బొగ్గు గనుల్లో ముందస్తు తవ్వకాలు

 

అదిలాబాద్, మే 17, (globelmedianews.com)
విద్యుదుత్పాక ప్లాంట్లకు పెరిగిన ఇంధన అవసరాలకు దృష్టిలో ఉంచుకుని బొగ్గు గనుల ప్రాజెక్టులను మరింతగా విస్తరించాలని సింగరేణి కాలరీస్ కో లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) నిర్ణయించింది. తెలంగాణలోని కళ్యాణి ఖని-6 ఇన్‌క్లైన్ బ్లాక్‌తో సహా పలు గనుల్లో ముందస్తు తవ్వకం పనులు చేపట్టేందుకు ఆసక్తిగల (ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్) సంస్థలను ఆహ్వానించింది. కళ్యాణి ఖని-6లో దాదాపు 15.65 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. మంచిర్యాల జిల్లా మందమర్రి సాఫ్ట్‌బ్లాక్‌లో తవ్వకం మొదలైన సరికొత్త భూగర్భ బొగ్గుగని ప్రాజెక్టుకాగా ఇందులోప్రీ మైనింగ్ పనుల నిర్వహణకు ఆసక్తిగల సంస్థలను సింగరేణి కాలరీస్ లిమిటెడ్ ఆహ్వానించింది. ప్రాజెక్టు అభివృద్ధితోబాటు బొగ్గు వెలికితీత పనులను మూడు చిన్న తరహా సాంకేతిక పరికరాలతో దశల వారీగా ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నిర్వహించాల్సి ఉంటుందని వెబ్‌సైట్‌లో ఎస్‌సీసీఎల్ పేర్కొంది. 


బొగ్గు గనుల్లో ముందస్తు తవ్వకాలు

కాగా రాష్ట్ర విభజనానంతరం తెలంగాణ రాష్ట్రం విద్యు త్ లోటుగల రాష్ట్రంగా మారింది. ఈ లోటును పూడ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఓ కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఆ మేరకు సుమారు 6000 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ఎస్‌సీసీఎల్ తెలంగాణలోని శ్రీరాంపూర్ ప్రాంతంలో సైతం 1800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ఉత్పాదక ప్రాజెక్టును ప్రస్తుతం నిర్మిస్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్ పునర్య్వవస్థీకరణ చట్టం ప్రకారం నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ) సైతం 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదక ప్రాజెక్టును తెలంగాణలో ఏర్పాటు చేయాల్సివుంది. ఈక్రమంలో కొత్త విద్యుత్ ఉత్పాదక ప్రాజెక్టులకు అనుగుణంగా ఎస్‌సీసీఎల్‌కు 40 మిలియన్ టన్నుల బొగ్గు అదనంగా అవసరం అవుతుంది. ఈ క్రమంలో బొగ్గులోటును పూడ్చేందుకు ప్రస్తుత ప్రాజెక్టుల విస్తరణతోబాటు సరికొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త ప్రణాళికల అమలుకు ఉపక్రమించాయి. కాగా కళ్యాణి ఖని -6 ఇన్‌క్లైన్ ప్రాజెక్టు విస్తరణ వల్ల విద్యుత్‌లోటును చాలావరకు పూడ్చవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇలావుండగా దక్షిణ భారత దేశంలో ఉన్న ఏకైక సింగరేణి కాలరీస్ కో లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) ప్రభుత్వ రంగ బొగ్గుగనుల నిర్వహణ సంస్థ టీఎస్‌జెన్‌కో, ఏపీజెన్‌కో, కేపీసీఎల్, మహాజెన్‌కోలకు బొగ్గు సరఫరా చేస్తోంది. 27.71 మిలియన్ టన్నుల బొగ్గు సరఫరాకు విద్యుత్ ఉత్పాదక కంపెనీలతో ఎస్‌సీసీఎల్ ఒప్పందం కుదుర్చుకుంది.

No comments:
Write comments