అంతా ఆర్భాటమే.. (మహబూబ్ నగర్)

 

మహబూబ్ నగర్, మే 13 (globelmedianews.com): 
రిజిస్ట్రేషన్‌ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు తహశీల్దార్లకు రిజిస్ట్రేషన్‌ బాధ్యతలను అప్పగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది మార్చిలోనే ప్రకటించింది. దీనిలో భాగంగా తహశీల్దారు కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు,  మ్యూటేషన్‌ చేసేందుకు కొత్త విధానంలో రిజిస్ట్రేషన్‌, భూములను ఆన్‌లైన్‌ చేసి మరుసటి రోజునే పాస్‌పుస్తకాలను అందించే చర్యలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో రెండో విడతలో భాగంగా గతేడాది మే 19 నుంచి జిల్లాకు ఒక మండలం చొప్పున మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర, జోగులాంబ గద్వాల జిల్లాలో అయిజ, వనపర్తి జిల్లాలో పెబ్బేరు, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో బిజినేపల్లి మండలాలను ఎంపిక చేసి, ప్రయోగాత్మకంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభించారు. ఆ తర్వాత అదే ఏడాది జూన్‌ నుంచి అన్ని మండలాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అమలయ్యేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు అధికారులు ప్రకటించినా.. అది కార్యరూపం దాల్చలేదు. దీంతో రిజిస్ట్రేషన్‌ సేవలు అందుబాటులోకి రాక జనం ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారు. పట్టా మార్పిడికి ఇబ్బందులు..: జిల్లాలో భూముల కొనుగోలు, రిజిస్ట్రేషన్‌, పట్టా మార్పిడి (మ్యూటేషన్‌) తదితరవి పూర్తి చేయటం ప్రహసనంగా మారి, రైతులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. 


 అంతా ఆర్భాటమే.. (మహబూబ్ నగర్)

ముఖ్యంగా రిజిస్ట్రేషన్‌ అయ్యాక మ్యూటేషన్‌ కోసం దరఖాస్తు చేసుకుని అది పూర్తయ్యే వరకు పలుమార్లు వ్యవసాయ పనులు మానుకుని కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ సందర్భంలోనే అవినీతి, అక్రమాలకు తెరలేస్తోంది. అంతులేని జాప్యం చోటు చేసుకుంటోంది. చాలాసార్లు భూమి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారు మ్యూటేషన్‌కు వెళ్లకుండా పత్రాలను దగ్గర పెట్టుకుంటున్నారు. దీంతో ఆ భూమి దస్త్రాల్లో అమ్మినవారి పేరిటే ఉంటోంది. ఒకవేళ చనిపోయినట్లయితే వారసులు తమ పేరు మీదకు మార్చుకొని, మళ్లీ ఇతరులకు అమ్మడంతో విదాదానికి తెరలేస్తోంది. ప్రధానంగా రిజిస్ట్రేషన్‌, మ్యూటేషన్‌ రెండు వేర్వేరు కార్యాలయాల్లో చేస్తుండటంతో పలు ఇబ్బందులకు గురవుతున్నారు. మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లా పరిధిలోని మండలాలకు గతేడాది సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ సామగ్రిని ప్రభుత్వం సరఫరా చేయడంతో పాటు జిల్లాల్లోని రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు లేని మండలాల్లో సబ్‌రిజిస్ట్రార్‌ సేవలు అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు సైతం పూర్తి చేశారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు అందకపోవడంతో తహశీల్దారు కార్యాలయాల్లో సబ్‌రిజిస్ట్రార్‌ సేవలు మాటలకే పరిమితం అయ్యాయి.జిల్లాలో మొత్తం 15 మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో విరాసత్‌లు 418 పెండింగ్‌లో ఉండగా.. మ్యూటేషన్లు 174 ఉన్నాయి. విరాసత్‌ పెండింగ్‌ కేసుల్లో ఫారం-8 పెండింగ్‌ 49, క్షేత్రస్థాయి పరిశీల చేయాల్సినవి 209, మండల సీనియర్‌ సహాయకుడి స్థాయిలో 84, ఉప తహశీల్దారు స్థాయిలో 14, తహశీల్దారు తుది నిర్ణయం తీసుకునే స్థాయిలో 62 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. డాక్యుమెంటు కొనుగోలు, బదలాయింపులకు   సంబంధించి మ్యూటేషన్‌ పెండింగ్‌ ఉన్నవాటిలో ఫారం-8ఏ 13, క్షేత్రస్థాయి పరిశీలన 64, సీనియర్‌ సహాయకుడి స్థాయిలో 23, ఉప తహశీల్దారు దగ్గర 14, తహశీల్దారు స్థాయిలో 60 పెండింగ్‌లో ఉన్నాయి. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణికి వచ్చే అర్జీల్లో 75 శాతం భూములకు సంబంధించిన ఫిర్యాదులే ఉండటం గమనార్హం.

No comments:
Write comments