ఏపీలో కమలం ఆపరేషన్ ...

 


విజయవాడ, జూన్ 4 (globelmedianews.com)
మలనాధులు తాము చేయాలనుకున్న దాని విషయంలో స్పష్టంగా ఉంటారు. దాని కోసం వారు అన్ని శక్తియుక్తులు కూడా వినియోగిస్తారు. ఒక బలమైన టార్గెట్ ని పెట్టుకుంటే దాన్ని చేదించేవరకూ కాషాయ‌ధారులకు నిద్ర పట్టదు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బలంగా ఉన్న బీజేపీ ఇపుడు దక్షిణాదిపైన చూపు సారించింది. ఇక్కడ ఉనికి చాటుకోవడం ద్వారానే రేపటి రోజున మరో మారు డిల్లీ గద్దెని ఎక్కగలమన్న ఆలోచన ఆ పార్టీ పెద్దలకు బాగా ఉంది. ఉత్తరాది రాష్ట్రాలు, ఈశాన్య ప్రాంతాలు, తూర్పు రాష్త్రాలు ఇలా అన్ని చోట్లా విస్తరిస్తున్న బీజేపీకి ఇపుడు దక్షిణం అతి పెద్ద టాస్క్ అని చెప్పకతప్పదు. కర్నాటక తప్ప ఎక్కడ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్న బీజేపీకి తెలంగాణాలో మాత్రం కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. అసెంబ్లీలో ఏక్ నిరంజన్ గా ఒకే సీటుకు పరిమితమైన ఆ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా నాలుగు ఎంపీలు వచ్చాయి. అంటే 28 అసెంబ్లీ సీట్లతో సమానం. దాంతో సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి కీలకమైన హోం మంత్రిత్వ శాఖను ఇచ్చి గురుతరమైన బాధ్యతలు అప్పగించారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ కు ప్రధాన పోటీ బీజేపీ ఇస్తుదన్న ధీమా వారిలో కనిపిస్తోంది.


ఏపీలో కమలం ఆపరేషన్ ...
ఇపుడు తెలంగాణాలో, ఏపీలో కూడా చతికిలపడిన పార్టీగా టీడీపీ ఉంది. ఆ పార్టీ గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోగానే తెలంగాణాలో జెండా ఎత్తేసింది. దీంతో తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయలేకపోయింది. ఇక ఏపీలో అయితే వైసీపీ దెబ్బకు కూసాలు కదిలిపోయాయి. పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఎన్నడూ జరగని ఘోర పరాభవం టీడీపీకి జరిగింది. కేవలం 23 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో సన్నగిల్లిపోయింది. సరిగ్గా ఇదే అదనుగా తెలంగాణా, ఏపీలో బీజేపీ టీడీపీని టార్గెట్ చేసింది. రెండు చోట్లా తమ్ముళ్ళను తమ వైపు తిప్పుకుంటే ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించవచ్చున‌న్నది ఆ పార్టీ ఎత్తుగడగా ఉంది. దీని మీద అపుడే బీజేపీ నాయలుకు ఏమీ దాచుకోకుండానే తమ వ్యూహం బయటపెట్టేసుకుంటున్నారు. ఏపీ బీజేపీ సీనియర్ నేత రఘునాధబాబు దీని మీద మాట్లాడుతూ, ఏపీలో బీజేపీ విస్తరణకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. టీడీపీకి 2014లో తెలంగాణాలో ఓడిపోయింది. 2019 నాటికి అక్కడ దుకాణం బంద్ అయింది, ఏపీలో కూడా కేవలం 23 మందితో టీడీపీ ఖేల్ ఖతం అంటున్నారు.ఇదిలా ఉండగా తెలంగాణా ఏపీలో టీడీపీ తమ్ముళ్ళు ఇపుడు టీడీపీ వైపు చూస్తున్నారు. కిషణ్ రెడ్డి ప్రమాణం చేయగానే టీ టీడీపీ నేతలు ఢిల్లీకి వెళ్ళి మరీ ఆయన్ని అభినందించారు. తొందరలో వారంతా బీజేపీ తీర్ధం పుచ్చుకుంటారని అంటున్నారు. పెద్దిరెడ్డి తో పాటు పలువురు సీనియర్లు రేపటి రోజున తెలంగాణాలో మనగలగాలంటే జాతీయ పార్టీ బీజేపీలో చేరడం శరణ్యమని డిసైడ్ అయ్యారని భోగట్టా . ఇక ఏపీలో కూడా టీడీపీకి చెందిన ప్రధాన సామాజిక వర్గం నేతల చూపు బీజేపీ మీద ఉంది. అనంతపురంలో ఓ మాజీ మంత్రి తన కుమారుడితో సహా బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారని అంటున్నారు. ఇక గుంటూరు జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి కూడా కమలం నీడన సేదతీరాలనుకుంటున్నారు. ఇక గోదావరి జిల్లాల నుంచి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల చూపు బీజేపీ మీద పడిందని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఆపరేషన్ ఆకర్ష్ మీద బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఏపీలో తొందరలో కీలకమైన మార్పులు వస్తాయని భావిస్తోంది.

No comments:
Write comments