రాజస్థాన్ ను పుట్టముంచిన సీనియర్లు

 


జైపూర్, జూన్ 3 (globelmedianews.com)
రాజస్థాన్ లో దారుణ ఓటమికి బాధ్యులెవరు…? ఈ ఓటమికి బాధ్యత వహించి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రాజీనామా చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. కుమారుడినే గెలిపించుకోలేని ఆయన నాయకత్వం తమకు అవసరం లేదని కాంగ్రెస్ లోని ఒకవర్గం గట్టిగా వాదిస్తోంది. అశోక్ గెహ్లాట్ ను త్వరలోనే తప్పిస్తారన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రధానంగా సచిన్ పైలట్ వర్గీయులు ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్ ను అంగీకరించే ప్రసక్తి లేదని బహిరంగంగానే చెబుతున్నారు. ఆరు నెలల్లోనే పార్టీని భ్రష్టుపట్టించారని ఆరోపిస్తున్నారు.రాజస్థాన్ లో ఆరు నెలల క్రితం జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలగింది. ఈ విజయం వెనక సచిన్ పైలట్ కృషి ఉందనేది కాదనలేని వాస్తవం. అయితే అప్పట్లో రాహుల్ గాంధీ రాజస్థాన్ ముఖ్యమంత్రిగా సచిన్ పైలట్ ను చేద్దామనుకున్నా..సీనియర్ నేతలు అడ్డుపుల్లలు వేశారు. 


రాజస్థాన్ ను పుట్టముంచిన సీనియర్లు
ఒకరకంగా సోనియాగాంధీ సయితం రాహుల్ ఆలోచనను అంగీకరించలేదు. లోక్ సభ ఎన్నికలను ముందు పెట్టుకుని యువకులకు పగ్గాలు అప్పగిస్తే పార్టీ గెలవడం కష్టమని సోనియా నుంచి సీనియర్ నేతల వరకూ రాహుల్ కు నచ్చ చెప్పడంతో ఆయన అశోక్ గెహ్లాట్ నియామకానికి అంగీకరించారంటారు.అయితే ఇప్పుడు తాజా ఫలితాలను రాహుల్ సీనియర్ నేతలను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. రాజస్థాన్ లో ఒక్క సీటు కూడా గెలవకపోవడం రాహుల్ ఆగ్రహానికి కారణమనిచెబుతున్నారు. సొంత కుమారుడి గెలుపు కోసం రాష్ట్రంలో పార్టీని బలితీసుకున్నారన్న ఆవేదన పార్టీ సీనియర్ నేతలముందు రాహుల్ ఆవేదన చెందినట్లు వార్తలు వచ్చాయి. నిజానికి అశోక్ గెహ్లాట్ తన కుమారుడు వైభవ్ గెలుపు కోసం అక్కడే తిరుగుతూ మిగిలిన నియోజకవర్గాలను వదిలేశారన్నది విమర్శ. ఇందులో నిజం కూడా లేకపోలేదు. దీంతో పాటు సచిన్ పైలట్, అశోక్ గెహ్లాట్ వర్గాల మధ్య సమన్వయం లేకపోవడం పార్టీకి భారీగా డ్యామేజీ చేసింది.దీనికి తోడు రాహుల్ గాంధీ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను అశోక్ గెహ్లాట్ సక్రమంగా అమలు చేయలేకపోయారంటున్నారు. ముఖ్యంగా రాజస్థాన్ లో రైతు రుణమాఫీ రాహుల్ ప్రకటించినా ఆరు నెలలు గడుస్తున్నా అమలు పర్చకపోవడం వల్లనే రైతులు బీజేపీ వైపు చూశారంటున్నారు. సీనియర్ నేతలు సీట్లు పట్టుకుని వేలాడుతుంటే కాంగ్రెస్ పార్టీని ఈసారి కూడా అధికారంలోకి తీసుకురావడం కష్టమేనని భావించిన రాహుల్ గాంధీ రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారన్న ప్రచారమూ లేకపోలేదు. మొత్తం మీద రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ ను త్వరలోనే తప్పిస్తారన్న ప్రచారం హస్తినలో జోరుగా సాగుతోంది.

No comments:
Write comments