అన్న క్యాంటిన్లకు బ్రేక్...

 


గుంటూరు, జూన్ 4(globelmedianews.com)
కేవలం రూ.5కే పేదలకు ఆహారం అందజేయాలనే సదుద్దేశంతో చంద్రబాబు ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలుత పట్టణాల్లో ప్రారంభించిన ఈ క్యాంటీన్లను సార్వత్రిక ఎన్నికల ముందు రాష్ట్రంలోని వివిధ మండల కేంద్రాల్లో తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటుచేశారు. అయితే, తాత్కాలిక క్యాంటీన్లు మూతపడుతున్నాయి. నిర్వహణ సంస్థకు రూ.45 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోవడంతో క్యాంటీన్లకు ఆహార సరఫరాను నిలిపివేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 204 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. 


అన్న క్యాంటిన్లకు బ్రేక్...
ఇందులో 184 క్యాంటీన్లను పట్టణ ప్రాంతాల్లో ప్రారంభించారు. మిగతా వాటి పనులు వివిధ దశల్లో ఉన్నాయి. అయితే, ఎమ్మెల్యేల నుంచి పెద్దఎత్తున వినతులు రావడంతో ఎన్నికల ముందు మండల కేంద్రాల్లో ఈ క్యాంటీన్లను టీడీపీ ప్రభుత్వం ప్రారంభించింది. భవనాలు అందుబాటులో లేకపోవడంతో తాత్కాలిక షెడ్లలో వీటిని ఏర్పాటు చేశారు. ఈ క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేస్తున్న అక్షయపాత్రకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోయాయి. వీటికి చెల్లింపులు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని నిర్వాహకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా బకాయిలు చెల్లింపులకు చర్యలు తీసుకోకపోవడంతో తాత్కాలిక క్యాంటీన్లకు ఆహార సరఫరాను నిలిపివేస్తున్నారు. శాశ్వత భవనాల్లో నిర్వహిస్తున్న క్యాంటీన్లకు మాత్రం ఎలాంటి ఇబ్బందీ లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. నామమాత్రపు ధరకే రుచికరమైన ఆహారం అందజేయాలనే సంకల్పంతో టీడీపీ ప్రభుత్వం గతేడాది జులైలో వీటిని అట్టహాసంగా ప్రారంభించింది. తమిళనాడులోని తొలిసారిగా దివంగత ముఖ్యమంత్రి జయలలిత అమ్మ క్యాంటీన్లు ప్రారంభించిన విషయం తెలిసిందే.

No comments:
Write comments