అందిస్తున్న ప్రభుత్వం

 

సిద్ధిపేట, మే 07: (globelmedianews.com
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన వారికి దేశంలోనే అత్యంత మెరుగైన ప్యాకేజీని తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నదని సిద్ధిపేట, రాజన్న సిరిసిల్లా జిల్లాల కలెక్టర్లు కృష్ణ భాస్కర్, వెంకట్రామ రెడ్డిలు చెప్పారు. సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా ఉన్నతాధికారులు, జిల్లాలోని వివిధ మండలాల అధికారిక యంత్రాంగంతో మల్లన్న సాగర్ ప్రాజెక్టు ముంపునకు గురయ్యే 8 గ్రామ పంచాయతీలల్లో ఆయా గ్రామ భూ నిర్వాసితులకు పరిహారాన్ని, ఇళ్ల పట్టా పత్రాల అందజేసారు. ఈ  కార్యక్రమంలో 13 మందితో కూడిన జిల్లా ఉన్నతాధికారుల బృందాలను నియమిస్తూ పంపిణీ శిబిరంలో చేపట్టాల్సిన విధులపై వారితో సుదీర్ఘంగా సమీక్ష జరిపారు. వీరిలో 6 మందితో పాటు తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, రెవెన్యూ శాఖకు చెందిన అధికారులు పంపిణీ కౌంటర్ల వద్ద ఉంటారని, అలాగే 18 సంవత్సరాల పైబడి ఉన్న వారి పర్యవేక్షణకు ఇద్దరు జిల్లా అధికారులతో పాటు తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, రెవెన్యూ శాఖ అధికారులు ఉంటారని, అదే విధంగా 3 చోట్ల  ఏర్పాటు చేస్తున్న హెల్ప్ డెస్క్ లలో జిల్లా అధికారులతో పాటు తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, రెవెన్యూ శాఖ అధికారులు ఉంటారని, ఫిర్యాదులు స్వీకరించే 2 కౌంటర్లలో 2 జిల్లా అధికారులు, తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, రెవెన్యూ శాఖ అధికారులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్లు వివరించారు. 


మెరుగైన ప్యాకేజిని అందిస్తున్న  ప్రభుత్వం

వీరితో పాటు అవసరమైన చోట వివిధ శాఖలకు చెందిన కిందిస్థాయి సిబ్బందిని నియమిస్తున్నట్లు వెల్లడించారు. ముందుగా మల్లన్న సాగర్ ప్రాజెక్టు ముంపునకు గురయ్యే 8 గ్రామ పంచాయతీలు సిద్ధిపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని లక్ష్మాపూర్, రాంపూర్, బ్రహ్మాణ బంజరు పల్లి, పల్లె పహాడ్, ఏటిగడ్డ కిష్టాపూర్, వేములఘాట్, గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఎర్రవల్లి, సింగారం గ్రామాలల్లో భూ నిర్వాసితులకు ప్రభుత్వం ఏ విధంగా పరిహారాన్ని, ఇళ్ల పట్టా పత్రాలను అందజేస్తున్నదన్న విషయాలను సవివరంగా వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పునరోపాధి, పునరావాస ప్యాకేజీ కింద అందిస్తున్న సాయం దేశంలో ఉన్న అన్ని ప్యాకేజీలకంటే బెటర్ గా ఉంటుందని వివరిస్తూ.., అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం మల్లన్నసాగర్ నిర్వాసితులకు అంతకన్నా నాలుగు రెట్లు ఎక్కువగా.. దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా ఇళ్లను నిర్మించి ఇస్తున్నదని చెప్పారు. బాధితుల కోసం రూ.5.04 లక్షల విలువైన 560 అడుగుల డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మిస్తున్నామని, ఈ ఇండ్లను కూడా ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో కాకుండా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎడ్యుకేషన్ హబ్ పక్కన 460 ఎకరాల విస్తీర్ణంలో తీర్చి దిద్దుతున్నట్లు పేర్కొన్నారు. ఇక గృహాలు వద్దనుకునే వారికి 250 గజాల ఇంటి స్థలం, రూ.5.04 లక్షల నగదు అందిస్తున్నట్లు తెలిపారు.  ప్రస్తుతం ఉన్న ముంపు గ్రామంలోని ఇంటి స్థలానికి గజం రూ.1600 చొప్పున లెక్కగట్టి పరిహారం చెల్లిస్తున్నదని., కోల్పోయిన ఇంటికి కూడా శాస్త్రీయంగా లెక్కగట్టి పరిహారం అందిస్తున్నట్లు వివరించారు. మరోవైపు ఒక్కో కుటుంబానికి పునరావాసం కింద రూ.7.50 లక్షల ప్యాకేజీ అదనంగా అందిస్తున్నట్లు, 18 ఏండ్లు దాటిన అవివాహితులకు కూడా రూ.5 లక్షల పునరావాస సాయం, 250 గజాల ఇంటి స్థలం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పునరావాస ప్యాకేజీ కింద ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన ఇంటికి ఆర్డీఓ  సంతకంతో తహశీల్దారు పట్టా జారీ చేస్తారని, దీంతో అవసరమైన పక్షంలో ఈ ఇంటిని అమ్ముకొనేందుకు లేదా బహుమతిగా కుటుంబసభ్యులకు ఇచ్చేందుకు ఈ పట్టాలు అనుకూలంగా ఉంటాయని తెలిపారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు ప్రభుత్వం అందిస్తున్న పునరోపాధి, పునరావాస కార్యక్రమం కింద ఒక్కో కుటుంబానికి గరిష్ఠంగా దాదాపు కోటి రూపాయల వరకు సాయం అందుతున్నదని తెలుపుతూ.. మల్లన్నసాగర్ పునరావాస ప్యాకేజీ కింద ఒక్కో కుటుంబానికి అందే మొత్తం  రూ.7.50 లక్షలు. ఇద్దరు పెద్ద పిల్లలుంటే అందే మొత్తం రూ.10 లక్షలు. దీంతో కుటుంబంలో పెద్ద పిల్లలకు కలిపి వచ్చేవి 750 గజాల విస్తీర్ణంలో మూడు ప్లాట్లు ఇస్తున్నట్లు., ఇవి ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.75 లక్షలు విలువ చేస్తాయని వివరించారు. ఇక కోల్పోయిన ఇల్లు, ఇంటి స్థలానికి విస్తీర్ణాన్ని బట్టి ప్రభుత్వం పరిహారం అందిస్తున్నట్లు, ఇవన్నీ కలిపితే ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల సాయం అందుతున్నదని వివరించారు. దేశానికే ఆదర్శంగా నిలిచే ప్యాకేజీని తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్వాసితులకు అందిస్తున్నదని, ఇందుకోసం రూ.800 కోట్లను ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీఆర్వో చంద్రశేఖర్, ఆర్డీఓలు జయచంద్రా రెడ్డి, అనంత రెడ్డి, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, వివిధ మండలాలకు చెందిన తహశీల్దార్లు, రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments