ఢిల్లీలో షీలాకే పెద్ద పీట

 

న్యూఢిల్లీ, మే 6, (globelmedianews.com)
రాహుల్ యువనాయకులనే నమ్ముతారు. యువతను ప్రోత్సహిస్తారు. సీనియర్ నాయకులను సలహాల వరకే పరిమితం చేస్తారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి యువతరమే నేతృత్వం వహించాలన్నది రాహుల్ ఆకాంక్ష. ఈ మేరకు దాదాపు అన్ని రాష్ట్రాల్లో యువనేతలకే పెద్దపీట వేస్తున్నారు. ఒక రాజస్థాన్ తీసుకున్నా, మధ్యప్రదేశ్ ను చూసినా… అక్కడ యువనేతలను ముఖ్యమంత్రులుగా చేయకపోయినా వారికున్న ప్రాధాన్యత రాహుల్ ఎవరికీ ఇవ్వరు. సచిన్ పైలట్, జ్యోతిరాదిత్య సింధియా వంటి వారు రాహుల్ కోటరీలో కీలకంగా ఉన్నారు. కాని దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వచ్చేసరికి రాహుల్ సీనియారిటీ, సిన్సియారిటీకే పెద్దపీట వేసినట్లు కనపడుతుంది.ఢిల్లీ రాజకీయాలను మొత్తం సీనియర్ నేత షీలా దీక్షిత్ కే రాహుల్ అప్పజెప్పారు. మూడు దఫాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. ఢిల్లీ అణువణువూ తెలిసున్న నేత. కాంగ్రెస్ పార్టీ సొంతంగా, ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నదీ షీలా దీక్షిత్ వల్లనే అంటారు. తొలుత ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పొత్తు ఉంటుందని భావించారు. 


ఢిల్లీలో షీలాకే పెద్ద పీట

ఇద్దరు కలసి పోటీ చేస్తే బీజేపీకి చెక్ పెట్టవచ్చన్నది కూడా రెండు పార్టీలూ భావించాయి. కానీ షీలా దీక్షిత్ ముందు చూపుతో ఈ పొత్తును తిరస్కరించారంటున్నారు.ఒకసారి పొత్తుతో బరిలోకి దిగితే కాంగ్రెస్ పార్టీ ఇక ఢిల్లీలో కోలుకోలేదని, క్యాడర్ కూడా చెల్లా చెదురు అయిపోతుందని, గెలిచినా, గెలవకున్నా సొంతంగా పోటీ చేయడమే మేలని షీలా సూచన చేశారు. అంతేకాదు త్రిముఖ పోటీలో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు సాధించే అవకాశాలు కూడా లేకపోలేదని ఆమె గట్టిగా చెప్పారు. దీంతో రాహుల్ గాంధీ ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తుకు తిరస్కరించారంటారు. ఢిల్లీని ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని 81 ఏళ్ల షీలా దీక్షిత్ గట్టి నమ్మకంతో ఉన్నారు. అలా రాహుల్ గాంధీ షీలా దీక్షిత్ సూచనలను విశ్వరించారట.షీలా దీక్షిత్ ఈశాన్య ఢిల్లీ స్థానం నుంచి బరిలోకి దిగారు. ఈ వయసులోనూ ఆమె ఇతర అభ్యర్థులకంటే ముందుడటం విశేషం. ఈ ఏడాది జనవరిలోనే షీలా దీక్షిత్ ఢిల్లీ పీసీసీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. అప్పటి నుంచే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు. షీలా దీక్షిత్ ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా గెలుస్తారని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదిహేనేళ్ల పాటు ఆమె చేసిన సేవను ఎవరూ మరవలేదని, ఈశాన్య ఢిల్లీ ప్రజలు షీలాకే జైకొట్టనున్నారని చెబుతున్నారు. ఢిల్లీలో కనీసం ఐదు స్థానాలను కైవసం చేసుకుంటామన్న నమ్మకంతో కాంగ్రెస్ శ్రేణులున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

No comments:
Write comments