ఈ వేస్ట్ నిర్మూలనకు దిశగా అడుగులు

 


హైద్రాబాద్, జూన్ 29, (globelmedianews.com
తెలంగాణ ఎలక్ట్రానిక్ వ్యర్థాలు (ఈ-వేస్ట్)ను శాస్త్రీయంగా నిర్మూలించేందుకు సర్కారు గట్టిగా కృషి చేస్తున్నది. అందుకు జీహెచ్‌ఎంసీ, కాలుష్య నియంత్రణ మండలి తమ వంతు ఉడతాసాయం చేస్తున్నాయి. ఇంతకుముందు ఇండ్లలో ఉపయోగించే పర్సనల్ కంప్యూటర్ల మొదలు ప్రతి ఒక్కరూ వాడే మొబైల్ ఫోన్ల వరకు ప్రతీదీ ఇంతకుముందు నేరుగా మునిసిపల్ చెత్తకుండీల్లోకే వెళ్లిపోయేవి. తెలంగాణ పీసీబీ గట్టి చర్యలు చేపట్టింది. ఫలితంగా గత కొన్నేళ్లుగా గుట్టలుగా పేరుకుపోతున్న కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల విడిభాగాలన్నీ శాస్త్రీయ నిర్మూలన కేంద్రాలకు తరలుతున్నాయి. వీటిని శాస్త్రీయ పద్ధతుల్లో నిర్మూలించడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయన్న విషయాన్ని సైతం గుర్తించారు. కంప్యూటర్లలోను, స్మార్ట్‌ఫోన్లలోను ఉండే మదర్‌బోర్డులను శాస్త్రీయంగా కరిగించడం ద్వారా అందులోంచి కొంతమొత్తంలో బంగారాన్ని సైతం సేకరిస్తున్నారు. 

