ఆర్థికపర కారణాలతో పార్టీ ని వీడుతున్న రాజగోపాల్‌రెడ్డి

 


టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
న్యూఢిల్లీ జూన్ 20  (globelmedianews.com)
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీ మార్పు వ్యవహారంపై టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. రాజకీయ కారణాలతో వెళ్లే వారికి అయితే ఏదైనా చెప్పొచ్చునని, ఆర్థికపరమైన కారణాలతో వెళ్లేవారికి ఏం చెప్పగలమని ఆయన అన్నారు. రాజగోపాల్‌రెడ్డి ఏ కారణాలతో వెళ్తున్నారో తనకు చెప్పారని అన్నారు. వెళ్లాలని నిర్ణయించుకున్నారు కాబట్టి ఇప్పుడేదైనా చెబుతూ ఉండొచ్చునని, రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై ఏఐసీసీ పెద్దలతో చర్చిస్తానని ఉత్తమ్ పేర్కొన్నారు.కాగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి పీసీసీ క్రమశిక్షణాసంఘం షోకాజు నోటీసు జారీ చేసింది. 


ఆర్థికపర కారణాలతో పార్టీ ని వీడుతున్న రాజగోపాల్‌రెడ్డి
పార్టీ వ్యతిరేక చర్యలతోపాటు దుడుకుగా వ్యవహరించడం లాంటి చర్యలకు పాల్పడినందుకు జారీ చేసిన షోకాజు నోటీసుకు పది రోజుల్లో వివరణ ఇవ్వాలని లేదంటే క్రమశిక్షణా చర్యలు తీసుకోనున్నట్లు అందులో స్పష్టం చేశారు. ఈ మేరకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎం.కోదండరెడ్డి నేతృత్వంలోని పీసీసీ క్రమశిక్షణాసంఘం బుధవారం నోటీసులు జారీ చేసింది. ఏఐసీసీ అధ్యక్షుడితోపాటు ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి ఆర్‌.సి.కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలపై ఈ నెల 15వ తేదీన నల్గొండలో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసులో ఆదేశించారు. అదే సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీకి భవిష్యత్తు లేదని తెరాసకు వ్యతిరేకంగా పోరాడే ప్రత్యామ్నాయం ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని భాజపా మాత్రమే అని వ్యాఖ్యానించిన విషయాన్ని నోటీసులో పేర్కొన్నారు. 2018, సెప్టెంబర్‌ 18న కుంతియా, ఉత్తమ్‌లపై అసభ్యకరమైన పదాలతో దూషించిన నేపథ్యంలో జారీ చేసిన షోకాజు నోటీసు అంశాన్నీ తాజా నోటీసులో గుర్తు చేశారు. రాజగోపాల్‌రెడ్డికి జారీ చేసే షోకాజు నోటీసు అంశంపై పీసీసీ క్రమశిక్షణ సంఘం ఏఐసీసీకి నివేదించగా అక్కడినుంచి అనుమతి లభించిన నేపథ్యంలో బుధవారం షోకాజు నోటీసు జారీ చేశారు.

No comments:
Write comments