ఇల్లు’ గుల్ల (కృష్ణాజిల్లా)

 

మచిలీపట్నం, మే 28 (globelmedianews.com): 

ప్రభుత్వ ఆసరాతో సొంతింటి కల సాకారం చేసుకోవాలనే వారికి నిర్మాణం భారంగా మారుతోంది. సకాలంలో బిల్లులు మంజూరు కాని ప్రభావం నిర్మాణ పురోగతిపై పడుతోంది. నిర్మాణాలకు అవసరమైన ఉక్కు, సిమెంట్‌, తదితరాల ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో లబ్ధిదారులు కలవరపడుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ ప్రభుత్వం మంజూరు చేసిన గృహాల బిల్లుల బకాయిలు దాదాపు రూ.58 కోట్ల వరకూ ఉన్నాయి. అసంపూర్తిగా నిలిచిన భవనాల పురోగతి ప్రశ్నార్థకమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలకు అనుమతులిచ్చారు. ● రాష్ట్ర ప్రభుత్వ పరంగా రూ.1.50 లక్షల యూనిట్‌ విలువతో ఎన్టీఆర్‌ గ్రామీణ గృహ నిర్మాణ, కేంద్రం సహకారంతో ఎన్టీఆర్‌(గ్రామీణ) ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన ద్వారా రూ.2 లక్షల యూనిట్‌ విలువతో గృహాలను మంజూరు చేశారు. ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహకారంతో సొంతింటి కల సాకారం అవుతుందన్న ఆశతో జిల్లా వ్యాప్తంగా పలువురు నిర్మాణాలను ప్రారంభించారు. 2016-17 నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వరకూ ఎన్టీఆర్‌ గ్రామీణ గృహ నిర్మాణ పధకం, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన ద్వారా 2017-18 వరకూ 72,457 గృహాలు మంజూరు చేశారు. వీటితో పాటు 2018-19 సంవత్సరానికి యూడీఏ కింద 17,580 గృహాలు కేటాయించారు. ఇవి కాకుండా ప్రీ ఎన్టీఆర్‌ పథకం పేరున 12,531 మందికి అనుమతులిచ్చారు. 


ఇల్లు’ గుల్ల (కృష్ణాజిల్లా)
నిర్మాణాలు మొదలుపెట్టిన నాటి నుంచి బిల్లుల మంజూరు విషయంలో ఇబ్బందులు తప్పడం లేదు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులతో పాటు కొంత శాతం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులు కూడా లబ్ధిదారులకు ఇవ్వాల్సిఉంది. ఉపాధి నిధుల విడుదలలో మితిమీరిన జాప్యం లబ్ధిదారులకు ఇబ్బందికరంగా మారింది. కేవలం ప్రభుత్వం ఇచ్చే నిధులతో నిర్మాణం పూర్తవదని తెలిసినా వ్యక్తిగతంగా కొద్ది మొత్తం పెట్టుబడితో సొంత గృహం సమకూర్చుకోవచ్చన ఆశతో అత్యధిక శాతం మంది లబ్ధిదారులు నిర్మాణ పనులు ప్రారంభించారు.దశల వారీ ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు ఆలస్యం అవుతుండటంతో మధ్యస్థంగా పనులు ఆపలేక అప్పులు తెచ్చి కొనసాగిస్తున్నారు. బిల్లుల మంజూరులో నెలల తరబడి ఆలస్యం అవుతున్న పరిస్థితుల్లో తెచ్చిన అప్పులకు వడ్డీలు గుదిబండగా మారుతున్నాయి. సకాలంలో నిర్మాణాలు పూర్తిచేసుకోని ప్రభావం మరింత ఆర్థిక భారానికి కారణమవుతోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి చూస్తే సిమెంట్‌ బస్తా ధర రమారమి రూ.100 వరకూ అధికమయ్యింది. ఇనుము ధర టన్ను దాదాపు రూ.50వేలకు చేరుకోవడంతో పాటు అందుబాటులో లేని ఇసుక రేవుల కారణంగా ఇసుక ధరకూ రెక్కలొచ్చాయి. భవన నిర్మాణ కార్మికుల కూలీ రేట్లు కూడా పెరిగాయి. ఐదారు నెలల ఆలస్యం కారణంగా పక్కా ఇంటి నిర్మాణ వ్యయం రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకూ అదనంగా భరించాల్సి వస్తోందంటూ లబ్ధిదారులు వాపోతున్నారు. బిల్లుల మంజూరులో ఆలస్యాన్ని నివారించకపోతే తాము మరింత నష్టపోయే అంశాన్ని గమనించి తగు చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నారు.పథకం ప్రారంభించినప్పటి నుంచి బిల్లులో జాప్యం పరిపాటి అవుతోంది. గతేడాది చివరి నాటికి దాదాపు రూ.55 కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఆందోళన చెందారు ఎట్టకేలకు అవి పరిష్కారం అయ్యాయనుకుంటే ఈ ఏడాది ప్రారంభం నుంచి మళ్లీ బిల్లులు నిలిచిపోయాయి. ఈ ఏడాది మార్చి మాసాతంలోపు సమర్పించిన బిల్లులకు నిధులు మంజూరు చేసినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నా, పలువురి లబ్ధిదారుల ఖాతాల్లోకి అవి జమకాలేదన్న ఫిర్యాదులున్నాయి. జనధన్‌ ఖాతా నెంబర్లు ఇచ్చిన లబ్ధిదారుల ఖాతాల్లో బిల్లు మొత్తం రూ.50వేలకు మించితే జమపడదని, ఈ కారణంతోనే కొందరి ఖాతాల్లోకి నగదు జమపడకపోయి ఉండవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.

No comments:
Write comments