కమలం అడుగులు...

 


వాపా, బలుపా
విజయవాడ, జూన్ 27, (globelmedianews.com
ఎక్క‌డైనా ఏరాష్ట్రంలో అయినా.. ఏ పార్టీ అయినా బ‌ల‌ప‌డాలంటే.. ఏం చేయాలి? ఇది చాలా సింపుల్ ప్ర‌శ్న‌. ప్ర‌జ‌ల్లోకి వెళ్లడం, వారి మ‌న‌సులు దోచుకోవ‌డం, వారికి అనుకూలంగా చ‌ర్య‌లు తీసుకోవ‌డం, ప్ర‌జ‌ల మ‌న‌సులు గెలుచుకునేందుకు వారితో ఎలా ఉండాల‌నే విష‌యాల‌పై దృష్టి పెట్ట‌డం ఏ పార్టీకైనా ప్ర‌ధ‌మ క‌ర్త‌వ్యం. అయితే, నేల విడిచి సాము చేస్తున్న బీజేపీ నాయ‌కులు ఏపీలో వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు అంద‌రినీ విస్మ‌యానికి గురి చేస్తోంది. నిజానికి ఏపీలో బీజేపీకి మూలాలు త‌క్కువ‌. ప్రాంతీయ పార్టీలైన టీడీపీకి, ప్ర‌స్తుతం వైసీపీకి ఉన్న ప్ర‌జాద‌ర‌ణ‌తో పోల్చుకుంటే.. బీజేపీకి ఏపీలో ప‌ట్టం క‌డుతున్న ప్ర‌జ‌లు త‌క్కువే.అదే స‌మ‌యంలో సంస్థాగ‌తంగా కాంగ్రెస్‌కు మంచి ఓటు బ్యాంకు ఉంది. దీనికి అనేక కార‌ణాలు ఉన్నాయి. క్షేత్ర‌స్థాయిలో బీజేపీ సిద్ధాంతాల‌ను, వ్యూహాల‌ను ప్ర‌జ‌ల‌కు తెలిసేలా వ్య‌వ‌హ‌రించాలి.

కమలం అడుగులు...

అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు అలాంటి ప్ర‌య‌త్నం ఏదీ కూడా ముందుకు సాగ‌లేదు. పైగా దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు నాయ‌కులు దృష్టి కూడా పెట్ట‌లేదు. అయితే, ఏపీలో చంద్రబాబు అండ్ టీడీపీ త‌మ‌ను వ్య‌తిరేకించిన ద‌రిమిలా.. ఈ పార్టీని నిర్వీర్యం చేయ‌డం ద్వారా వైసీపీకి ప్ర‌త్యామ్నాయం కావాల‌ని బీజేపీ భావిస్తోంది. మంచిదే..!దేశంలో జాతీయ పార్టీగా ఎక్క‌డైనా ఎదిగేందుకు, ఏ రాష్ట్రంలో అయినా అధికా రంలోకి వ‌చ్చేందుకు కూడా ప్రయ‌త్నించ‌డం త‌ప్పుకాదు. అయితే, ఇలా ఎదిగే క్ర‌మంలో.. వేస్తున్న అడుగులు విమ‌ర్శ‌ల‌కు తావిస్తున్నందునే బీజేపీని అంద‌రూ ఏవ‌గించుకుంటు న్నారు. ఏపీలో క్షేత్ర‌స్థాయిలో ఎదిగి, కార్య‌క‌ర్త‌ల‌ను కూడ‌గట్టి.. ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ శ‌క్తిగా ఎదిగితే ఎవ‌రికీ అభ్యంత‌రం లేదు. కానీ, టీడీపీ త‌ర‌ఫున ఎన్నికైన వారిని, లేదా ప్ర‌తిప‌క్షాల నుంచి నాయ‌కులను త‌మ పార్టీలో చేర్చుకుంటే.. అది నిజంగా బ‌లుపు కాదు.. వాపు కింద‌కే వ‌స్తుంద‌ని చెప్పాలి.నిజానికి నాయ‌కులు రాజ‌కీయాల‌ను, ప్ర‌భుత్వాల‌ను నిర్ణ‌యిస్తార‌నుకుంటే.. చాలా పొర‌పాటు. ప్ర‌జ‌లను త‌క్కువ‌గా అంచ‌నావేసిన‌ట్టే అవుతుంది. ఇదే రూట్లో బీజేపీ వెళితే ఏపీలో ఎన్ని సంవ‌త్స‌రాలు ఉన్నా ఆ పార్టీకి కేవ‌లం నాయ‌కులు మాత్ర‌మే మిగులుతారన‌డంలో సందేహం లేదు. నాయ‌కుల‌తో పార్టీ బ‌ల‌ప‌డుతుంద‌నుకుంటే వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేల‌ను చంద్ర‌బాబు త‌న పార్టీలోకి చేర్చుకుని మంత్రి ప‌ద‌వులు కూడా ఇచ్చారు. అయినంత మాత్రాన వారేమైనా ఎన్నిక‌ల్లో గెలిచారా ? బాబును అధికారంలోకి తెచ్చారా ? కాబ‌ట్టి.. ముందు ప్ర‌జ‌ల మ‌న‌సులు గెలిచేందుకు, ప్ర‌జ‌ల వ్యూహాల‌కు, వారి ఆలోచ‌న‌ల‌కు, స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి దారి చూపేలా ఉంటే.. ఖ‌చ్చితంగా ఏ పార్టీకైనా మ‌నుగ‌డ ఉంటుంది.

No comments:
Write comments