ఈ వేస్ట్ నిర్మూలనకు  దిశగా అడుగులు

ఇలా ఈ -వ్యర్థాలను సశాస్త్రీయంగా నిర్మూలించేందుకు తెలంగాణ రాష్ట్రంలో 9 సంస్థలకు కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు ఇచ్చింది. మన దేశం సహా దాదాపు అన్నిచోట్లా కంప్యూటర్ లేని ఇల్లంటూ ఉండటం లేదు. ఇంటర్‌నెట్ పుణ్యమాని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోడానికి వీలుగా డెస్క్‌టాప్ పర్సనల్ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు.. ఇలా రకరకాల గాడ్జెట్లు సేకరిస్తున్నారు. మొబైల్ ఫోన్లకైతే ఇక లెక్కలేదు. 1995లో ఒక కంప్యూటర్ కొంటే కనీసం ఐదు నుంచి ఏడేళ్ల వరకు దాన్ని వాడేవారు. కానీ 2000 సంవత్సరం తర్వాత ఏ కంప్యూటర్‌నూ మూడేళ్లకు మించి వాడటం లేదు. ఇప్పుడు ప్రతి రెండేళ్లకో కొత్త కంప్యూటర్ సిస్టమ్ కొంటున్నారు. ఇలా కొత్తది కొన్నప్పుడల్లా పాతది పారేయడమే తప్ప ఏమీ చేయడం లేదు. అలా పారేస్తున్న పరికరాలన్నీ కలిపి టన్నుల కొద్దీ ఈ-వేస్ట్ పేరుకుపోతోంది. ఈ-వ్యర్థాలపై చాలామందికి అవగాహన లేకపోవడంతో ఇందులో చాలా భాగం సాధారణ చెత్త రూపంలోకి వెళ్తోంది. వీటిని అశాస్త్రీయంగా నాశనం చేయాలని ప్రయత్నించడంతో వాటిలో ఉండే కాడ్మియం, పాదరసం, సీసం లాంటి విషపదార్థాలు పర్యావరణంలోకి చేరిపోతున్నాయి. ఈ భారలోహాలను పీల్చినా, నీళ్లలో తాగినా అవి శరీరంలోకి చేరి నాడీ, రక్తప్రసారం, పునరుత్పత్తి, ఊపిరితిత్తులు, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. దానివల్ల పర్యావరణానికి తీవ్ర విధ్వంసం జరిగేది. కానీ ఇప్పుడు నిబంధనలు కఠినతరం చేశారు. నిర్వహణ, నిర్మూలన బాధ్యత కూడా సరఫరాదారుడిదేనంటూ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి జారీచేసిన మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి చకచకా అడుగులు వేస్తున్నది. జీహెచ్‌ఎంసీ కూడా అదే బాటలో నడుస్తున్నది. హైదరాబాద్-సైబరాబాద్ ప్రాంతాలు సాఫ్ట్‌వేర్ హబ్‌లుగా పేరొందడం, దేశంలోనే టాప్-3 నగరాల్లో ఒకటిగా నిలబడటంతో ఇక్కడ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్ పీసీలతో పాటు... స్మార్ట్‌ఫోన్ల వాడకం కూడా చాలా ఎక్కువ. వాటన్నింటినీ శాస్త్రీయంగా నిర్మూలించడంలో ఇటీవలి కాలంలో తెలంగాణ యంత్రాంగం మొత్తం ఏకతాటిపై నడుస్తోంది. ఇందుకోసం కాలుష్య నియంత్రణ మండలిలో ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటుచేశారు. దీన్ని స్వయంగా పీసీబీ సభ్య కార్యదర్శి పర్యవేక్షిస్తుండగా.. సీనియర్ అధికారి ఒకరు ఇన్‌చార్జిగా ఉండి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ వేస్ట్ నిర్వహణ నిబంధనలు 2017 అక్టోబరు 1 నుంచి అమలులోకి వచ్చాయి. ప్రతి ఉత్పత్తిదారు, వినియోగదారు, టోకు వినియోగదారు, కలెక్షన్ కేంద్రాలు, డీలర్లు, ఈ-రీటైలర్లు, రీఫర్బిషర్లు, రీసైక్లర్లు.. అందరికీ ఇవి వర్తిస్తాయి. వివిధ ఎలక్ట్రానిక్ పరికారలతో పాటు గృహోపయోగ పరికరాలు కూడా ఈ-వేస్ట్‌లోకే వస్తాయి. వాడకానికి ఇక పనికిరావని తేలినపుడు వాటిని రీసైకిల్ చేయాల్సి ఉంటుంది. వాటిలో కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, టీవీలు, మ్యూజిక్ సిస్టంలు, ఫ్రిజ్‌లు, ఏసీలు, వాషింగ్ మిషన్లు.. ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ-వ్యర్థాలను సేకరించేవాళ్లు గానీ, రీసైకిల్ చేసేవారు గానీ, వాటిని బాగుచేసి మళ్లీ ఉపయోగంలోకి తెచ్చేవారు (రీఫర్బిషర్లు) గానీ వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ 180 రోజులకు మించి ఉంచుకోకూడదు. అలాగే, తాము సేకరించిన, నిల్వచేసిన, అమ్మిన లేదా బదిలీ చేసిన వ్యర్థాలకు సంబంధించిన రికార్డు కూడా తప్పనిసరిగా నిర్వహించాలి. ఒకవేళ ఇలాంటివాటిని ఏమైనా బాగుచేయడానికి లేదా రీసైకిల్ చేయడానికి అవసరం అనుకుంటే అప్పుడు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు గడువును 365 రోజులకు పెంచే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఇంకా డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్, టాబ్లెట్, ఐప్యాడ్, టీవీ, స్పీకర్లు.. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటున్నారా.. లేదా? అప్‌డేట్ కావడం వరకు ఓకే.. మరి పాతవాటిని ఏం చేస్తున్నారు? ఇంట్లో అలాగే ఉంచేస్తున్నారా.. లేక మామూలుగా పారేస్తున్నారా? అలా పారేసే ఎలక్ట్రానిక్ చెత్త పెద్ద కొండలా తయారైంది. మానవాళికి ఇది పెద్ద ముప్పుగా పరిణమిస్తోంది. ఇందులోనూ ప్లాస్టిక్ వ్యర్థాలు చాలా ఎక్కువగా ఉండటం, వాటికి తోడు కొన్ని లోహాలు కూడా కలవడంతో ముప్పు రెట్టింపవుతోంది. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలన్నింటిలోనూ ‘ఈ-వేస్ట్’ సమస్య తీవ్రంగానే ఉంది. తెలంగాణలోనూ ఇది ఎక్కువగానే కనిపిస్తోంది. కేవలం పర్యావరణానికి హాని చేయడమే కాక.. ప్రజారోగ్యాల మీద కూడా తీవ్ర దుష్ప్రభావం చూపుతోంది. ఈ వేస్ట్‌లో ఉండే అనేక లోహాలు మట్టిలో కలిసిపోవడం, తద్వారా భూమి లోపలి పొరల వరకు, భూగర్భ జలాలతో సహా కాలుష్యాన్ని పంచడం అతిపెద్ద ప్రమాదం. ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 40 కోట్ల టన్నుల ఈ-వేస్ట్ పోగవుతోంది. ఇందులో కేవలం 13 శాతం మాత్రమే రీసైకిల్ అవుతుండగా, మిగిలినదంతా మట్టిపాలవుతోంది. ఈ వేస్ట్‌లో చైనా, గయు దేశాలు ప్రపంచంలో అగ్రస్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు దేశాల్లోనే గంటకు 4వేల టన్నుల ఈ-వేస్ట్ పోగవుతోంది. గయులో 88 శాతం మంది ప్రజలకు న్యూరలాజికల్, సైకలాజికల్ సమస్యలున్నాయి. దానంతటికీ కారణం ఈ ఎలక్ట్రానిక్ చెత్తేననడంలో సందేహం లేదని నిపుణులు చెబుతున్నారు.

No comments:
Write comments