పల్లెకు దిక్కెవరు..? (తూర్పుగోదావరి)

 

కాకినాడ, మే4 (globelmedianews.com): 
గ్రామ పరిపాలనలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకం. ప్రజల అసవరాలు తెలుసుకుని వాటిని పరిష్కరించడంతోపాటు, గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనలో క్రియా శీలకంగా వ్యవహరించాల్సిన పరిస్థితి. అయితే జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల కొరత తీవ్రంగా వెంటాడుతోంది. దీంతో పలు చోట్ల సమస్యలు తెలియజేసేందుకు స్థానికులు పంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్తే కార్యదర్శి ఎప్పుడొస్తారో చెప్పలేని పరిస్థితి. ఒక్కరికే రెండు, మూడు పంచాయతీల బాధ్యతలు ఉన్న నేపథ్యంలో వారు ఏ రోజు ఎక్కడుంటారో తెలియని పరిస్థితి నెలకొంటుంది. దీంతో అక్కడికి వచ్చిన ప్రజలు నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొటుంది.జిల్లాలో 229 పంచాయతీ కార్యదర్శి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఒక్కో కార్యదర్శి సాధారణ విధులు నిర్వహిస్తూనే మరో రెండు, మూడు పంచాయతీలకు అదనపు బాధ్యతలు నిర్వహించాల్సి వస్తోంది. 


పల్లెకు దిక్కెవరు..? (తూర్పుగోదావరి)

జిల్లాలో మొత్తం 1,069 పంచాయతీలుండగా పరిపాలనా సౌలభ్యం కోసం 779 క్లస్టర్లుగా విభజించారు. క్లస్టర్‌కు ఒకరి చొప్పున 779 మంది అధికారులు విధులు నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం 550 మంది కార్యదర్శులు మాత్రమే ఉన్నారు. మేజర్‌ పంచాయతీల్లో విధులు నిర్వహించే వారికి పని ఒత్తిడి పెరిగిపోవడంతో వారూ ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం పల్లెల్లో ప్రత్యేకాధికారుల పాలన నడుస్తున్న నేపథ్యంలో వీరి పాత్ర కీలకంగా మారింది. రెండు నుంచి మూడు పంచాయతీలకు ఒక కార్యదర్శే విధులు నిర్వహించాల్సి ఉండడంతో వారిపై ఒత్తిడి పెరుగుతోంది. ఉదాహరణకు కొత్తపల్లి మండలంలో శ్రీరాంపురం పంచాయతీ కార్యదర్శికి అదనంగా ఉప్పాడ, రమణక్కపేట పంచాయతీలు కేటాయించారు. శ్రీరాంపురం నుంచి ఉప్పాడ రావాలంటే పది కిలోమీటర్లు, ఉప్పాడ నుంచి రమణక్కపేట వెళ్లాలంటే మరో పది కిలో మీటర్లు ప్రయాణం చేయాలి. ఇలా మూడు పంచాయతీలు తిరగాలంటే ఒకపూట ప్రయాణానికే సరిపోతుంది. మరో మండలంలో ఓ కార్యదర్శికి మూడు పంచాయతీలు కేటాయించగా ఆయన మండల పరిషత్తు కార్యాలయంలోనే ఉంటూ అర్జీదారులను అక్కడికే రప్పించుకుని విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇటువంటి పరిస్థితులు జిల్లాలో చాలా మండలాల్లో ఉంది. వీటి వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని పలువురు వాపోతున్నారు.

No comments:
Write comments