నగర ప్రజలు వేసే ప్రతి అడుగులోనూ నేను ఉంటాను..

 


ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భరోసా
రాజమండ్రి జూన్28 (globelmedianews.com
నగర ప్రజలు మాపై నమ్మకం ఉంచి అఖండ విజయంతో గెలిపించిందునకు నా కృతజ్ఞతలు... మీ నమ్మకాన్ని నేను వమ్ము చేయను... నగర ప్రజలు వేసే ప్రతి అడుగులోనూ నేను ఉంటాను... ఏ కష్టం వచ్చినా నేను ముందుండి ఆ కష్టాన్ని కడ తేరుస్తాను... ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరిస్తానని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్‌ భరోసా ఇచ్చారు. స్థానిక బైపాస్‌ రోడ్డులోని దేవాంగ కమ్యూనిటీ హాలులో శుక్రవారం 32, 33, 35, 5 డివిజన్లకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్‌ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. తనను ఎమ్మెల్యేగా అఖండ మెజార్టీతో గెలిపించిన మాదిరిగానే మన ముందున్న కార్పొరేషన్‌ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులను అఖండ మెజార్టీతో గెలిపించి నగరపాలక సంస్థలో మళ్లీ తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించాలని పిలుపునిచ్చారు. ఓటమి, ఇబ్బందులు పార్టీకి కొత్త ఏమీ కాదని, అనేకసార్లు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినా ప్రజల పక్షాన పోరాటం చేసిందన్నారు. 


నగర ప్రజలు వేసే ప్రతి అడుగులోనూ నేను ఉంటాను..
పాలక ప్రభుత్వం చేపట్టే ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కార్యకర్తలందరికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేసే దాడులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని సత్వరం పరిష్కంచాలనే ఉద్దేశంతో తాము రూపొందించిన యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి, స్థానిక సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేశామన్నారు. వారి ఆర్ధికాభివృద్ధి కోసం రుణాలు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాజమహేంద్రవరంలో వందలాది మందికి కుట్టు శిక్షణ తరగతులు నిర్వహించి, శిక్షణ పొందిన ప్రతి మహిళకు ఉచితంగా కుట్టు మిషన్లు అందచేశామన్నారు. బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేయించడం, అలాగే వందలాది మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు మంజూరు చేయించామని గుర్తు చేశారు. అయితే తమ కుటుంబంపై గతంలో చాలా మంది కుట్రలు చేశారని, ప్రస్తుతం కూడా చేస్తున్నారని వారందరికీ తగిన సమయంలో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా నాయకత్వం అంతా ముందుండి ఆదుకుంటుందన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి యర్రా వేణుగోపాలరాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన సాగుతోందని ఎద్దేవా చేశారు. కేవలం మన అధినాయకుడు నారా చంద్రబాబునాయుడిని అవమానించేందుకే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు అనిపిస్తోందన్నారు. ఒక సీనియర్‌ నాయకుడికి ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న కార్పొరేషన్‌ ఎన్నికలను సమర్ధవంతంగా ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) మాట్లాడుతూ మన ముందున్న అతి పెద్ద సవాల్‌ త్వరలో జరగనున్న కార్పొరేషన్‌ ఎన్నికల్లో విజయం సాధించడమేనన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకించాలని, ఆ ప్రభుత్వం అమలు చేసే పథకాల్లో తప్పొప్పులను ప్రజలకు వివరించాలన్నారు. ప్రజా వేదికను కూల్చి వేయడం సరికాదన్నారు. రేషన్‌ డీలర్లు రోడ్డున పడేలా జగన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదన్నారు. రేషన్‌ సరుకులను వాలంటీర్ల ద్వారా అందచేసే ఇక రేషన్‌ డీలర్ల బతుకులు ప్రశ్నార్ధంగా ఉంటాయన్నారు. పెన్షన్లు అమలు చేయడం కూడా జగన్‌ మోసం చేశారని మండిపడ్డారు. జగన్‌ మంతి వర్గంలో అందరూ దొంగలేనని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా నగరంలోని ప్రతి ఇంటికి వెళ్లి స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను అడిగి తెలుసుకుని పరిష్కరించామని, అందుకే ప్రజలు మా కుటుంబానికి అండగా నిలిచి అఖండ విజయం చేకూర్చారని అన్నారు. నగర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశం అనంతరం నాయకులు పలు తీర్మానాలు చేశారు. గ్రామ వాలంటీర్లుగా నియమించే విషయంలో జగన్‌ ప్రభుత్వం విధి విధానాలు స్పష్టంగా చెప్పలేదని, ఒక వేళ వాలంటీర్లను నియమిస్తే వారు ఏ పని చేయాలని, ఎలా పని చేయాలన్న విషయాలను సక్రమంగా వివరించలేదని, కేవలం వైఎస్సార్‌ సీపీ చొక్కాలు ధరించిన వారికి లబ్ధి కూర్చేందుకే దీనిని అమలు చేస్తున్నారని, వాలంటీర్ల విషయంలో స్పష్టత ఇవ్వాలని తీర్మానించారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి రెడ్డి మణేశ్వరావు, కార్పొరేటర్లు ద్వారా పార్వతీ సుందరి, గాదిరెడ్డి పెద్దబాబు, కరగాని మాధవి, తలారి ఉమాదేవి, పాలిక శ్రీను, నాయకులు కురగంటి సతీష్‌, కడితి జోగారావు, మేడిశెట్టి కృష్ణారావు, కరగాని వేణు, డివిజన్‌ కమిటీ నాయకులు, కార్యకర్తలు, సభ్యులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments