కేరళకు తాకిన నైరుతి

 


తిరువనంతపురం, జూన్ 8 (globelmedianews.com)
నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్టు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ ఏడాది వారం రోజుల ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్టు ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. నైరుతి ప్రవేశంతో దేశంలో వర్షాకాలం ప్రారంభమైందని ఐఎండీ తెలిపింది. రుతుపవనాలు ప్రవేశించడంతో కేరళలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు నెలలుగా ఎండలతో అల్లాడుతోన్న జనానికి నైరుతి ప్రవేశంతో ఉపశమనం లభిస్తుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో వ్యవసాయం కుంటుపడింది. ప్రాజెక్టుల్లో నీటి మట్టం గణనీయంగా తగ్గిపోవడంతో తాగునీటికి కూడా జనం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేశంలోని అధిక భాగం గ్రామీణ ప్రాంతాలు నైరుతి వర్షపాతంపై ఆధారపడి ఉన్నాయి. మొత్తం 75 శాతం వ్యవసాయానికి నైరుతిలో కురిసే వర్షాలే ఆధారం.


కేరళకు తాకిన నైరుతి
నైరుతి రుతుపవనాలు వల్ల సక్రమంగా వర్షాలు కురిస్తే అది ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే దేశ జీడీపీలో వ్యవసాయ రంగం ప్రధాన భూమిక పోషిస్తుంది. ఇక ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి నమోదయ్యాయి. రాజస్థాన్‌లోని చురులో అత్యధికంగా 51 డిగ్రీ ఉష్ణోగ్రత నమోదయ్యిదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు, రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకడంతో మరో మూడు రోజుల్లో ఏపీలోకి ప్రవేశించనున్నాయి. జూన్ 13న దక్షిణ తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా జూన్ చివరినాటికి విస్తరిస్తాయి. జూన్ 29 నాటికి ఢిల్లీకి విస్తరిస్తాయని ఐఎండీ రెండు రోజుల కిందట తెలిపింది. కేరళలోని 14 కేంద్రాల్లో రెండు రోజుల కంటే ఎక్కువ 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే రుతపవనాలు వచ్చినట్టు నిర్ధరిస్తారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, జూన్-సెప్టెంబర్ మధ్య 96 శాతం వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ ఇప్పటికే వెల్లడించింది. మే చివరి వారంలో విడుదల చేసిన రెండో దశ నివేదిక ప్రకారం.. వాయువ్య భారతంలో 94 శాతం, మధ్యభారతంలో 100 శాతం, దక్షిణాదిలో 97శాతం, తూర్పు భారతంలో 91శాతం వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ పేర్కొంది. ఖరీఫ్‌కు కీలకమైన జులై, ఆగస్టు నెలల్లో వర్షాలు బాగా కురుస్తాయని వెల్లడించింది. పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం ఎల్‌నినో పరిస్థితులు నెలకొన్నాయి. నైరుతి ముగిసేవరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, రుతుపవనాల చివరి దశలో ఎల్‌నినో తటస్థ స్థాయికి చేరుతుందని తెలుస్తోంది. 

No comments:
Write comments