నాగబాబు ధీమా వెనుక రీజన్ ఇదేనా

 

కాకినాడ,  మే 15, (globelmedianews.com)
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన సోదరుడు నాగబాబు ఇద్దరు ఈ ఎన్నికల్లో తమ సొంత జిల్లా అయిన పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థిగా రంగంలో ఉండడంతో పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాలు ఈ సారి బాగా హీట్ అయ్యాయి. ఓ వైపు ఎండ‌లు మండుతుంటే ఇక్క‌డ జ‌న‌సేన నుంచి ఈ సోద‌రులు ఇద్దరూ పోటీ చేసి ప‌శ్చిమ పొలిటిక‌ల్ ఉష్ణోగ్రత‌ను ఠారెత్తించారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఇదే జిల్లాలోని పాలకొల్లు నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు మరో ఇద్దరు మెగా బ్రదర్స్ సైతం ఇదే జిల్లా నుంచి పోటీ చేయడంతో ముగ్గురు మెగా బ్రదర్స్ ఈ జిల్లా నుంచి పోటీ చేసినట్లయింది. నరసాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా నాగ‌బాబును రంగంలోకి దించటం వెనక పవన్ చాలా స్కెచ్ వేసుకున్నారు.నరసాపురం లోక్‌స‌భ సెగ్మెంట్ పరిధిలో ఉన్న భీమవరం అసెంబ్లీ నుంచి పార్టీ అధ్యక్షుడి హోదాలో పవన్ స్వయంగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు. దీంతో సహజంగానే జనసేన ప్రభావం ఇక్కడ గట్టిగా కనపడింది. 


నాగబాబు ధీమా వెనుక రీజన్ ఇదేనా

టిడిపి నుంచి ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే కలవపూడి శివరామ రాజు, వైసీపీ నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త కనుమూరి రఘురామ కృష్ణంరాజు పోటీ చేయగా జనసేన నుంచి నాగబాబు రంగంలో ఉన్నారు. లోక్‌స‌భ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. కాపులతో పోలిస్తే చాలా తక్కువ సంఖ్యలో ఉన్న క్షత్రియ సామాజికవర్గం నుంచి టిడిపి, వైసిపి అభ్యర్థులు పోటీ చేశారు. పోలింగ్ సరళిని బట్టి చూస్తే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంపీకి వచ్చే సరికి జనసేనకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరిగినట్టు తెలుస్తోంది. టిడిపి అభ్యర్థి శివ, వైసీపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు గెలుపు తమదే అని చెబుతున్నారుప్రధాన పార్టీ అభ్యర్థులకు ధీటుగా జనసేన అభ్యర్థి నాగబాబు సైతం ఇక్కడ గెలిచేది తానే అని చెబుతున్నారు. ఎన్నికల చివరి క్షణంలో ఇక్కడకు వచ్చిన నాగబాబు గెలుపుపై మాకు ఉన్న ధీమాకు క్రాస్ ఓటింగ్ కారణమని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఉండి నియోజకవర్గంలోని కొన్ని సామాజికవర్గాల్లో టీడీపీ ఎంపీ అభ్యర్థి శివకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరిగితే ఈ నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న కాపు వర్గం ఓటర్లు ఎంపికి మాత్రం జనసేనకి ఓటు వేశారు. ఇక నర‌సాపురం నియోజకవర్గంలో పోటీ ఇవ్వడంతోపాటు రెండో ప్లేస్‌లోకి వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నియోజకవర్గంలో వైసీపీకి అసెంబ్లీకి ఓట్లేసిన వారు సైతం ఎంపికి మాత్రం జనసేన వైపు మొగ్గు చూపారు. పాలకొల్లు నియోజకవర్గంలో జనసేనకు అనుకూలంగా విచిత్రమైన క్రాస్ ఓటింగ్ జరిగింది. అసెంబ్లీకి టీడీపీకి, వైసిపికి ఓటు వేసిన వారిలో చాలామంది ఎంపీకి జనసేన వైపు మొగ్గు చూపారు. నియోజకవర్గంలో కాపులోనే కాకుండా, బీసీల్లో కొన్ని వర్గాలు సైతం ఇలాగే ఓటు వేసినట్టు పోలింగ్ సరళి చెప్పింది.తణుకులో అసెంబ్లీ వరకు టిడిపి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణకు ఓటు వేసిన వారిలో చాలామంది జనసేన అభిమానులు ఎంపికి మాత్రం నాగబాబుకు ఓటేసినట్టు వాళ్ళే స్వయంగా చెబుతున్నారు. భీమవరంలో పవన్ పోటీ చేయటం నాగబాబుకు కలిసి వచ్చిన ఈ నియోజకవర్గంలో క్షత్రియ సామాజిక వర్గంలో కొందరు అసెంబ్లీకి పవన్‌కు ఓటు వేసి… ఎంపీకి టిడిపి అభ్యర్థి శివరామరాజు వైపు ఎక్కువగా మొగ్గు చూపినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోనూ పోటీ చేసిన ముగ్గురు అభ్యర్థులు కాపులే కావడంతో అసెంబ్లీకి టిడిపి, వైసీపీ వైపు మొగ్గు చూపిన కాపు వర్గం ఓటర్లు ఎంపికి జనసేనకి ఓట్లేసినట్టు టాక్.ఆచంటలో మంత్రి పితాని సత్యనారాయణకు వ్యతిరేకంగా క్రాస్ ఓటింగ్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ఆయన సొంత సామాజిక వర్గంలోనే భారీ ఎత్తున చీలిక వచ్చింద‌ని అంటున్నారు. పితానికి వ్య‌తిరేఖంగా ఏకంగా అసెంబ్లీకి వైసీపీకి ఓటు వేసిన వారు ఎంపీకి జన‌సేన వైపు మొగ్గు చూపారా ? లేదా టీడీపీ వైపు మొగ్గు చూపారా ? అన్నది తెలియ‌డం లేదు. అయితే నియోజ‌క‌వ‌ర్గంలో కాపులు సైతం 35,000ల‌కు పైగా ఓట‌రులు ఉన్నారు. ఏదేమైనా ప్రతి నియోజకవర్గంలోనూ అసెంబ్లీకి టీడీపీ లేదా వైసీపీ వైపు మొగ్గు చూపిన వారిలో మెజారిటీ ఓటర్లు ఎంపీకి మాత్రం జనసేనకి ఓటు వేసినట్టు జనసేన వర్గాలు అంటున్నాయి. ఇదే ధీమాతోనే ఇప్పుడు నర‌సాపురం ఎంపీగా నాగబాబు గెలుపు ఖాయమని జనసేన లెక్కలు వేసుకుంటోంది. ఈ లెక్కలు ఎంత వరకు నిజం అవుతాయో ఈ నెల 23న తేలిపోనుంది.

No comments:
Write comments