గంటా బ్యాచ్ కు జంపింగ్ జంపాంగ్

 


విశాఖపట్టణం, జూన్ 14 (glibelmedianews.com)
రాజకీయాల్లో ఆనవాయితీ పాటించడం అసలు కుదరదు. కానీ విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రూటే సెపరేట్. ఆయన పద్ధతులకు చాలా విలువ ఇస్తారు. ప్రతీ ఎన్నికకూ ఓ పార్టీ ఉండాలి, ఓ కొత్త నియోజకవర్గం ఉండాలి. ఇదీ గంటా స్టాంగ్ సెంటిమెంట్. ఈసారికి సీటు మారినా పార్టీ మారకపోవడం వల్ల రాజయోగం దక్కలేదు. దాంతో తెగ బాధపడిపోతున్న గంటా ఇపుడైనా పోయిందేముంది పార్టీ మారిపోతే సరి అనుకుంటున్నారుట. వైసీపీలోకి వెళ్దామంటే అక్కడ జగన్ నో ఎంట్రీ బోర్డ్ చూపించేశారు. దాంతో ఆయన చూపు ఇపుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మీద పడిందని టాక్. అన్నీ అనుకూలిస్తే ఆయన తన బ్యాచ్ తో సహా కమలం గూటికి చేరుకుంటారని అంటున్నారు.తాజా ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. విశాఖ అర్బన్ జిల్లాలో చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా నాలుగంటే నాలుగు సీట్లను గెలుచుకుంది. దాంతో ఇప్పట్లో పార్టీని లేపడం కష్టమన్న భావనకు తలపండిన సీనియర్లు వచ్చేశారు. ఇక గంటా విషయానికి వస్తే అధికార వియోగాన్ని అసలు తట్టుకోలేకపోతున్నారు. దాంతో ఆయన పార్టీకి టచ్ మీ నాట్ అంటున్నారు. ఈ మధ్య జరిగిన పార్టీ సమీక్షా సమావెశానికి గంటా గైర్హాజరు కావడం పెద్ద చర్చగా ఉంది. 


గంటా బ్యాచ్ కు జంపింగ్ జంపాంగ్
ఆయన రాజకీయ ప్రత్యర్ధి, సీనియర్ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు రావడం వల్లనే గంటా రాలేదని మొదట్లో ప్రచారం జరిగినా ఇపుడు అది కాదని తేలిపోయింది. గంటా టీడీపీలో ఉండలేకపోతున్నారని, అందుకే పార్టీ కార్యక్రమాలకు అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారని అంటున్నారు. అయిదేళ్ళ పాటు ప్రతిపక్షంలో ఉండడం భారంగా భావిస్తున్న గంటా బీజేపీకి టచ్ లో ఉంటున్నట్లుగా తెలుస్తోంది.గంటాకు ఓ అలవాటు ఉంది. ఏ పార్టీలోకి జంప్ చేసినా ఒక్కరుగా వెళ్ళరు. ఆయన వెనకాల మరికొందరిని కూడా తీసుకువెళ్తారు. ప్రజారాజ్యం నుంచి, కాంగ్రెస్, అటునుంచి టీడీపీలోకి మారినపుడు కనీసంగా అరడజన్ మంది ఎమ్మెల్యేలను గంటా వెంట తీసుకెళ్ళారు. ఇపుడు గంటా వెంట ఎంత మంది నడుస్తారు అన్నది కూడా చర్చగా ఉంది. విశాఖలో చూసుకుంటే గెలిచిన నలుగురులో ముగ్గురు గంటాకు సన్నిహితులే, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబు ఒక్కరే అయ్యన్నపాత్రుడు వర్గం ఎమ్మెల్యే. ఆ విధంగా ఈ ముగ్గురితో పాటు, మిగిలిన జిల్లాల్లోనూ గంటాకు ఎమ్మెల్యేలతో పరిచయాలు ఉన్నాయి. మరి ఎంతమందిని ఆయన తీసుకెళ్తారన్నది టీడీపీ పెద్దల‌నూ కలవరపెడుతోంది. గంటా మౌనంగా ఉండడం, ఎవరికీ అందుబాటులోకి రాకపోవడంతో ఆయన రాజకీయ వ్యూహం పసుపు పార్టీని తెగ కలవరపెడుతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు కొంతమంది వైసీపీ వైపు చూస్తున్నారని ప్రచారం జరిగింది. ఆరు నుంచి ఏడుగురు వైసీపీలోకి వెళ్తారని కూడా వారి పేర్లతో సహా సోషల్ మీడియా కోడై కూసింది. అప్పట్లో ఈ ప్రచారం జరిగినప్పటికీ, ఆ తర్వాత నిలిచిపోయింది. ఎవరైన తమ పార్టీలో చేరాలంటే వారు రాజీనామా చేయాల్సిందేనని, తిరిగి ఎన్నికైన తర్వాతనే పార్టీలోకి తీసుకుంటానని జగన్ స్పష్టం చేయడంతో వీరు ఆగిపోయారని కూడా అప్పట్లో చెప్పుకున్నారు. ఆ ప్రచారానికి  తగ్గట్టుగానే అసెంబ్లీలో జగన్ తాను ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించనని… వైసీపీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నానని స్పష్టం చేశారు. ఎవరైనా తమ పార్టీలోకి  రావాలన్నా, తాము తీసుకోవాలన్నా వారు ఆ పార్టీకి, పదవులకు రాజీనామా చేసి రావాల్సిందేనని జగన్ స్పష్టం చేశారు. ఆ తర్వాత లాబీల్లో దీనిపై చర్చ జరిగింది. ఉత్తరాంధ్రకు చెందిన తెలుగుదేశం  పార్టీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి వస్తామని చెప్పారని వైసీపీ ఎమ్మెల్యేలు కొంతమంది అసెంబ్లీ లాబీల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ ప్రచారం తెలుగుదేశం ఎమ్మెల్యేల వరకు వెళ్లింది. వారు మమ్మల్ని  బద్నామ్ చేసేందుకు ఇటువంటి ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఆరోపించారు. 151 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీకుంటే, తాము వెళ్లి అక్కడ ఏం చేస్తామని కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. ఇలా అసెంబ్లీ లాబీల్లో తెలుగుదేశం, వైసీపీ వర్గాలు ఒకరిపై ఒకరు మీడియా వద్ద విస్తృతంగా ప్రచారం కూడా చేశారు.ఏది ఏమైనా గంటా కనుక ఫిరాయిస్తే ఆ దెబ్బ అలా ఇలా ఉండడని, మొత్తం 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలలో కనీసం మూడవ వంతు ఎమ్మెల్యేలను ఆయన తనతో పాటుగానే తీసుకెళ్ళిపోతారని కూడా అంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందో.

No comments:
Write comments