అబ్బూరి ఛాయదేవి కన్నుమూత

 


హైద్రాబాద్, జూన్ 28, (globelmedianews.com)
ప్రముఖ రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత అబ్బూరి ఛాయాదేవి (85) శుక్రవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 1933 అక్టోబర్ 13న రాజమహేంద్రవరంలో జన్మించిన అబ్బూరి ఛాయాదేవి తెలుగు సాహిత్యంపై రచయిత్రిగా తనదైన ముద్రవేశారు. ముఖ్యంగా మహిళల జీవితాల్లోని దృక్కోణాలను తన కథల్లో ఛాయాదేవి ఆవిష్కరించారు. 'తన మార్గం' కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. బోన్‌సాయ్ బ్రతుకు, ప్రయాణం సుఖాంతం, ఆఖరికి ఐదు నక్షత్రాలు, ఉడ్‌రోజ్ కథలు అబ్బూరి ప్రసిద్ధ రచనలు. అభిమానుల సందర్శనార్థం కొండాపూర్‌ సీఆర్‌ ఫౌండేషన్‌లో ఛాయాదేవి భౌతికకాయాన్ని ఉంచారు. 

అబ్బూరి ఛాయదేవి కన్నుమూత

సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఛాయాదేవి ఇరవైఏళ్ల వయసులోనే నిజాం కళాశాలలో ఎం.ఏ పూర్తిచేశారు. 1953లో నిజాం కాలేజీ మ్యాగ్‌జైన్‌లో ఛాయాదేవి రాసిన అనుభూతి కథ తొలిసారి ప్రచురితమైంది. అప్పటి నుంచి ఛాయాదేవి చాలా వరకు మధ్య తరగతి కుటుంబాలలోని మహిళలు ఎదుర్కొనే సమస్యల గురించి, పురుషాధిక్యతకు లోబడిన స్త్రీల పరిస్థితుల గురించి చాలా కథలు రాశారు. ఆమె రాసిన కొన్ని కథలు హిందీ, తమిళ, మరాఠి, కన్నడ భాషలలోకి అనువదించారు. ఆడపిల్లల పెంపకంలోనూ చూపిస్తూ వారి బతుకుల్ని బోన్ సాయ్ చెట్టులా ఎదగనివ్వడం లేదని చెప్పే కథ ‘బోన్‌సాయ్ బ్రతుకు’. ఈ కథని 2000 సంవత్సరంలో ఆంధ్రపదేశ్ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు వాచకంలో చేర్చింది. ‘సుఖాంతం’ అనే కథ నేషనల్ బుక్ ట్రస్ట్‌కు చెందిన కథాభారతిలో 1972లో ప్రచురించబడింది. న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో డిప్యూటీ లైబ్రేరియన్‌గా పనిచేసిన ఛాయాదేవి 1982లో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. ఛాయాదేవి రచనలకు 1993లో వాసిరెడ్డి రంగనాయకమ్మ సాహిత్య పురస్కారం, 1996లో మృత్యుంజయ పుస్తకానికి తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ రచయిత్రి అవార్డు అందుకున్నారు. 2000 ఏడాదిలో కళాసాగర్ పందిరి సాహితీ పురస్కారాలు అందుకున్నారు. ఇక, 2005లో ‘తనమార్గం’ కథాసంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్నారు. 

No comments:
Write comments