మరో 10 రోజుల్లో పనులు పూర్తి చేయాలి

 


హైద్రాబాద్, జూన్ 4 (globelmedianews.com)
తెలంగాణ ప్రభుత్వం, ఆ ప్రభుత్వ సారధి కేసీఆర్‌ స్వయం పర్యవేక్షణలో నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక సాగునీటి ప్రాజెక్టు కాళేశ్వరంలో భాగంగా నిర్మాణంలో ఉన్న రాంపూర్‌ పంప్‌హౌస్‌ నిర్మాణాలను సీఎం కేసీఆర్ పరిశీలించారు. జగిత్యాల జిల్లా రాంపూర్‌ను చేరుకున్న ఆయన నవయుగ చైర్మన్‌ సి.విశ్వేశ్వరరావుతో పనుల పురోగతిపై చర్చించారు. లక్ష్యం మేరకు పనులు జరుగుతున్నాయా? లేదా? అన్న దానిపై ఆరాతీశారు. మల్యాల మండలం రాంపూర్ పంప్‌హౌస్ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. మోటర్ల బిగింపు పనుల పురోగతిపై అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. జులై 15వ తేదీ లోగా పనులు పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. రెండు రోజులకు ఒకసారి సమీక్ష చేయాలని మంత్రి ప్రశాంత్‌రెడ్డికి ఆదేశించారు. ప్రారంభోత్సవానికి వస్తానని సీఎం ప్రకటించారు. 


మరో 10 రోజుల్లో పనులు పూర్తి చేయాలి
కాళేశ్వరం ప్రాజెక్టు నీటి ద్వారా ఈ ఏడాది శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నింపుతం. జులై నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మిడ్‌మానేరుకు, ఎస్సారెస్పీకి నీటి పంపింగ్ జరగాలి. దీనికి అవసరమైన విద్యుత్ సరఫరా ఏర్పాట్లు చూసుకోవాలి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రెండో పంటకు ఈ ఏడాది నుంచే నీరు అందించడమే లక్ష్యంగా పనిచేయాలి. ఎక్కువ మంది సిబ్బందిని నియమించి రేయింబవళ్లు పనిచేసి పనులు పూర్తి చేయాలి. కాళేశ్వరం నీళ్ల కోసం తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా రైతులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. దశాబ్దాల సాగునీటి కష్టాలకు తెరపడుతుందని నమ్మకంతో ఉన్నారు. రైతులకు సాగునీరు అందించడమే ప్రథమ కర్తవ్యంగా ప్రభుత్వం ప్రాజెక్టులు చేపడుతోంది. కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు పాలమూరు - రంగారెడ్డి, కాళేశ్వరం, సీతారామా ప్రాజెక్టులను నిర్మిస్తున్నది. వీటిలో కాళేశ్వరం ప్రాజెక్టు చాలా ముఖ్యమైంది. దాదాపు 80 నియోజకవర్గాలకు సాగు, తాగునీరు, పరిశ్రమలకు నీరందించే బృహత్తర ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని తెలిపారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజీ పనుల పరిశీలనకు వెళ్లారు. అధికారులతో సమీక్ష అనంతరం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు తిరిగి హైదరాబాదుకి బయలుదేరి వెళతారు. ఇరవై రోజుల క్రితమే మేడిగడ్డతోపాటు కన్నేపల్లి పంప్‌హౌస్‌, తెలంగాణ విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్‌ ఇంత తక్కువ వ్యవధిలో మళ్లీ పనుల పరిశీలన చేయడం గమనార్హం.

No comments:
Write comments