బయో మెట్రిక్ తో హెవీ లైసెన్సులు

 


హైద్రాబాద్,  జూన్ 11, (globelmedianews.com)
డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీలో పారదర్శకతను తీసుకువచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ చర్యలు తీసుకుంటుంది. కొత్తగా ప్రవేశపెట్టనున్న ఆన్‌లైన్ విధానం ద్వారా రాష్టంలోని అన్ని మోటర్ డ్రైవింగ్ స్కూళ్లను అనుసంధానం చేయనున్నారు. రాష్ట్రంలో హెవీ మోటర్ డ్రైవింగ్ శిక్షణను ఇచ్చేందుకు సుమారు 63 స్కూళ్లు ఉండగా, జంటనగరాల్లో 13 స్కూళ్లు ఉన్నాయి. వీటిలో అత్యధిక భాగం స్కూళ్లు కేవలం ఫారం -5 జారీ చేయడమే వ్యాపారంగా సాగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఖచ్చితంగా హెవీ లైసెన్స్ కోసం 30 రోజుల శిక్షణ పొందాల్సి ఉండగా, లైట్ ట్రాన్స్‌ఫోర్ట్ వాహనాల లైసెన్స్ కోసం 21 రోజుల శిక్షణ అవసరం. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు సుమారు 200 దాకా హెవీ లైసెన్స్‌లు జారీ అవుతున్నాయని, వారిలో అత్యధికశాతం శిక్షణ లేకుండానే ఫారం-5 పొందారని అధికారుల పరిశీలనలో తేలడంతో కొత్తగా బయోమెట్రిక్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. 


బయో మెట్రిక్ తో హెవీ లైసెన్సులు

లారీలు, బస్సులతో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, పెరుగుతున్న మృతుల సంఖ్యను పరిగణలోకి తీసుకుని డ్రైవింగ్‌ను పటిష్టం చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు.. డ్రైవింగ్ స్కూల్‌కు వెళ్లకుండానే శిక్షణ తీసుకున్నట్లు చూపెట్టి డ్రైవింగ్ లైసెన్స్ పొందుతుండటాన్ని ప్రమాదంగా భావించి వీటికి ముకుతాడు వేయాలనే లక్ష్యంతో మొత్తం హెవీలైసెన్స్ ప్రక్రియను ఆన్‌లైన్ పోర్టల్‌కు అనుసంధానం చేయనున్నారు. ఎప్పటికప్పుడు హాజరు పట్టిక, శిక్షణ వివరాలను పోర్టల్‌లో అప్‌డేట్ చేయనున్నారు. రవాణా శాఖ వాహనాల లైసెన్స్‌ల జారీ కోసం అవసరమైన శిక్షణ ఇవ్వకుండానే మోటర్ డ్రైవింగ్ స్కూళ్ల నిర్వాహకులు అవకతవకలకు పాల్పడుతున్నట్లు తేలాయి. ట్రాన్స్‌ఫోర్ట్ లైసెన్స్ కోసం డ్రైవింగ్ టెస్ట్‌లో పాల్గొనేందుకు వెళ్లే డ్రైవర్లకు విధిగా 30 రోజుల శిక్షణ అవసరం ఉంటుంది. ఈ శిక్షణను అందించాల్సిన మోటర్ డ్రైవింగ్ స్కూళ్ల నిర్వాహకులు కాసుల కక్కుర్తితో శిక్షణను ఇచ్చినట్లు ధ్రువీకరించే ఫారం-5 ను ఇష్టారాజ్యంగా ఇస్తున్నారని వాటి ఆధారంగా లైసెన్స్‌లు పొందుతున్న డ్రైవర్లు రోడ్లపై అనేక ప్రమాదాలకు కారణమవుతున్నారని ఇటీవల జరిగిన ప్రమాదాలపై ఆధ్యాయనం చేసిన అధికారులు తేల్చారు. దీంతో ఈ లోపాలను సవరించేందుకు రవాణాశాఖ అధికారులు పటిష్ట చర్యలకు ఉపక్రమించారు. రవాణాశాఖ వెబ్‌సైట్‌లో ప్రస్తుతం ఉన్న ఆటోమేటెడ్ ఆన్‌లైన్ సర్వీసెస్(ఏఓఎస్) అప్‌డేట్ చేస్తున్నారు. ఆన్‌లైన్ లావాదేవీల కాలంలో ప్రస్తుతం ఉన్న ఆప్షన్స్‌కు కొత్తగా మోటర్ డ్రైవింగ్ స్కూల్ వివరాలను కూడా జోడిస్తున్నారు. 

No comments:
Write comments