విశాఖ మెయిన్ రోడ్డు విస్తరణకు అడ్డంకులు

 


విశాఖపట్టణం, జూన్ 20, (globelmedianews.com)
విశాఖనగరంలోని ఓల్డు టౌన్‌ మెయిన్‌ రోడ్డు విస్తరణపై స్థానికుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగదాంబ జంక్షన్‌ నుంచి పాత పోస్టాఫీసు వరకు ఉన్న మెయిన్‌ రోడ్డు చాలా ఇరుకుగా ఉంది. కొన్ని చోట్ల 15 అడుగుల వెడల్పు కూడా లేదు. ముఖ్యంగా పూర్ణామార్కెట్‌ నుంచి పాత పోస్టాఫీసు వరకు ఉన్న రోడ్డు చాలా చిన్నదిగా ఉండటంతో బస్సులు తదితర వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. దీంతో మెయిన్‌ రోడ్డును విస్తరించి అభివృద్ధి చేయాలని స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ నిర్ణయించారు. 2014 ఎన్నికల్లో తొలిసారిగా ఎమ్మెల్యేగా నెగ్గినప్పటినుంచి మెయిన్‌ రోడ్డు విస్తరణపై దృష్టి పెట్టారు. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం 100 అడుగుల వెడల్పుతో రోడ్డును విస్తరింపచేయాలని ప్రతిపాదించారు. 


విశాఖ మెయిన్ రోడ్డు విస్తరణకు అడ్డంకులు
అయితే ఈ రోడ్డులోని వ్యాపార సంస్థల వారు, పెద్ద పెద్ద భవంతులు ఉన్న వారు అభ్యరతరం తెలిపారు. కొందరు కోర్టును ఆశ్రయిచారు కూడా.తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగానే రోడ్డును వెడల్పు చేసి విస్తరిస్తామని ఎమ్మెల్యే పలు సందర్భాలలో చెప్పారు. అయితే స్థానికుల నుంచి అభ్యంతరాలు రావడంతో పలు దఫాలు భవనాల యజమానులు, వ్యాపారవేత్తలతో సమావేశాలు నిర్వహించారు. ఎట్టకేలకు ఎవరికీ ఇబ్బంది లేకుండా 60 అడుగుల వెడల్పుతో రోడ్డును విస్తరించి అభివృద్ధి చేసేందుకు నిర్ణయించారు.రోడ్డు విస్తరణలో కోల్పోయే భవనాల వారికి డబుల్‌ టిడిఆర్‌ ఇచ్చేందుకు, తగిన నష్టపరిహారం కూడా చెల్లించేందుకు జివిఎంసి ముందుకు వచ్చింది. ముందుగా 100 అడుగులతో చేసిన మార్కింగ్‌ను రద్దుచేసి 60 అడుగుల వెడల్పుతో మార్కింగ్‌ వేశారు. ఏయే భవనం, కట్టడం ఏ మేరకు తొలగించనున్నారో మార్కింగ్‌ చేశారు. ఈ నేపథ్యంలో భవనాల యజమానులకు జివిఎంసి నోటిసులు జారీ చేసింది. కొందరినుంచి అగ్రిమెంట్లు చేసింది. కొందరికి నష్టపరిహారం చెల్లించింది. ఇంత జరిగినా రోడ్డు విస్తరణ పనులను చేపట్టలేదు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ పాలన ముగిసింది.2019 ఎన్నికల్లో మరోసారి దక్షిణ ఎమ్మెల్యేగా వాసుపల్లి గణేష్‌కుమార్‌ విజయం సాధించారు. అయితే రాష్ట్రంలో టిడిపి ఓటమి చెంది వైసిపి ప్రభుత్వం వచ్చింది. అధికార పక్షం ఎమ్మెల్యేగా ఉండగా గణేష్‌కుమార్‌ మెయిన్‌ రోడ్డు విస్తరణ చేయించలేకపోయారు. ఇప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా దీనిని సాధించగలరా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విపక్ష ఎమ్మెల్యేకు రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం సహకరిస్తుందా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

No comments:
Write comments