హాజీపూర్ కు బస్సులు వస్తాయ..రావా...

 


కరీంనగర్, జూన్ 11, (gobelmedianews.com)
:ఆర్టీసీ బస్సులు రాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా వందలాది ఊర్లలో స్టూడెంట్లు బడికి వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. ఆదాయం వచ్చే మార్గాలపైనే ఆర్టీసీ దృష్టి పెడుతుండటంతో పల్లెలకు బస్సుల రాకపోకలు ఉండటం లేదు. స్టూడెంట్లు స్కూళ్లకు వెళ్లే సమయానికి బస్సులు వేయాలని ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా ప్రయోజనం ఉండటం లేదు. ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. చేసేదేమీ లేక స్టూడెంట్లంతా నడుచుకుంటూనో, సైకిళ్లపైనో, ఎవరినైనా లిఫ్ట్ అడిగో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే హాజీపూర్లో ముగ్గురు ఆడపిల్లలు బలైపోయారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా 3,717 రూట్లలో ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. ప్రస్తుతం 9,370 గ్రామాలకు బస్సులు తిరుగుతుండగా.. నిత్యం 97.70 లక్షల మంది ప్రయాణికులను గమ్యాలకు చేరుస్తోంది. అయితే ఆదాయం వచ్చే రూట్లపైనే ఆర్టీసీ దృష్టి పెడుతోందన్నా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే రాష్ట్రవ్యాప్తంగా 1,341 ఊర్లకు బస్సు వెళ్లడం లేదు. ‘‘పల్లెలకు బస్సులు వేస్తే ఏం రాదు. గతంలో కొన్నిచోట్ల ట్రయల్‌‌ వేసి చూశాం. మొత్తం నష్టాలే. ఆ గ్రామాలకు బస్సు రాకున్నా ఆటోల్లో పోతున్నరు. 


హాజీపూర్ కు బస్సులు వస్తాయ..రావా...
బస్సు ఎవరూ ఎక్కడం లేదు..”అని ఆర్టీసీలోని ఓ అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. రాష్ట్రంలోని అన్ని ఊర్లకు బస్సులు నడుపుతామని సర్కారు చాలా సార్లు ప్రకటించినా ఇప్పటికీ అమలు కాలేదు.రాష్ట్రంలోని చాలా ఊర్లలో ప్రాథమిక స్థాయి వరకే బడులున్నాయి. దాంతో హైస్కూల్ కోసం నాలుగైదు కిలోమీటర్ల దూరంలోని ఊర్లకు వెళ్లాల్సిందే. ఇక పెద్ద సంఖ్యలో స్టూడెంట్లు మండల కేంద్రాల్లోని ప్రైవేటు స్కూళ్లలో చదువుకుంటుంటారు. బస్సులు రాని ఊర్ల నుంచి వారంతా నడుచుకుంటూనో, సైకిళ్లపైనో వెళ్లాల్సిందే. మండల కేంద్రాలకు వెళ్లే స్టూడెంట్లు ఆటోలపై ఆధారపడాల్సి వస్తోంది. కొన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సు నడుస్తున్నా అది స్కూల్ టైంకు రావడం లేదు. హైస్కూలుకు వెళ్లే స్టూడెంట్లలో అమ్మాయిలు మరిన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఊర్ల నుంచి వెళుతుండగా మధ్యలో ఆకతాయిలు అడ్డా వేసి ఏడిపించడం, వికృత చేష్టలకు దిగుతుండటంతో ఇబ్బంది పడుతున్నారు. దాంతో తల్లిదండ్రులు ఆడపిల్లలను బడి మానేయించడం వంటివీ జరుగుతున్నాయి. ‘‘మా ఊరికి బస్సు రాదు. ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లి చదువుకోవాలి. సాయంత్రం వచ్చేటప్పటికి చీకటి పడుతుంది. వెనకాల ఎవరొచ్చినా భయమేస్తోంది. బస్సులుంటే ఈ బాధ ఉండది..”అని మహబూబ్నగర్జిల్లాకు చెందిన ఓ స్టూడెంట్ తన బాధ వెళ్లబోసుకుంది.ఆర్టీసీ మొత్తంగా 10,400 బస్సులను నడుపుతుండగా.. 8,100 సొంత బస్సులు, 2,300 అద్దె బస్సులు ఉన్నాయి. అయితే ఆర్టీసీ నష్టాల్లో ఉండటం, ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందకపోవడంతో బస్సు సర్వీసులను సరిగా నిర్వహించడం లేదని అధికారులు, ఆర్టీసీ యూనియన్ల నేతలు చెబుతున్నారు. కొత్త బస్సులు కొనడానికి డబ్బులు లేవని, సంస్థ నష్టాల్లో ఉంటే ప్రభుత్వం ఆదుకోవడం లేదని అంటున్నారు. దాంతో నష్టాలను భరించలేక ఆదాయం వచ్చే రూట్లలోనే ఆర్టీసీ బస్సులను నడుపుతోందని మర్థించుకుంటున్నారు. గ్రామాల్లో ఎక్కువగా బస్‌‌పాస్‌‌లు తీసుకుంటారని, పాస్‌‌ల డబ్బులు కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదని వాపోతున్నారు. బస్‌‌పాస్‌‌ కింద ప్రభుత్వం ఏటా ఆర్టీసీకి రూ.750 కోట్లు చెల్లించాలని, కానీ ఈసారి బడ్జెట్లో 630 కోట్లే కేటాయించిందని, ఇందులోనూ రూ.100 కోట్లు లోన్‌‌ ద్వారా ఇప్పిస్తామని పేర్కొందని చెబుతున్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆర్టీసీ నుంచి సర్వీస్‌‌ ట్యాక్స్‌‌, స్పేర్‌‌ పార్ట్స్‌‌పై పన్నులను వసూలు చేస్తోందని అంటున్నారు.గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో స్టూడెంట్లు, జనం ఆటోల్లోనే ప్రయాణిస్తున్నారు. ఆటోల్లో ప్రయాణం ఒక్కోసారి ప్రాణాల మీదికి తెస్తున్నా, తప్పనిసరి పరిస్థితుల్లో ఆశ్రయించాల్సి వస్తోందని అంటున్నారు. ప్రభుత్వం కూడా ప్రమాదాలు జరిగినప్పుడు ఆటోల వాళ్లను ఇబ్బంది పెట్టడమే తప్ప.. ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పించాలన్న ఆలోచన చేయడం లేదని విమర్శిస్తున్నారు. ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

No comments:
Write comments