చంద్రబాబు షటిల్ సర్వీసు

 


హైద్రాబాద్ టూ విజయవాడ...
హైద్రాబాద్, జూన్ 26, (globelmedianews.com)

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆ దర్జా వేరు. ఆయన అధికార వైభోగం అంతా కలల రాజధాని అమరావతిలో ఠీవిగా కనిపించేది. ప్రపంచం గర్వించే రాజధాని కడుతున్నానని గొప్పలు పోయినా బాబు చివరికి అయిదేళ్ల పాలనలో కొన్ని తాత్కాలిక భవనాలు మాత్రం కట్టి పదవి నుంచి దిగిపోయారు. ఇపుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా విపక్ష నేత పదవి ఏదో అలా దక్కింది. దాన్ని సాకుగా చూపించి అయన ఏకంగా ప్రభుత్వం ఖర్చుతో నిర్మించిన ప్రజావేదిక భవనాన్నే వరంగా కోరారు. అయితే ఇలాంటి వరాలను పట్టించుకోని జగన్ తెలివిగా కొత్త ఎత్తు వేశారు. దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అధికారిక సమావేశాలు నిర్వహించేందుకు రంగం సిధ్ధం చేశారు. దాంతో ఖంగు తినడం తమ్ముళ్ల వంతైంది.ఇక ప్రజావేదిక షాక్ నుంచి తమ్ముళ్ళు తేరుకోకముందే జగన్ సర్కార్ మరో కొత్త ఎత్తుగడ వేస్తోంది. 
చంద్రబాబు షటిల్ సర్వీసు

చంద్రబాబు నివాసం ఉన్నది అక్రమ కట్టడం అని తేలిపోయింది. క్రిష్ణా నది పరివాహిక ప్రాంతంలో నిబంధనలకు నీళ్ళొదిలి అక్రమంగా బాబు సన్నిహితుడు లింగమనేని కడితే చంద్రబాబు నాయుడు సీఎం హోదాలో అక్కడ కాపురం పెట్టేశారు. ముఖ్యమంత్రే సాక్ష్తాత్తు అక్కడ ఆక్రమిస్తే నాటి అధికారులకు ఎటూ ధైర్యం చాల్లేదు. దాంతో దాన్ని చూసీ చూడనట్లుగా వదిలేసారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నపుడు ఈ అక్రమ కట్టడం కూల్చమని డిమాండ్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఎటూ అధికారం చేతిలో ఉంది కాబట్టి కరకట్ట వద్ద మాజీ సీఎం అక్రమ కట్టడం కూల్చివేతకు జగన్ సర్కార్ వేగంగా పావులు కదుపుతోంది. అదే జరిగితే బాబుకు తన కలల రాజధాని లో కనీసం ఇల్లే లేకుండా పోతుంది.ఇక జగన్ విపక్ష నాయకుడిగా ఉన్నపుడు హైదరాబద్ లో ఉంటూ వలస పక్షిగా ఏపీకి వస్తున్నారని టీడీపీలో చంద్రబాబు సహా అంతా విమర్శించేవారు. ఇపుడు ఆ పరిస్థితి చంద్రబాబు నాయుడు కే వచ్చేసింది. చంద్రబాబుకు అమరావతి రాజధానిలో సొంత ఇల్లు కాదు కదా అద్దె ఇల్లు కూడా లేదు. ఆయన వందల కోట్లు ఖర్చు పెట్టి హైదరాబాద్ లోనే విలాసవంతమైన భవనం నిర్మించుకున్నారు. ఇపుడు ఆయన ఎటూ విపక్ష నేత కాబట్టి అక్కడ నుంచే ఏపీకి చుట్టపు చూపుగా వచ్చిపోయే సదుపాయం బాగానే ఉందని అంటున్నారు. ఇక జగన్ కి ప్రతిపక్ష హోదాలో టీడీపీ ఏమేమి సదుపాయాలు కల్పించిందో అదే తాము కూడా కల్పిస్తామని బొత్స సత్యనారాయణ అంటున్నారు. అంటే బాబు ఎక్కడైనా అద్దె ఇల్లు తీసుకుంటే సర్కార్ ఖర్చు చెల్లిస్తుందన్న మాట.

No comments:
Write comments