మహాఘట్ బంధన్ ముక్కలు ముక్కలు

 


లక్నో, జూన్ 4 (globelmedianews.com)
కూటమిలపై ఆధారపడితే ఓట్లు పడవని తెలుసుకోవాలని బిఎస్‌పి అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. పార్టీ బలాన్ని సొంతంగా పెంచుకోవడమే మార్గం అని నేతలు, కార్యకర్తలు దీనిని గ్రహించి తగు విధంగా వ్యవహరించాలని పిలుపు నిచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో ఎస్‌పి బిఎస్‌పిల కూటమి సాధించిన ఫలితాలపై ఆమె పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. బిఎస్‌పి యుపి కమిటీ సమావేశంలో మాయావతి సోమవారం ప్రసంగించారు. మహాఘట్ బంధన్ ఇతరత్రా జట్లపై ఆధారపడరాదని, నిజాలు తెలుసుకుని వ్యవహరిస్తే బాగుంటుందని స్పష్టం చేశారు. త్వరలోనే రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి. వీటికి ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఆఫీసు బేరర్లు సిద్ధం కావాలని, అయితే పార్టీ సొంత బలాన్ని పెంచుకునే ముందుకు సాగాల్సి ఉంటుందని తెలిపారు. 


మహాఘట్ బంధన్ ముక్కలు ముక్కలు
లోక్‌సభ ఎన్నికలలో కొందరు ఎమ్మెల్యేలు ఎంపిలు కావడం ఇతర పరిణామాలతో రాష్ట్రంలో మొత్తం 11 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎస్‌పితో తమ పొత్తు వల్ల బిఎస్‌పికి ఒరిగిందేమీ లేదని స్పష్టం చేశారు. పార్టీకి ఉన్న సాంప్రదాయక , మునుపటి ఓట్ల బలంతోనే రాష్ట్రంలో పది ఎంపి స్థానాలు వచ్చాయని , నిజానికి మిత్రపక్షం సమాజ్‌వాది పార్టీ ఓట్లు బిఎస్‌పికి ఎక్కడా పడలేదని, మిత్రధర్మం ప్రకారం బిజెపిని ఓడించేందుకు కూటమి ఓట్లు సంఘటితం కావల్సి ఉంటుందని, అయితే ఈ విధంగా జరగలేదని, ఎస్‌పి నుంచి బిఎస్‌పికి ఓట్ల గండి తప్ప మరో ప్రయోజనం ఏదీ లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. ఈసారి ఎన్నికలలో దేశంలో ఎక్కడా కూటమిలకు సరైన ఓట్లు రాలేదని, గెలుపు ఓట్లు చీలినట్లుగా భావించుకోవల్సి వస్తోందని, ఈ దశలో పార్టీ వర్గాలు ఇక సొంత బలంపైనే ఆధారపడాల్సి ఉందని మాయావతి స్పష్టం చేశారు. కనౌజ్ నుంచి ఎస్‌పి అధినేత అఖిలేష్ యాదవే తన భార్యను గెలిపించుకోలేకపోయారని మాయావతి దుయ్యబట్టారు. అక్కడ 3లక్షల యాదవుల ఓట్లు ఉంటే వాళ్ల వర్గం ఓట్లే డింపుల్ యాదవ్‌కు పడలేదని, ఇది వారి వైఫల్యమేనని మాయావతి విమర్శించారు. కనౌజ్‌లో ఎస్‌పి అభ్యర్థికి పడ్డ ఓట్లన్నీ బిఎస్‌పి వాళ్లవేనని అన్నారు.

No comments:
Write comments