భద్రాద్రి నుంచి ఇసుక తరలిపోతోంది

 


ఖమ్మం, జూన్ 3, (globelmedianews.com)
నింబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తూ అనతికాలంలోనే రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. గోదావరి నదిలో ఇసుకను స్థానికుల అవసరాలకు ఉపయోగించాల్సి ఉన్నా జిల్లా దాటి నగరాలకు అక్రమంగా తరలిస్తూ అధిక రేట్లకు అమ్ముతూ లక్షలు ఆర్జిస్తున్నారు. అధిక లోడుతో ఇసుక పట్టణ సరిహద్దుల దాటుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు అంటున్నారు. ఇసుక తరలింపుపై నియంత్రణ కొరవడటంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంపై కొందరు అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు అంటున్నారు. దీంతో నదిలోని ఇసుక తగ్గి భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల్లో ఎండాకాలం వచ్చిందంటే నీరు అడుగంటుతున్నాయి.నదులలోని ఇసుకను ఇష్టారాజ్యంగా తోడటంతో భూగర్భ జల మట్టాలు పాతాళానికి చేరుకుంటున్నాయి.


 భద్రాద్రి నుంచి ఇసుక తరలిపోతోంది
దీంతో పట్టణాల్లో, గ్రామాల్లో సాగు నీరు, తాగునీటి కొరత ఏర్పడుతోంది.భద్రాచలం పట్టణం కూనవరం రోడ్డులోని శివారు ప్రాంతంలో గోదావరి నది నుంచి నిత్యం వందలాది ట్రాక్టర్లు, లారీలు ఇసుకను రవాణా చేస్తున్నాయి. సమీపంలో పంట పొలాలున్నా రవాణాదారులు పట్టించుకోవడం లేదు. ఇసుక అక్రమ రవాణాకు కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఊతమిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల పట్టణంలో కొన్ని ప్రభుత్వ నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఇసుకను తరలించాలంటే ముందుగా అధికారుల వద్ద నుంచి అనుమతి తీసుకుని బ్యాంకులో డీడీ తీయాల్సి ఉంటుంది. డీడీ తీసిన కూపన్ల పేరిట అభివృద్ధి పనులకు కొన్ని ట్రిప్పులు మాత్రమే పోను, ఆ కూపన్ల పేరుతో మిగతా ట్రిప్పుల ఇసుకను అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒకే కూపన్‌పై ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఇసుకను రావాణా చేస్తున్నారు. గోదావరి నదిలోని ఇసుకను తీసుకెళ్లి కాలనీల్లోని రహస్య ప్రాంతాల్లో నిల్వ చేస్తున్నారు. అనుమతి ఒకచోట ఉంటే దగ్గరలో ఉన్న మరోచోట నుంచి ఇసుకను తరలిస్తున్నారు.పంటలకు నీరందకపోవడం ఏటా సర్వసాధారణమైపోతోంది. రూ.వేల పెట్టుబడులతో సాగు చేసిన పంటలు కొద్ది రోజులకే ఎండిపోతుండటంతో అన్నదాతలు నష్టాలు చవిచూస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక తరలింపును నియంత్రించాలని పరివాహక ప్రాంత రైతులు కోరుతున్నారు.

No comments:
Write comments