గొంతెండుతోంది (ప్రకాశం)

 

ఒంగోలు, జూన్ 26 (globelmedianews.com): 

గుక్కెడు నీరు కోసం జిల్లాలోని పశ్చిమాన 24 మండలాల్లో జనం నానా తంటాలు పడుతున్నారు... నాలుగేళ్లుగా వరుస కరవు పరిస్థితులతో అల్లాడిన జిల్లాలో మే 31తో ముగిసిన నీటి సంవత్సరం మరింత దుర్భిక్షాన్ని మిగిల్చి వెళ్లింది. కనీసం తాగడానికి కూడా నీరు లేక జిల్లాలోని కొన్ని పల్లెల్లో జనం ఊరొదిలి వలస వెళ్లిపోతున్నారు. అందుకు పొదిలి మండలంలోని జువ్వలేరు, తర్లుపాడు మండలంలోని కారుమానుపల్లి గ్రామాలను ఉదాహరణలుగా పేర్కొనవచ్ఛు జిల్లావ్యాప్తంగా ఇలా దాదాపు 40 పల్లెల్లో ప్రజలు తాగునీటి సమస్య కారణంగానే వలసలు వెళ్లిపోయారు. కారుమానుపల్లిలో చాలా మంది వలస వెళ్లగా, పని చేయలేని వృద్ధులు మాత్రమే మిగిలారు. అరకొర నీటితో ఊరు కాలం గడుపుతోంది. జువ్వలేరులో చేతిపంపులు ఒట్టిపోయాయి. వాటి స్థానంలో ఏర్పాటు చేసిన డీప్‌ బోర్లు సైతం ఎండిపోయాయి. మరో డీప్‌ బోరు మరమ్మతులకు గురైంది. ట్యాంకర్లు అరకొరగా మూడు రోజులకోసారి వస్తున్నాయి. ఈ స్థితిలో ఏడాదిన్నరగా ఇక్కడి నుంచి జనం వెళ్లిపోతుండడంతో ఇళ్లు ఖాళీ అవుతున్నాయి. 

                                                గొంతెండుతోంది (ప్రకాశం)

ఇప్పటికే 34 కుటుంబాల వారు పశువులను కూడా అమ్ముకుని, వలసలు వెళ్లారు. తమ బిడ్డల చదువులు మధ్యలోనే ఆపేసి తమతో తీసుకెళ్లి పనిలో పెడుతున్నారు.కనిగిరి, యర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల్లో వాడుక నీరు సైతం కొనుక్కోవాల్సిన దుస్థితి ఉంది. 20 లీటర్ల తాగునీటి క్యాను రూ. 10 చొప్పున కొనుక్కోవాలి. ఒక కుటుంబానికి రోజుకు ఒక క్యాను తప్పనిసరి. దీని ఖర్చు నెలకు రూ. 300. వాడుక నీరైతే వారానికి రెండు డ్రమ్ములు కొనాలి. దీని కోసం నెలకు రూ. 560 వరకూ ఖర్చవుతుంది. ఇలా నెలకు రూ. 900-1000 అదనపు వ్యయం. కేవలం నీళ్ల కోసం పేదింటిలో ప్రత్యేక పద్దు పెట్టుకోవాల్సిన హీనస్థితి జిల్లాలోని 24 మండలాల్లో ఉంది. కనిగిరి, పొదిలి ప్రాంతాల్లో తాగునీటిని అందించలేక కొందరు ఇళ్ల యజమానులు వేసవిలో మూడు నెలల పాటు ఇళ్లను అద్దెకు ఇవ్వడం లేదంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్ఛుతాగునీటిని ట్యాంకర్ల ద్వారా అత్యధికంగా అందిస్తున్నది ఈ జిల్లాలోనే. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు దాదాపు 20,400 ట్రిప్పులతో తాగునీటిని అందిస్తుండగా... కేవలం ప్రకాశం జిల్లాలోనే రోజుకు 9430 ట్రిప్పులు అవుతున్నాయి. ఏప్రిల్‌ నెలలో సుమారు 7,170 ట్రిప్పుల నీటిని సరఫరా చేయగా ఇప్పుడు మరో రెండు వేలకు పైగా పెంచాల్సి వచ్చింది. గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో రోజుకు సగటున వెయ్యి వరకు తాగునీటి ట్యాంకర్లు తిప్పుతున్నారు. అయినా దాహార్తి తీరడం లేదు. మే నెలాఖరుతో ముగిసిన నీటి సంవత్సరంలో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యింది జిల్లాలోనే. 871 మిమీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 57 శాతం లోటు వర్షపాతం నమోదైంది. 2015 నుంచి వరుసగా ఏటా 40 శాతానికి పైగా లోటు వర్షపాతమే. దీంతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి. జిల్లాలో 23.21 మీటర్ల లోతుకు పడిపోయాయి. భూగర్భ జలాల రాష్ట్ర సగటు 12.43 మీటర్లు కాగా, ప్రకాశం జిల్లాలో అవి పాతాళంలో ఉన్నాయి. జిల్లాలో 26 వేల బోర్లు ఉండగా, వాటిలో 15 వేలకు పైగా పనిచేయడం లేదు. ఊళ్లకు దూరంగా ప్రైవేటు వ్యక్తులు బోర్లు తవ్వుతుండగా, వారి ద్వారా ట్యాంకర్లలో నీటిని నింపి సరఫరా చేస్తున్నారు. కేవలం తాగునీటి సరఫరాకు జిల్లాలో ప్రభుత్వం తరఫున రోజుకు రూ. 35 లక్షలకు పైగా వ్యయం చేస్తున్నారు. అంటే నెలకు దాదాపు రూ. పదిన్నర కోట్లు. ఇంత ఖర్చు పెట్టినా నిత్యం జనం దాహార్తితో అల్లాడాల్సిన దుస్థితి నెలకొంది. వెలుగొండ ప్రాజెక్టు సాకారమై నీరొస్తేనే ఈ సమస్య కొంతవరకు తీరే అవకాశం ఉంది.

No comments:
Write comments