22 అక్రమ నిర్మాణాల సంగతేంటీ

 


గుంటూరు, జూన్ 27, (globelmedianews.com)
రాజధాని ప్రాంతంలోని ఉండవల్లి, పెనుమాక, వెంకటపాలెం గ్రామాల పరిధిలో ఉన్న 22 ఆక్రమణలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందా అన్న చర్చ సర్వత్రా సాగుతోంది. 26వ తేదీన ప్రజావేదిక కూల్చివేయాలని సిఎం ఆదేశించారు. కూల్చివేసే నిర్మాణాల పరిధిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాత్కాలిక నివాసం కూడా ఉండటంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. కృష్ణానది కరకట్ట దిగువ భాగంలో ఒడ్డుకు ఆనుకుని 22 నిర్మాణాలు ఉన్నట్లు సిఆర్‌డిఎ అధికారులు 2015 ఫిబ్రవరిలో గుర్తించారు. 2014 డిసెంబర్‌ 31వ తేదీన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కృష్ణానదిలో పర్యటించి నది ఒడ్డున ఉన్న నిర్మాణాలన్నీ అక్రమమేనని, నదీ పరివాహక పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘించి వాటిని నిర్మించారని తెలిపారు. 


22 అక్రమ నిర్మాణాల సంగతేంటీ
నిర్మాణాలు పొలాల్లో ఉన్నాయని, వాటికి అనుమతులు లేవని, పూలింగుకు తీసుకోవాలా? వద్దా తేల్చిచెప్పాలని అప్పటి సిఆర్‌డిఏ అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. వెంటనే వాటి స్థితిని తేల్చాలని గుంటూరు కలెక్టర్‌కు లేఖ రాశారు. అప్పట్లో గుంటూరు కలెక్టర్‌గా కాంతిలాల్‌ దండే ఉన్నారు. అయితే వ్యవసాయ భూముల్లో వ్యవసాయేతర కట్టడాలు చేపట్టారని, వాటికి ఉన్న అనుమతులు తదితర వివరాలను తమకు తెలపాలని కోరుతూ 2015 ఫిబ్రవరి 2వ తేదీతో తయారు చేసిన నోటీసులను పిబ్రవరి 6వ తేదీన జారీ చేశారు. యజమానులు తీసుకునేం దుకు ఇష్టపడక పోవడంతో వాటిని గోడలకు అంటించి వెళ్లిపోయారు. భూసమీకరణ ప్రాజెక్టు నోటిఫికేషన్‌(11.1.2015) ప్రకారం, 2015 ఫిబ్రవరి 5వ తేదీన గుంటూరు కలెక్టర్‌ వారి మౌఖిక ఆదేశాల ప్రకారం తాడేపల్లి తహశీల్దార్‌ నోటీసులు ఇచ్చారు. అనంతరం వాటిపై విచారణ అధికారిగా సిఆర్‌డిఏ కమిషనర్‌నునియమించారు. నోటీసులు ఇచ్చిన అనంతరం రాజకీయంగా ఒత్తిడులు రావడంతో అధికారులు వాటి జోలికి వెళ్లలేదు. కృష్ణానది పరివాహక ప్రాంతానికి ఇబ్బంది కలిగించే విధంగా తాడేపల్లి, తుళ్లూరు మండలాల పరిధిలో 12,560 చదరపు గజాల్లో నిర్మాణాలున్నాయని అధికారులు తేల్చారు. మంతెన సత్యనారాయణరాజు ట్రస్ట్‌, గోకరాజు గంగరాజు గెస్ట్‌హౌస్‌ నదిని పూడ్చి నిర్మించారని అప్పటి ఉడా అధికారులు నివేదిక ఇచ్చారు.

No comments:
Write comments