ఫొని తుఫాను మృతుల కుటుంబాలకు రూ. రెండు లక్షల నష్టపరిహారం

 

సహాయ పునరావాస కార్యక్రమాల నిమిత్తం మరో రూ.వెయ్యి కోట్లు
ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ ప్రకటన 
భువనేశ్వర్‌ మే 6 (globelmedianews.com
ఫొని తుఫాను సృష్టించిన బీభత్సంతో అతలాకుతలమైన ఒడిశా రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం పర్యటించారు. ఈ మేరకు ఉదయం భువనేశ్వర్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయనకు ఒడిశా గవర్నర్ గణేశీ లాల్‌‌, ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ స్వాగతం పలికారు. అనంతరం ఆయన గవర్నర్‌, సీఎం, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌తో కలిసి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు రూ. రెండు లక్షల నష్టపరిహారం ప్రకటించారు. అలాగే గాయపడ్డ వారికి రూ.50వేలు అందజేస్తామన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే రాష్ట్రానికి రూ.381 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించామని, సహాయ పునరావాస కార్యక్రమాల నిమిత్తం మరో రూ.వెయ్యి కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. 


ఫొని తుఫాను మృతుల కుటుంబాలకు రూ. రెండు లక్షల నష్టపరిహారం

పెను విపత్తు సందర్భంగా ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికలకు ఒడిశా ప్రజలు స్పందించిన తీరును ఆయన అభినందించారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కలిసి పనిచేశాయన్నారు. తుపాను నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం నవీన్‌ పట్నాయక్‌ చేపట్టిన కార్యక్రమాలను మోదీ ప్రశంసించారు. సహాయ కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమానికి అండగా ఉంటామని తెలిపారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం తరఫున నిపుణుల బృందం రాష్ట్రంలో పర్యటించి జరిగిన నష్టాన్ని అంచనా వేస్తుందని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి సమగ్ర కార్యాచరణను రూపొందిస్తామన్నారు. మరోవైపు ఈ తుపాను ధాటికి మృతి చెందిన వారి సంఖ్య 34కి చేరింది. ఫొని తుపాను ధాటికి ఒడిశాలోని పూరీ, ఖుర్దా, నయాగఢ్‌, కేంద్రపడ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమైన విషయం తెలిసిందే. కటక్‌, గంజాం, జగత్సింగ్‌పూర్‌, బాలేశ్వర్‌, భద్రక్‌ జిల్లాల్లో పాక్షిక ప్రభావం కనిపించింది. ఈ తుపాను ధాటికి పూరీ జిల్లాలో విద్యుత్తు, రవాణా వ్యవస్థలు పూర్తిగా స్తంభించించిపోయాయి. అలాగే తీర ప్రాంత జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకొన్నాయి. ఒడిశాలోని పలు జిల్లాల్లో ఆరు లక్షల హెక్టార్లల్లో వరి, కూరగాయల పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.

No comments:
Write comments