వైసీపీ నేతల్లో అలక

 


విజయవాడ, జూన్ 10, (globelmedianews.com)
వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కోపంలేదు. పార్టీ మీద ఆగ్రహం లేదు. తొలిదశలో తమకు మంత్రి పదవులు రాకపోవడాన్నే వారు జీర్ణించుకోలేకపోతున్నారు. రెండోదశలో ఖచ్చితంగా తమకు వస్తుందని తెలిసినా వారు మొదటి ఛాన్స్ నే ఎక్కువగా కోరుకున్నారు. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత వైసీపీ శాసనసభ పక్ష సమావేశాన్ని బట్టి సంచలన ప్రకటన చేశారు. మంత్రివర్గం మళ్లీ రెండున్నరేళ్ల తర్వాత మారుస్తానని సమావేశంలోనే చెప్పి అందరినీ ఆశ్చర్యపర్చారు.తొలిదశలో మంత్రి పదవి వచ్చిన వారికి కేవలం రెండున్నరేళ్లు మాత్రమే పదవీ కాలం ఉంటుంది. అందుకు సిద్దపడి ఉండాలని, రెండున్నరేళ్ల తర్వాత మంత్రిపదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలని కూడా జగన్ నిష్కర్షగా చెప్పేశారు. అందరినీ సంతృప్తి పర్చాలంటే రెండు దఫాలుగా ముఖ్యనేతలందరికీ అవకాశమివ్వాలన్నది జగన్ ఆలోచన. 


వైసీపీ నేతల్లో అలక
జగన్ ఈ నిర్ణయాన్ని పార్టీ సమావేశంలో అందరూ స్వాగతించారు.తొలిదశలో మంత్రి పదవులు రాని రోజా, అంబటి రాంబాబు, పార్థసారథి, సామినేని ఉదయభాను, ధర్మాన ప్రసాదరావు, శిల్పా చక్రపాణిరెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి నేతలకు రెండోదశలో ఛాన్స్ తప్పకుండా వస్తుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఈసారి ఎన్నికలకు ముందు జరిగే విస్తరణ కావడంతో జగన్ కూర్పులో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటారన్న దానిలో ఎటువంటి సందేహంలేదు.తొలి మంత్రివర్గంలో కేవలం నలుగురు రెడ్డి సామాజిక వర్గానికే జగన్ ప్రాతినిధ్యం కల్పించారు. ఈసారి కూడా ఆ అంకెను దాటే అవకాశం లేదు. అందుకే ఇప్పుడు మంత్రి పదవులు రాని రెడ్డి సామాజిక వర్గం నేతలు ఆందోళనలో ఉన్నారు. ఎన్నికలకు ముందు విస్తరణ కాబట్టి సామాజిక వర్గాల విషయంలో జగన్ ఆచితూచి అడుగులు వేస్తారని, ఈసారి కూడా పదవి దక్కకుంటే ఎలా? అని వారు మదనపడుతున్నారు. అందుకోసమే వారు తన మనసులో మాటను అధినేతకు చెప్పుకోవాలని అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. మరి వీరి భయాన్ని, ఆందోళనను జగన్ తొలగిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

No comments:
Write comments