సిక్కోలులో

 

బాబాయ్ వర్సెస్ అబ్బాయి
శ్రీకాకుళం, మే 6, (globelmedianews.com)
శ్రీకాకుళం ఎంపీగా ఎవరు నెగ్గుతారు అన్నది ఇపుడు అక్కడ పెద్ద చర్చగా ఉంది. సిట్టింగ్ ఎంపీ, టీడీపీ నాయకుడు కింజరపు రామ్మోహననాయుడుకి జనంలో మంచి పేరున్నా ఆయన సొంత చిన్నాన్న, మంత్రి అచ్చెన్నాయుడు గెలుపు అవకాశాలను కోరి చెడగొట్టారని అంటున్నారు. రాజకీయంగా సీనియర్ అయిన బాబాయ్ జిల్లాలో సాగించిన ఏకపక్ష పోకడలు, సామాజికవర్గం పరంగా పెత్తనం చేయడం ఇవన్నీ కూడా ఎంపీ అభ్యర్ధిగా బరిలో ఉన్న రామ్మోహన్ కి మైనస్ అయ్యాయని పోలింగ్ సరళి తెలియచేస్తోంది. ఇక్కడ వైసీపీ అభ్యర్ధిగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ సామాజిక వర్గం కాళింగ కులస్తులు గుత్తమొత్తంగా ఫ్యాన్ కి ఓటేశారంటే మంత్రి పట్ల వారికి ఉన్న వ్యతిరేకత తెలియచేస్తోందని అంటున్నారు. అయిదేళ్ల పాటు మంత్రిగా ఉన్న అచ్చెన్న జిల్లాలో చేసిన అభివృధ్ధిని పక్కన పెడితే కులాల కురుక్షేత్రానికి తెర లేపారని అంటున్నారు. ఆ ఫలితమే ఇపుడు అబ్బాయికి దారుణమైన ఇబ్బందులను తెచ్చిపెడుతోందని విశ్లేషిస్తున్నారు.నిజానికి రామ్మోహననాయుడు పట్ల శ్రీకాకుళం ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది. 


సిక్కోలులో 

ఈ యువ ఎంపీ అయిదేళ్ల కాలంలో డిల్లీ వేదికగా మాట్లాడిన తీరు, శ్రీకాకుళం గొంతు వినిపించిన విధానం మేధావుల దగ్గర నుంచి అంతా బాగా ఇష్టపడ్డారు. అయితే ఎంపీ తన వద్దకు సమస్యల కోసం వచ్చిన వారిని బాబాయ్ వద్దకు పంపించేవారు. అయితే అక్కడ అచ్చెన్నాయుడు మాత్రం ఫక్త్ రాజకీయ నేతగా వ్యవహరించడం, సొంత సామాజిక వర్గానికి పెద్ద పీట వేయడం వంటి పరిణామాలు బలమైన సామాజిక వర్గమైన కాళింగులను రెచ్చగొట్టినట్లైందంటున్నారు. అది ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందని తెలుస్తోంది. 2009 ఎన్నికల్లో కాళింగులు మొత్తం ఓ వైపుకు వచ్చి మరీ కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కిల్లి క్రుపారాణీని గెలిపించుకున్నారు. ఇపుడు అదే తీరులో దువ్వాడ శ్రీనివాస్ వైపు గట్టిగా నిలబడ్డారని అంటున్నారు.ఇపుడున్న పరిస్థితి చూస్తే టీడీపీ, వైసీపీల మధ్య మధ్య ఎంపీ సీటు కోసం భీకరమైన పోటీ జరిగిందని చెబుతున్నారు. సులువుగా గెలిచేస్తాడనుకున్న రామ్మోహననాయుడు గెలుపు కోసం కష్టపడాల్సివచ్చిందని పోలింగ్ అనంతరం పోస్ట్ మార్టం నివేదిక తెలియచేస్తోంది. దువ్వాడ శ్రీనివాస్ చివరి నిముషంలో ప్రచారంలో దిగినప్పటికీ ఆయన వెనక బలమైన సామాజిక వర్గం ఉండడంతో ముందుకు దూసుకువచ్చాడని విశ్లేషిస్తున్నారు. అదే విధంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధులు ఎంపీకి రెండో ఓటుని వేయించే విషయంలో పెద్దగా శ్రద్ధ తీసుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. అలాగే సిట్టింగు ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకత కూడాఈసారి గట్టిగా పనిచేసిందని అంటున్నారు. ఈ నేపధ్యంలో జగన్ గాలి కూడా వైసీపీకి తోడు అయిందని చెబుతున్నారు. అలా వైసీపీకి విజయావకాశాలు పెరిగాయని తెలుస్తోంది. శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహననాయుడు గెలిస్తే క్రాస్ ఓటింగ్ వల్లనే జరగాలని టీడీపీ పరిశోధనలో తేలిందట. మరి చూడాలి అసలు ఫలితం 23న ఎవరిని ఎంపీని చేస్తుందో.

No comments:
Write comments