అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి మహోత్సవాలు

 

యాదాద్రి భువనగిరి మే 15 (globelmedianews.com)   
భక్తుల కోరిన కోర్కెలు తీరుస్తూ కోరినవారికి కొంగుబంగారంగా విరాజిల్లుతున్న శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి మహోత్సవాలు బుధవారం  యాదాద్రిలో అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి. ఈ మహోత్సవాలను మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. స్వస్తీవాచనము...పుణ్యాహావాచనము ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఉదయం 9.00 గంటలకు యాగశాల ప్రవేశం, స్వస్తీవాచనము, పుణ్యాహావాచనము, విశ్వక్సేనారధన, రుత్విక్వరణము, రక్షాబంధనమలు, అంకుర్పాణము, మూర్తి కుంభ స్థాపన, దివ్య ప్రబంధ, చతుర్వేద, మూలమంత్ర, మూర్తి మంత్ర, జప పారాయణములు, అగ్ని ప్రతిష్ట యజ్ఞం జరిగాయి. ఉదయం 10.30 గంటలకు యాగమండపములో లక్ష పుష్పార్చన నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహస్వామివారు వైశాఖ శుద్ధ చతుర్ధశి సంధ్యాసమయాన ఆవిర్భవించారు. 


అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి మహోత్సవాలు

అలాంటి మహిమాన్విత ఘడియలను గుర్తు చేసుకుంటూ పండుగ సంబురాలను జయంతి ఉత్సవాలుగా సకల భక్తజనుల కోలాహలంలో నిర్వహిస్తారు. శ్రీలక్ష్మీనరసింహుడు యాదగిరి శిఖరాగ్రమందలి విశాలమైన గుహలో రుష్యశృంగుడి కుమారుడైన యాదమహర్షి తపస్సు చేయగా హర్షించి పంచరూపాల్లో స్వయంభువుగా వెలిశారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రభావం ఎంతో మహిమాన్వితం. యాదాద్రిలో కొలువైన శ్రీహరి భక్తులు కోరిన కోర్కెలు, వరములను ప్రసాదిస్తున్నారు.భక్తి శ్రద్ధలతో దీక్షగా ప్రదక్షిణాదులు చేయు భక్తులకు సాక్షాత్కరిస్తున్నారని భక్తుల నమ్మకం. నిత్యనూతన వైభవంతో పరమపవిత్రమైన ఉత్సవ విశేషములచే విశ్వవిఖ్యాతిని పొందింది. అలాంటి మహిమాన్విత క్షేత్రంలో వైశాఖ శుద్ధ ఏకాదశి ఈరోజు నుంచి 17వ తేదీ వరకు జరిగే ఉత్సవాలకు అశేష భక్తజనం తరలివస్తున్నారు. మన రాష్ట్రంలో మన పాలన...మన యాదాద్రీశుడు అనే భావన విస్త్రృతమైన నేపథ్యంలో జరుగుతున్న ఉత్సవాలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. యాదాద్రి అభివృద్ధ్దికి సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ్ద చూపిస్తున్న తరుణంలో అందరి దృష్టి యాదాద్రిలో జరిగే శ్రీవారి జన్మనక్షత్రం సందర్భంగా జరిగే ఉత్సవాలపై కేంద్రీకృతమైనది. దాంతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మన ఆలయాల్లో మన సాంప్రదాయాలు... మన వైభవం అంటూ భక్తిపారవశ్యంతో ఉప్పొంగిన యాదాద్రి పరవశాన్ని బ్రహ్మోత్సవాలు నలుదిశలా చాటి చెప్పాయి. యాదాద్రి కేంద్రంగా ఆధ్యాత్మిక విప్లవం అంటూ.. సాక్షాత్తు చినజీయర్‌స్వామివారు కొనియాడటం విశేషం. ఇంతటి ప్రాధాన్యత కలిగిన సమయంలో 
శ్రీలక్ష్మీనరసింహుని జయంతి ఉత్సవాలు జరుగనుండటంతో ఏర్పాట్లు ఆ స్థాయిలో చేసేందుకు అధికారులు నిమగ్నమయ్యారు. 

No comments:
Write comments