కవిత కోసం త్యాగయ్యలు

 


హైద్రాబాద్, జూన్ 1, (globelmedianews.com)
కవితను ఎమ్మెల్యేగా పోటీ చేయించాలన్న వాదన తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే కదా. ఎంపీగా ఓడిపోవడంతో టీఆర్ఎస్ శ్రేణులు కవితక్క ఓడిపోవడం ఏంటి అని దానిని అవమానంగా ఫీలయ్యాయి. దీంతో రాబోయే ఉప ఎన్నికలో ఆమెను గెలిపించుకుందాం, మంత్రిని చేద్దాం అన్నట్లు వ్యవహరిస్తున్నాయి టీఆర్ఎస్ శ్రేణులు. ఇంతలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ అత్యుత్సాంతో కవిత పోటీ చేస్తానంటే పదవీ త్యాగానికి సిద్ధమని ప్రకటించారు. అంతేకాదు, తాను రాజీనామా చేసి కవితను జగిత్యాల నుంచి పోటీచేయాలని కోరతానన్నారు. ఈ విషయాన్ని పలువురు గులాబీ అధినేత దగ్గరకు తీసుకువెళ్లారట. అయితే, దీనిపై కేసీఆర్ వెనకడుగు వేశారని తెలుస్తోంది.ఇప్పటికే కరీంనగర్ పార్లమెంట్‌ను సైతం కోల్పోయిన తమకు జగిత్యాలలో గెలిచే అవకాశాలు ఉండవనేది కేసీఆర్ అభిప్రాయంగా తెలుస్తోంది. 


కవిత కోసం త్యాగయ్యలు
ముందస్తు ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఓడిపోవడంతో, ఉప ఎన్నిక వస్తే ఆ పార్టీ ఇప్పుడు సానుభూతిని అడ్డుపెట్టుకునే అవకాశాలు కూడా ఉంటాయని కేసీఆర్ భావిస్తున్నారట. అందుకే రిస్క్ తీసుకోకూడదని అనుకుంటున్నారని టాక్. తెలంగాణలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ భారీ షాక్ తగిలిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో రాష్టంలోని 16 సీట్లను దక్కించుకోవాలనుకున్న ఆ పార్టీకి ఓటర్లు షాకిచ్చారు. దీంతో ఆ పార్టీ కేవలం తొమ్మిది స్థానాల్లోనే గెలుపొందింది. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఊహించని విధంగా నాలుగు స్థానాలకు దక్కించుకోగా, కాంగ్రెస్ పార్టీ మూడు చోట్ల విజయం సాధించింది. ఈ ఫలితాలు తెలంగాణ రాష్ట్ర సమితికి భారీ షాక్ ఇచ్చాయి. అన్నింటి కంటే ముఖ్యంగా ఈ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత ఓటమి పాలవడం టీఆర్ఎస్‌లో ఆందోళన రేకెత్తించింది. సిట్టింగ్ స్థానమైన నిజామాబాద్ నుంచి పోటీ చేసిన ఆమె.. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. మొదటి రౌండ్ నుంచీ ఆయనే ఆధిక్యం ప్రదర్శిస్తూ వచ్చి విజయం సాధించారు.కవిత ఓటమికి ఎన్నో కారణాలు ఉన్నాయి. టీఆర్ఎస్ అధినేత వలసలను ప్రోత్సహించడంతో పాటు, 180 మంది రైతులు పోటీలో నిలవడం, పార్టీలో వర్గ విభేదాల వల్ల ఆమె ఓటమి ఖాయమైంది. లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం కారణంగానే కవిత ఓటమి పాలయ్యారనే వాదన టీఆర్ఎస్‌లో వినిపిస్తోంది. కవిత గెలుపు కోసం ఎమ్మెల్యేలు అంతగా కష్టపడలేదని... అంతా ఆమే చూసుకుంటారనే విధంగా పలువురు ఎమ్మెల్యేలు వ్యవహరించారని అనుకుంటున్నారు. అదే సమయంలో రైతుల అసంతృప్తిని క్యాష్ చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నించడంతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీకి సహకరించారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె ఏదో ఒక పదవిలో ఉంటే బాగుంటుందని టీఆర్ఎస్ నేతల కోరిక.

No comments:
Write comments