స్టాలిన్ సీన్ మారనుందా

 

చెన్నై, మే 15, (globelmedianews.com)
డీఎంకే అధినేత స్టాలిన్ దశ ఈ లోక్ సభ ఎన్నికలు మార్చనున్నాయా? ఆయన జాతీయ స్థాయిలో కీలకం కానున్నారా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. తమిళనాడులో ఈసారి డీఎంకేకు అత్యధిక స్థానాలు వస్తాయన్న అంచనా ఉంది. సర్వే సంస్థలు కూడా అవే చెబుతున్నాయి. పుదుచ్చేరి పార్లమెంటు స్థానంతో కలపి ప్రస్తుతం తమిళనాడులో 39 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్, డీఎంకే, ఇతర పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీకి దిగాయి.అయితే డీఎంకే కూటమికి ఈసారి 25 పార్లమెంటు స్థానాలకు పైగానే వచ్చే అవకాశముందనేది సర్వే సంస్థల అంచనా. కరుణానిధి, జయలలిత మృతి తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో డీఎంకే ను ఎక్కువగా ప్రజలు విశ్వసించారంటున్నారు. అన్నాడీఎంకేలో నాయకత్వం కొరవడటం, బీజేపీతో జతకట్టడం వంటి వాటితో అది సింగిల్ నెంబర్ కే పరిమితమవుతుందంటున్నారు. 


స్టాలిన్  సీన్ మారనుందా

కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్, టీటీవీ దినకరన్ పార్టీలు ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేవని చెబుతున్నారు.స్టాలిన్ పై భారతీయ జనతా పార్టీ కూడా కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి. తమకు అవసరమైన మెజారిటీ దక్కకపోతే తమిళనాడులో స్టాలిన్ ను కలుపుకుని పోవాలని కమలం పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల ఫలితాల అనంతరం చర్చలు జరిపే అవకాశముంది. స్టాలిన్ తమతో కలసి వస్తే మిత్రపక్షమైన అన్నాడీఎంకేను దూరం పెట్టేందుకు కూడా బీజేపీ వెనుకాడదు. అయితే బీజేపీతో జత కట్టడం వల్ల స్టాలిన్ కు కూడా ప్రయోజనాలు లేకపోలేదు.స్టాలిన్ కాంగ్రెస్ కూటమిలో బలమైన నేతగా ఉన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని తొలుత ప్రకటించింది స్టాలిన్ మాత్రమే. కాంగ్రెస్ కు అనుకున్న స్థానాలు దక్కకపోయినా, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజారిటీ రాకున్నా స్టాలిన్ కాంగ్రెస్ విషయంలో పునరాలోచించుకునే అవకాశముందంటున్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావాలంటే తన మద్దతు అవసరమైతే, కేంద్రంలో మంత్రి పదవులతో పాటుగా రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వ ఏర్పాటుకు కూడా బీజేపీ అంగీకరించాల్సి ఉంటుంది. పళనిస్వామి, పన్నీర్ సెల్వం సర్కార్ కు 22 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల తర్వాత అవసరమైన మెజారిటీ ఉండదని భావిస్తున్న స్టాలిన్ అవసరమైతే కమలం పార్టీతో జత కట్టేందుకు వెనుకాడరన్న చర్చ ఆ పార్టీలోనే జరుగుతుండటం విశేషం. 

No comments:
Write comments