ఆ కుటుంబాలు గెలిచాయి.,,.,

 


విశాఖపట్టణం, మే 24  (globelmedianews.com)

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో వైసీపీ సునామీలో టీడీపీ కొట్టుకుపోయింది. శ్రీకాకుళంలో మొదలైన తుఫాను చిత్తూరులో తీరం దాటింది. అయితే, వైసీపీ ప్రభంజనంలోనూ దివంగత ఎర్రన్నాయుడు కుటుంబం మాత్రం గెలిచి నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్ గాలి వీచినా ఆయన కుటుంబ వారసులంతా విజయం సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీకి జనం పట్టం కట్టినా ఎర్రన్న ఇంట మాత్రం సైకిల్‌ జోరు పెంచింది. తొలిసారిగా రాజమండ్రి అర్బన్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఎర్రన్నాయుడి కుమార్తె ఆదిరెడ్డి భవాని 33వేలకుపైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక, ఎర్రన్న సోదరుడు, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలిలో వరుసగా రెండోసారి గెలుపొంది చరిత్ర సృష్టించారు. 


ఆ కుటుంబాలు గెలిచాయి.,,.,
ఇక్కడ 8,545 ఓట్లతో శాసనసభ్యునిగా ఆయన విజయం సాధించారు. శ్రీకాకుళం ఎంపీగా ఎర్రన్నాయుడి కుమారుడు కింజరాపు రామ్మోహన్‌నాయుడు 6 వేల ఓట్లతో గెలుపొందారు. ఒకే కుటుంబం నుంచి బరిలోకి దిగిన వీరు ముగ్గురూ విజయం సాధించడం విశేషం. గెలుపొందడం రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. శ్రీకాకుళంలో టీడీపీ రెండు చోట్ల విజయం సాధించగా, వీటిలో ఒకటి మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిథ్యం వహించిన టెక్కలి. ఇక్కడ పేరాడ తిలక్ నుంచి అచ్చెన్నకు గట్టి పోటీ ఎదరయ్యింది. ఈ నియోజకవర్గంలో కళింగ సామాజిక వర్గం ఓట్లు అభ్యర్థుల గెలుపు నిర్ణయిస్తాయి. వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో అచ్చెన్నాయుడి తీవ్రంగా శ్రమించారు. లెక్కింపు మొదలైన తర్వాత కొన్ని రౌండ్లు వెనుబడి ఉన్నారు. తర్వాత చివరి రౌండ్లలో పుంజుకుని 8 వేలకు పైగా ఓట్లతో గెలుపొందారు. ఇక, శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలోని ఏడు స్థానాల్లో ఐదు వైసీపీ దక్కించుకుంది. అయితే, వైసీపీ అభ్యర్థులు గెలిచిన సెగ్మెంట్లలో వారికి రెట్టింపు మెజార్టీ టీడీపీ ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడికి వచ్చింది. ఇచ్చాపురం, టెక్కలిలో టీడీపీ ఎమ్మెల్యేలు గెలవడంతో అక్కడ పూర్తి ఆధిక్యత సాధించిన రామ్మోహన్, వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచిన చోట్ల టీడీపీకి ఆధిక్యత రావడం విశేషం. దీంతో రామ్మోహన్ 6 వేల ఓట్లతో విజయం సాధించారు. ఇక, రాజమండ్రి సిటీ నుంచి పోటీలో నిలిచిన ఆదిరెడ్డి భవానీ భారీ మెజార్టీతో విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి రౌతు సూర్యప్రకాశ్ రెడ్డిపై 33 వేల ఓట్ల భారీ ఆధిక్యతతో గెలుపొందారు. దీంతో ఎర్రన్నాయుడు కుటుంబామంతా విజయం సాధించి, చట్టసభల్లో అడుగుపెట్టబోతున్నారు.

No comments:
Write comments