గంటా వర్సెస్ పయ్యావుల

 


అనంతపురం, జూన్ 17 (globelmedianews.com)
విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు అధికారం ఉండాలి. లేకపోతే అసలు తట్టుకోలేరని ప్రచారంలో ఉంది. 1999లో అధికారంలో ఉందని టీడీపీలో చేరి ఎంపీ అయిన ఆయన 2004 నాటికి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచేసరికి పార్టీ ఓడిపోయింది. దాంతో ప్లేట్ ఫిరాయించి ప్రజారాజ్యం పార్టీలో చేరిపోయారు. అటునుంచి కాంగ్రెస్ లోకి కూడా చేరి మొత్తానికి మంత్రి అయిపోయారు. ఇక విభజన తరువాత కాంగ్రెస్ కి పుట్టగతులు ఉండవని తేలడంతో మళ్ళీ సైకిలెక్కేశారు. రాజకీయ అంచనాలు వేయడంతోనూ, ఏ గాలి ఎటు వీస్తుందో కనుగొనగలగడంలోనూ గంటాను దిట్ట అంటారు. అలా ఆయన వేసిన అంచనా ఫలించి టీడీపీ 2014లో అధికారంలోకి రావడంతో మంత్రిగా అయిదేళ్ళు బుగ్గ కార్లతో తిరిగారు. 2019 నాటికి గాలి మళ్ళిందని తెలుసు, ఫ్యాన్ గాలి ప్రభంజనంగా వీస్తోందనీ తెలుసు. ఆ పార్టీలోకి వెళ్ళాలని ట్రై చేసినా జగన్ నో అనడంతో తప్పనిసరై గంటా టీడీపీలో ఉండిపోయారు.ఇపుడు టీడీపీ ప్రతిపక్షంలోకి వచ్చింది. 


గంటా వర్సెస్ పయ్యావుల
చంద్రబాబు తాను ప్రతిపక్ష నేతగా ఉండను అని మొదట్లో అన్నారని ప్రచారం సాగింది. దాంతో గెలిచిన తరువాత గంటా చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. బాబు నో అంటే తాను ప్రతిపక్ష నాయకుడి పోస్ట్ తీసుకోవాలని ఆయన స్కెచ్ వేసినట్లుగా అప్పట్లో న్యూస్ వైరల్ అయింది. అయితే చంద్రబాబే విపక్ష నేత అని నిర్ధారణ కావడంతో గంటా అలా సైలెంట్ అయిపోయారు. ఇపుడు మళ్ళీ ఆయన సరికొత్త ఆలోచన చేస్తున్నారుట. ప్రతిపక్ష పార్టీకి ప్రజా పద్దుల కమిటీ పీయేసీ చైర్మన్ పదవి ఇస్తారు. ఇది గౌరవనీయమైన పదవి కావడంతో పాటు సమీక్షలు నిర్వహించవచ్చు. జిల్లాలు తిరగవచ్చు. దాంతో ఈ పదవి కోసం గంటా గేలం వేస్తున్నారట. ఈ కారణంగానే ఆయన మళ్ళీ అధినేత వద్ద పైరవీని షురూ చేశారని అంటున్నారు.అయితే ఈ కీలకమైన పదవి కోసం అనంతపురం జిల్లాకు చెందిన ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కూడా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారుట. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన పయ్యావులను రాజకీయ‌ దురద్రుష్టవంతునిగా చెప్పుకోవాలి. ఆయన గెలిస్తే పార్టీ ఓడుతుంది. ఆయన ఓడితే పార్టీ గెలుస్తంది. ఈ యాంటి సెంటిమెంట్ బారిన పడిన పయ్యావుల సీనియర్ అయినా కూడా ఇప్పటికీ మంత్రి కాలేకపోయారు. ఈ సానుభూతి చంద్రబాబుకు కూడా ఉంది. పైగా ఆయన నిబద్ధత, రాయలసీమలో పార్టీ పట్టు పెంచుకోవడం వంటి అంశాల ఆధారంగా పయ్యావుల వైపే బాబు మొగ్గు చూపుతున్నారని టాక్. గంటా గత అయిదేళ్ళలోమంత్రిగా పనిచేసి అధికారాన్ని అనుభవించారు. అందువల్ల పయ్యావులకే ఉన్న ఒక్క పదవి ఇవ్వడం న్యాయమని పార్టీ వర్గాలు కూడా అంటున్నాయట. మొత్తానికి గంటా పార్టీ ఓడినా పదవి కోసం చేస్తున్న ప్రయత్నాల పట్ల సొంత పార్టీలోనే విస్మయం వ్యక్తమవుతోంది.

No comments:
Write comments