పాడిని పట్టించుకోరా..? (పశ్చిమగోదావరి)

 

ఏలూరు, జూన్ 4 (globelmedianews.com): 
జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధి, మహిళా స్వయం సంవృద్ధి వంటి గొప్ప ఆశయాలతో ప్రారంభించిన బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు మూతపడి దర్శన మిస్తున్నాయి. ఒక్కో కేంద్రానికి రూ.93 లక్షలకుపైగా వ్యయం చేసి జిల్లాలో 28 పాల సేకరణ, శీతలీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొన్ని ప్రారంభించాక మూతపడగా మరికొన్ని నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. ఫలితంగా రూ.కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన పలు కూలింగ్‌ యంత్రాలు, పరికరాలు, మూలకు చేరాయి. బీఎంసీలను ఏర్పాటు చేయడం కోసం రూ. లక్షలు వెచ్చించి భవనాలు కట్టారు. ప్రస్తుతం అవీ వృథా అయ్యాయి. బీఎంసీలను నడపలేక చేతులెత్తేసిన డీఆర్డీఏ వాటిని పాడిపరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్యకు అప్పగించింది. కొన్నింటిని ఇప్పటికే అప్పగించారు. వీటిని తీసుకొని ప్రయోగాత్మకంగా తిరిగి ప్రారంభించినా ఆశాజనకంగా లేకపోవడంతో తాము నడపలేమన్న స్థితికి సహకార సమాఖ్య వచ్చింది. అందరి దారీ ఒకే తీరు కావడంతో జిల్లాలో బీఎంసీల కథ వ్యథా భరితమైంది.

పాడిని పట్టించుకోరా..? (పశ్చిమగోదావరి)

గోదావరి మిల్క్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు పేరుతో పాలశీతలీకరణ కేంద్రాలను డీఆర్డీఏ, వెలుగు, ఏపీడీడీసీఎఫ్‌, పశుసంవర్థక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాలోని 28 చోట్ల పాలశీతలీకరణ కేంద్రాలు నెలకొల్పారు. వెలుగు స్వయం సహాయక సంఘాలు ప్రారంభంలో వీటిని నడిపాయి. నడపలేక 8 యూనిట్లను భీమడోల్లోని పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్యకు అప్పగించారు. మిగిలినవి కూడా తీసుకోవాలని డీఆర్డీఏ కోరుతోంది. తీసుకున్న యూనిట్లలో యలమంచిలి, నిడదవోలు, ఇరగవరం, జంగారెడ్డిగూడెం, పెంటపాడు, చింతలపూడి బీఎంసీలను సమాఖ్య తిరిగి ప్రారంభించింది. పాలసేకరణ అంతగా జరగకపోవడంతో పెంటపాడు, చింతలపూడి కేంద్రాలు తప్ప మిగిలిన వాటిని మూత పెట్టింది. 5వేల లీటర్ల సామర్థ్యం ఉన్న చింతలపూడి బీఎంసీకి 700 లీటర్లు, 3వేల లీటర్ల పాల శీతలీకరణ సామర్థ్యం కలిగిన పెంటపాడు బీఎంసీకి 300 లీటర్లు మాత్రమే వస్తుండడంతో వీటి తలుపులు మూతపెట్టే యోచనలో సమాఖ్య ఉంది. ఈ అనుభవ సారంతో మిగిలిన కేంద్రాలను తీసుకొని నడపడం కష్టమన్న నిర్ణయానికి సమాఖ్య వచ్చింది. వేలాది మంది మహిళా శక్తి ఉన్నా డీఆర్డీఏనే నడపలేనప్పుడు పొరుగుసేవల సిబ్బందితో తాము మాత్రం ఎలా నిర్వహించగలమని వీరు ప్రశ్నిస్తున్నారు. వేసవి కావడంతో పాల సేకరణ వీరికి కష్టంగా మారింది.గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలు పెంచుతున్న గేదెలు, ఆవులు ఇచ్చే పాలను సేకరించి బీఎంసీలకు చేర్చాలన్నది ప్రధాన ఆశయం. ఇందు కోసం గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలుగా గేదెలు అందజేశారు. సేకరించిన పాలను బీఎంసీల వద్ద ఏర్పాటు చేసిన కూలింగ్‌ యంత్రాలతో శీతలీకరించి భీమడోలులోని గోదావరి మిల్క్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుకు పంపాలి. ఇందుకు అవసరమైన యంత్రాలు, వాహనాలు, పాలటిన్నులు, జనరేటర్లు, ఇతర నిర్వహణ సామగ్రిని లక్షలు పెట్టి కొన్నారు. 24 గంటలూ విద్యుత్తు సరఫరా చేసేందుకు ప్రత్యేక విద్యుత్తు లైన్లు వేశారు. ప్రతి కేంద్రంలోను దాదాపు 2 వేల లీటర్ల నుంచి 5 వేల లీటర్ల పాలు సేకరించాలన్నది బీఎంసీల లక్ష్యం. నిర్వహణతో స్థానికంగా ఉపాధితోపాటు మహిళలకు ఆదాయం చూపాలన్నది లక్ష్యం. కొద్దికాలం బాగానే సాగినా పాలసేకరణ సక్రమంగా జరగక నష్టాల బాట పట్టింది. దీంతో మహిళలు నిర్వహించలేక చేతులెత్తేశారు. ఈ సమయంలో కేంద్రాలను మూసివేయకుండా ప్రత్యామ్నాయ మార్గం చూడాల్సిన అధికార యంత్రాంగం మిన్నకుంది. ఫలితంగా ఘనమైన ఆశయం నీరుగారింది. కొన్ని చోట్ల ప్రారంభించి నిర్వహించలేక మూతపెడితే చాలా చోట్ల కనీసం తెరవకుండానే మూతపెట్టారు. ఇటువంటి వాటిలో పెనుమంట్ర, నిడమర్రు, కొయ్యలగూడెం తదితరాలు ఉన్నాయి.

No comments:
Write comments